Rajasthan: మోదీ మోకాళ్లపై వంగి క్షమించమనడంపై గెహ్లాట్ చురకలు..!

ABN , First Publish Date - 2022-10-02T00:49:57+05:30 IST

రాజస్థాన్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభకు ఆలస్యంగా వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. మైక్ నిబంధనలు చెబుతూ..

Rajasthan: మోదీ మోకాళ్లపై వంగి క్షమించమనడంపై గెహ్లాట్ చురకలు..!

జైపూర్: రాజస్థాన్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభకు ఆలస్యంగా వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. మైక్ నిబంధనలు చెబుతూ తాను ప్రసంగించలేకపోతున్నానంటూ బహిరంగంగా ప్రజలకు క్షమాపణలు చెప్పడం, మోకాళ్ల మీద వంగి సభికులకు నమస్కారం చేయడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ ఆక్షేపణ తెలిపారు. ''అశోక్ గెహ్లాట్ కంటే నేనే ఎక్కువ విధేయుడనని చెప్పుకునేందుకు  ఆయన మోకాళ్ల మీద వంగి క్షమాపణలు చెప్పారా?'' అని ప్రశ్నించారు. దానికి బదులు, దేశ ప్రజలు పరస్పర ప్రేమ, సౌభ్రాతృత్వంతో మెలగాలనే సందేశం ఆయన ఇచ్చి ఉంటే బాగుండేదని అన్నారు.


షెడ్యూల్ ప్రకారం శిరోహిలోని అబూ రోడ్డులో నిర్వహించిన ర్యాలీలో న‌రేంద్ర మోడీ ప్రసంగించాల్సి ఉంది. ప్రసంగించాల్సిన సమయం కంటే ఆలస్యంగా ఆయన అక్కడికి చేరుకున్నారు. తాను రావడం ఆలస్యం కావడం, రాత్రి పది గంటలు అవుతుందటంతో అదే విషయాన్ని సభలో ప్రకటించిన మోదీ...తనను ప్రజలు క్షమించాలని, వారి ప్రేమాభిమానాల కోసం మళ్లీ వస్తానని మాటిచ్చారు. వేదికపైనే మోకాళ్ల మీద వంగి తలను నేలకు ఆనుస్తూ మూడుసార్లు సభికులకు నమస్కరించారు.


నా ఇమేజ్ ఆయనకు తెలుసు...

కాగా, మోకాళ్లపై మూడుసార్లు వంగి మోదీ క్షమాపణలు చెప్పడంపై అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ...''రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్‌కు ఇన్న ఇమేజ్, విధేయత, నిరాడంబరత గురించి ఆయనకు (మోదీ) బాగా తెలుసు. స్వతసిద్ధంగా చిన్నప్పటి  నుంచి నేను అలాగే ఉంటాను. నా కంటే ఆయన ఎక్కువ విధేయుడని చెప్పుకునే ప్రయత్నమే ఆయన చర్యలో కనిపిస్తుంది'' అని గెహ్లాట్ అన్నారు. కనీసం దేశ ప్రజలు పరస్పర ప్రేమాభిమానాలు, సౌభ్రాతృత్వంతో మెలగాలనే సందేశాన్ని కూడా ప్రధాని ఇవ్వలేకపోయారు. మూడుసార్లు మోకాళ్లపై వంగి నమస్కరించడం ద్వారా మీరు (మోదీ) ఎలాంటి సందేశం ఇవ్వదలచుకున్నారు? అని గెహ్లాట్ ప్రశ్నించారు. ప్రజలందరూ పరస్పర సామరస్యంతో మెలగాలని ప్రధాని సందేశం ఇచ్చి ఉంటే తానే స్వయంగా మోదీని కలిసి అభినందనలు తెలిపేవాడినని అన్నారు.

Updated Date - 2022-10-02T00:49:57+05:30 IST