Pulwama Attack: మోదీపై సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత

ABN , First Publish Date - 2022-01-09T17:56:07+05:30 IST

బీజేపీ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ మండిపడ్డారు. స్మృతి ఇరానీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండానే కాంగ్రెస్‌పై ‘హత్యాయత్నం’ ఆరోపణలు చేస్తున్నారని, అయితే పుల్వామా దాడిలో ప్రధానిపై ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వేయడం లేదంటూ..

Pulwama Attack: మోదీపై సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత

న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల ముందు ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన బాంబు దాడిలో 40 మంది సీఆర‌్‌పీఎఫ్ జవాన్లు చనిపోయారు. కాగా ఈ దారుణ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎందుకు ప్రశ్నించరని కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు చేశారు. భద్రతా సమస్య కారణంతో పంజాబ్ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ కార్యక్రమమూ నిర్వహించకుండా వెనక్కి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై కాంగ్రెస్ పార్టీపై భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానికి హాని తలపెట్టడానికి కాంగ్రెస్ యత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరో అడుగు ముందుకు వేసి ‘‘అదృష్టవశాత్తూ ప్రధానమంత్రి ప్రాణాలతో బయటపడ్డారు’’ అని వ్యాఖ్యానించారు.


కాగా, బీజేపీ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ మండిపడ్డారు. స్మృతి ఇరానీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండానే కాంగ్రెస్‌పై ‘హత్యాయత్నం’ ఆరోపణలు చేస్తున్నారని, అయితే పుల్వామా దాడిలో ప్రధానిపై ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వేయడం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. పుల్వామా దాడి ప్రభుత్వానికి సమాచారం ఉందని నెటిజెన్లు ఆరోపణలు చేస్తుంటారు. కానీ, ప్రధాన స్రవంతిలో ఉన్నవారు ఎవరూ ఇలా వ్యాఖ్యానించలేదు. కానీ, మాజీ బీజేపీ నేత అయిన ఉదిత్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా పెద్ద దుమారం లేచింది.


స్మృతి ఇరానీ వ్యాఖ్యలను తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి ఆధారాలు లేకుండానే బీజేపీ నేతలంతా మూకుమ్మడిగా ‘హత్యాయత్నం’ ఆరోపణలు అనర్గళంగా చేస్తున్నారు. మరి పుల్వామా దాడి గురించి ప్రధానమంత్రిని ఎందుకు ప్రశ్నించరు?’’ అని ట్వీట్ చేశారు. ట్వీట్ చవరిలో కాంగ్రెస్ పార్టీని ట్యాగ్ చేశారు.

Updated Date - 2022-01-09T17:56:07+05:30 IST