CM Jagan సమక్షంలో.. ఎందుకీ పూనకం..!?

ABN , First Publish Date - 2022-01-01T07:49:01+05:30 IST

CM Jagan సమక్షంలో.. ఎందుకీ పూనకం..!?

CM Jagan సమక్షంలో.. ఎందుకీ పూనకం..!?

  • పూనం మాలకొండయ్య తీరుపై విస్మయం
  • గత ప్రభుత్వంపై సీఎం సమక్షంలో విమర్శలు
  • పాడి సంఘాలను నిర్వీర్యం చేశారని ఆరోపణ 
  • నాటి టీడీపీ ప్రభుత్వంలో పూనం కీలక పాత్ర 
  • వైద్య, ఆరోగ్య ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు
  • శాఖలో మహారాణిలా పూర్తిస్థాయి  పెత్తనం
  • ఇప్పుడు అదే సర్కారుపై విమర్శలు
  • మెడ్‌టెక్‌జోన్‌లో ఆమెపై అభియోగాలు 
  • సీఐడీ విచారణ పేరిట ఎత్తేసిన జగన్‌ సర్కారు
  • ఆ మేలుకు కృతజ్ఞతగానే పూనం పొగడ్తల పర్వం
  • స్వామి భక్తి చాటుకునేలా ఆమె వ్యాఖ్యలు


‘పశుసంవర్థక శాఖ మొదటి సమీక్ష సమావేశం జరిగినప్పుడు రాష్ట్రంలో పాల ఉత్పత్తి ఎలా ఉందని ముఖ్యమంత్రి అడిగారు. దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తిలో రాష్ట్రం 4వ స్థానంలో ఉంది... 154 లక్షల లీటర్లు ఉత్పత్తి చేస్తున్నామని మేం చాలా గర్వంగా చెప్పాం. మరి పాడి రైతులకు ఇస్తున్న ధరలో దేశంలో మీ స్థానం ఎక్కడ ఉందని సీఎం ప్రశ్నించారు. అట్టడుగున ఉంది... అని మేం మెల్లగా చెప్పాం. ఎందుకు... అని సార్‌ అడిగారు. మేం ఏమి చెబుతాం?... కానీ మీ అందరికీ తెలుసు. గత పాలకుల నిర్లక్ష్యంతో నిర్వీర్యమైన పాడిసంఘాలు, ఛిన్నాభిన్నమైన పాడిరైతుల బతుకులను బాగు చేసేందుకు తీసుకున్న నిర్ణయమే జగనన్న పాలవెల్లువ కార్యక్రమం.’’ ఈ వ్యాఖ్యలు ఏ రాజకీయ నేతవో, ప్రజా ప్రతినిధివో కావు. వ్యవసాయ, పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పూనం మాలకొండయ్య చేసిన వ్యాఖ్యలివి.


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో బుధవారం జగనన్న పాలవెల్లువ కార్యక్రమం అమలుపై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పూనం మాలకొండయ్య మాట్లాడిన మాటలు దుమారం రేపుతున్నాయి. ఓ అధికారి హోదాలో ఉంటూ గత ప్రభుత్వ వైఫల్యం... అంటూ రాజకీయ వ్యాఖ్యలు చేస్తారా అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్‌ అధికారులు, ఐఏఎస్‌ వర్గాలు సైతం ఆమె తీరును తప్పుబడుతున్నాయి. గత ప్రభుత్వ పనితీరు గురించి ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడితే రాజకీయ కోణం ఉందనుకోవచ్చు. కానీ గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతల్లో పనిచేస్తున్న అధికారి ఇలా మాట్లాడటం కలకలం సృష్టిస్తోంది. అనూహ్యంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఏం జరిగి ఉంటుంది? ఎందుకోసం ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్నది చర్చనీయాంశమైంది. 


