Jul 8 2021 @ 02:08AM

మధుబాలతో ప్రేమెందుకు ఫలించలేదు?

‘దిలీప్‌కుమార్‌కు ముందు- తర్వాత’- హిందీ చలనచిత్ర చరిత్రకు సూపర్‌స్టార్‌ అమితాబ్‌ ఇచ్చిన నిర్వచనం ఇది. హిందీ చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాలనుకునే వారందరికీ దిలీప్‌కుమార్‌ ఒక పాఠం. మన కళ్ల ముందు కనిపించే అనేక జీవితాలను కళ్లకు కట్టినట్లు నటించి చూపించిన దిలీప్‌కుమార్‌ ఆత్మకథ- ‘ది సబ్‌స్టెన్స్‌ అండ్‌ ది షాడో’ నుంచి ఆసక్తికరమైన అంశాలు..


నేను మధుబాలతో ప్రేమలో పడ్డానా? అప్పటి పత్రికలు, మ్యాగజైన్లు రిపోర్టు చేసినట్లు మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నామా? ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయామా? లేక వేరే కారణాలేమైనా ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ నేనిప్పుడు సమాధానం చెబుతాను. మధు ఒక ప్రతిభావంతురాలైన నటి, మంచి స్నేహితురాలు. ఆమె పట్ల నేను ఆకర్షితుడనయ్యాననేది నిజం. సెట్‌లో మధు చాలా చలాకీగా ఉండేది. అందరినీ కలుపుకొని పోయేది. ఒక స్ర్తీకి ఉండాల్సిన ఉత్తమమైన లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయి. నేను సెట్‌లో చాలా బెరుకుగా ఉండేవాడిని. నాలో ఆ బెరుకు పోవటానికి మధుయే కారణం. మొగల్‌-ఎ-ఆజం సినిమా సమయానికి మా ఇద్దరి మధ్య గాఢమైన బంధం ఏర్పడింది. మేమిద్దరం పెళ్లి చేసుకుంటామనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. మా పెళ్లికి మధు వాళ్ల నాన్న అతుల్లా ఖాన్‌ అంగీకరించలేదని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. మా పెళ్లికి మధు వాళ్ల నాన్న అంగీకరించాడు. ఆయనకు ఒక ప్రొడక్షన్‌ హౌస్‌ ఉండేది. ఆ ప్రొడక్షన్‌ హౌస్‌ పేరు మీద తీసే సినిమాలన్నింటిలోను మేమిద్దరం నటించాలనేది ఆయన కోరిక. ఈ విషయాన్ని మధు చెప్పినప్పుడు నేను ఆ ప్రతిపాదనకు అంగీకరించలేదు. నా ప్రాజెక్టుల ఎంపిక విషయంలో నేను ఎవ్వరి ప్రమేయాన్ని ఇష్టపడనని, ఆ విషయంలో ఎటువంటి రాజీ ఉండదని మధుకు చెప్పాను. మా సినీ కెరీర్‌లో వ్యక్తిగతమైన అంశాలు ఎప్పుడూ అడ్డం కాకూడదనేది నా ఉద్దేశం. ఈ విషయాన్ని మధుకు, వాళ్ల నాన్నకు కూడా చెప్పాను. మా మధ్య ఈ విషయంలో అనేక సార్లు చర్చలు కూడా జరిగాయి. ఈ ప్రస్తావన వచ్చినప్పుడల్లా మధు తటస్థంగా ఉండిపోయేది. ఎందుకో నా వాదన ఆమెకు నచ్చేది కాదు. ‘పెళ్లైతే ఇవన్నీ సర్దుకుపోతాయి’ అని నచ్చచెప్పటానికి చూసేది. నా వ్యక్తి స్వేచ్ఛమధు వాళ్ల నాన్నకు నచ్చలేదు. నేను చాలా దురుసుగా, మొండిగా వ్యవహరిస్తున్నానని మధుకు నూరిపోయటం మొదలుపెట్టాడు. దాంతో పరిస్థితి చేయిదాటిపోయింది. మేమిద్దరం టాప్‌ ఆర్టిస్టులుగా ఎదగటానికి మా పెళ్లే అడ్డం వస్తుందనిపించింది. మా ఇద్దరికీ నష్టం కలిగించే పెళ్లి జరగటం మంచిది కాదనిపించింది. మొగల్‌-ఎ-ఆజం సినిమా పూర్తి కాకుండానే మేమిద్దరం విడిపోయాం. మేమిద్దరం తెరపై మంచి జంట కావచ్చు. కానీ నిజ జీవితంలో పెళ్లి చేసుకొనే మహిళ తాను పొందే దాని కన్నా ఎక్కువ త్యాగం చేయటానికి సిద్ధపడాలి. మా అమ్మ జీవితంలో ఎన్ని కష్టనష్టాలు పడి మమ్మల్ని పెంచిందో నేను అతి దగ్గరగా చూశాను. శాశ్వత భాగస్వామి గురించి ఆలోచించకుండా తాత్కాలికమైన ఆకర్షణకు గురయ్యాననిపించింది. అంతేకాదు, నా ప్రాధమ్యాలకు భిన్నమైన ప్రాధమ్యాలు ఉన్న వ్యక్తితో జీవితాంతం గడపలేననిపించింది. మొగల్‌-ఎ-ఆజం సినిమాలో హీరో, హీరోయిన్లు ముద్దు పెట్టుకొనే సీను ఒకటి ఉంది. పెదాలు కలిసే సమయానికి ఒక అందమైన ఈక స్ర్కీనుపై కనబడుతుంది. హిందీ సినిమా చరిత్రలోని బెస్ట్‌ రొమాంటిక్‌ సీన్లలో ఇది కూడా ఒకటి. ఆ సీను చిత్రీకరించే సమయానికి మేమిద్దరం ఒకరితో ఒకరం కనీసం మాట్లాడుకొనే వాళ్లం కూడా కాదు..Bollywoodమరిన్ని...