గత ప్రభుత్వంలో ఎనలేని ప్రాధాన్యం 

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన పూనం మాలకొండయ్య గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. నాటి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో తనదైన ముద్రవేశారు. అప్పట్లో ఆమెకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. ఆ శాఖ మంత్రి, ఇతర అధికారుల కంటే పూనం మాటకే నాటి ప్రభుత్వం విలువ ఇచ్చేది. దీంతో వైద్య, ఆరోగ్యశాఖ అంటే ఆమే బాస్‌ అన్న స్థాయిలో పూనం పేరు మార్మోగింది. శాఖలో మహారాణిలా అధికారం చెలాయించారు. జగన్‌ సర్కారు వచ్చాక ఆమెను వ్యవసాయ, పశు సంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేశారు. కొద్దిరోజులకే వ్యవసాయ శాఖను తొలగించారు. ఆ తర్వాత ఏమైందో కానీ, తిరిగి ఆ శాఖను ఆమెకే అప్పగించారు. తదనంతరం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.


కదలని అభియోగాల ఫైల్‌ 

గత ప్రభుత్వ హయాంలో వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో జరిపిన కొనుగోళ్లు, ప్రత్యేకించి మెడ్‌టెక్‌జోన్‌ ఏర్పాటు, అందులో జరిగిన అంశాలపై జగన్‌ ప్రభుత్వం విచారణకు అదేశించింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఏసీబీ) దీనిపై విచారణ జరిపి కొన్ని కీలకమైన అంశాల్లో అప్పట్లో ఆ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న పూనం మాలకొండయ్య పేరును తెరపైకి తీసుకొచ్చింది. ఆమెపై పలు అభియోగాలు మోపుతూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీనిపై సీఐడీతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వం భావించింది. కానీ ఏం జరిగిందో, ఏమో ఆ ఫైలు ముందుకు కదల్లేదు. ఆ తర్వాత కొంతకాలానికే ఆమెపై ఉన్న అభియోగాలను తొలగిస్తూ సర్కారు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. 


స్వామి భక్తిని చాటుకొనేలా... 

గత ప్రభుత్వంలో వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిగా కీలక పాత్ర పోషించిన పూనం... జగన్‌ సర్కారు చేపట్టిన విచారణల పర్వంలో మెడ్‌టెక్‌ జోన్‌ విషయంలో ముప్పును ఎదుర్కొన్నారు. ఆ తర్వాత అదే సర్కారు ఆదేశాలతో ఒడ్డన పడ్డారు. సీఐడీ విచారణ జరగకముందే ఆమెపై ఉన్న అభియోగాలను తొలగించడంతో సీఎం జగన్‌ చేసిన మేలుకు కృతజ్ఞతగా... స్వామిభక్తిని చాటుకునేలా గత ప్రభుత్వ వైఫల్యాలు అంటూ పూనం మాట్లాడారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై ఐఏఎస్‌ వర్గాలు సైతం విస్మయం చెందుతున్నాయి. ‘ప్రభుత్వాలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ అధికార వ్యవస్థ శాశ్వతం. ఒక్కసారి ఓ వ్యక్తి సర్వీసులో చేరితో కనీసం 35ఏళ్లపైనే ప్రజలకు సేవ చేయాల్సి ఉంటుంది. కానీ అధికారంలోకి ఉన్న రాజకీయ పార్టీల కాలపరిమితి ఐదేళ్లే. గతంలో ఆమె వైద్య, ఆరోగ్యశాఖ మఖ్యకార్యదర్శిగా పనిచేసినప్పుడు శాఖ వ్యవహారాల్లో ఆమె విఫలమయ్యారా? విజయం సాధించారా? ఆ శాఖ వైఫల్యాల్లో ఆమె పాత్ర ఏమిటో అంచనా వేసుకోవాలి.


అదే సమయంలో పశుసంవర్థక శాఖలో మరో సీనియర్‌ అధికారి పనిచేశారు. డెయిరీ విషయంలో ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని, రైతులు అన్యాయమైపోతున్నారని, ధరల విషయంలో అట్టడుగున పడిపోయామని నాటి ప్రభుత్వానికి ఆయన నివేదిక ఇచ్చారా? ఆ పరిస్థితిని మార్చాలని ఏమైనా లిఖిత పూర్వకంగా కోరారా?... లేక ఆయన తన విధుల నిర్వహణలో విఫలమయ్యారా? తన వ్యాఖ్యల ద్వారా పూనం చెప్పదలుచుకున్నదేంటి?’’ అని ఓ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్యలు సీఎం జగన్‌పై స్వామిభక్తిని చాటుకునేలా ఉన్నాయన్న ప్రచారం అధికార వర్గాల్లో సాగుతోంది. 

Updated Date - 2022-01-01T07:49:01+05:30 IST