మాకే ఎందుకిలా...?

ABN , First Publish Date - 2022-04-20T05:30:00+05:30 IST

ఉన్నత చదువులు చదివి సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పనిచేస్తున్న చాలామంది ఆ ఉద్యోగాలకు రాజీనామా చేసి సచివాలయ ఉద్యోగాల్లో చేరారు.

మాకే ఎందుకిలా...?
గుర్రకొండ మండలం తరిగొండ సచివాలయంలో విధుల్లో ఉన్న ఉద్యోగులు, పనుల కోసం వచ్చిన ప్రజలు

సచివాలయ సిబ్బందికి మూడు పూటలా బయోమెట్రిక్‌ 

కొన్నిచోట్ల సర్వర్‌ పనిచేయక వేలిముద్రకు అగచాట్లు 

రగిలిపోతున్న సచివాలయ ఉద్యోగులు

సగటున రోజుకు సచివాలయానికి వచ్చే వారు 25 మందే

ప్రభుత్వంపై సచివాలయ ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆగ్రహం



సొంత ఊరిలోనే ఉద్యోగం వచ్చిందని ఆనందపడ్డారు. ప్రైవేటు కంపెనీల్లో ఉన్నత కొలువులకు రాజీనామా చేసి సొంత ఊరి బాట పట్టారు. ఉద్యోగంలో చేరిన తరువాత ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాం అన్నట్లుగా తయారైంది సచివాలయ ఉద్యోగుల పరిస్థితి. తాజాగా రోజుకు మూడుసార్లు బయోమెట్రిక్‌ విధానంలో హాజరు వేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో చాలామంది ఆగ్రహంతో ఉన్నారు. మూడు పూటల బయోమెట్రిక్‌ విధానంపై.. సచివాలయాల ఉద్యోగులు ఏమనుకుంటున్నారు..? అనే అంశంపై.. ఆంధ్రజ్యోతి సచివాలయాలు విజిట్‌ చేసింది. 


(రాయచోటి - ఆంధ్రజ్యోతి): 

ఉన్నత చదువులు చదివి సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పనిచేస్తున్న చాలామంది ఆ ఉద్యోగాలకు రాజీనామా చేసి సచివాలయ ఉద్యోగాల్లో చేరారు. ఒక్కో సచివాలయంలో 10 మంది ఉద్యోగులను నియమించారు. ఒక్కో ఉద్యోగికి రూ.15 వేలు వేతనం ప్రొబేషన్‌ పీరియడ్‌ రెండేళ్ల తరువాత ప్రభుత్వ ఉద్యోగిగా డిక్లేర్‌ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వేతనం తక్కువ అయినప్పటికీ రెండేళ్ల తర్వాత రెగ్యులర్‌ అవుతుంది ప్రభుత్వ ఉద్యోగిగా మారిపోతామనే ధీమాతో ఉద్యోగాల్లో చేరారు. అయితే రెండేళ్లు ప్రొబేషన్‌ పీరియడ్‌ దాటినా ఇంతవరకు రెగ్యులర్‌ కాలేదు. చాలీచాలని వేతనంతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. దీనికి తోడు రోజుకు మూడుసార్లు బయోమెట్రిక్‌ విధానంలో హాజరు వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై వారు రగిలిపోతున్నారు. తమ అసంతృప్తి బయటపడితే.. ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని.. లోలోపల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సగటున ఒక సచివాలయానికి ఫిర్యాదుదారులు రోజూ 25 మంది వరకు మాత్రమే వస్తారు. అదీ దాదాపుగా ఉదయం పూటే వస్తారు. అరుదుగా మాత్రమే మధ్యాహ్నంపైన వస్తారు. ఒకవేళ ఒకరో.. ఇద్దరికో  ఏదైనా పని ఉన్నా.. మరుసటి రోజు ఉదయమే వస్తారు. అయితే ఇదేమీ గుర్తించకుండా.. రాష్ట్ర ప్రభుత్వం మూడు పూటలా ఉద్యోగులు బయోమెట్రిక్‌ వేయాలని నిబంధన పెట్టడంపై సచివాలయ ఉద్యోగులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఫీల్డ్‌ వర్కు ఉన్న వాళ్లకే కష్టం

ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడుసార్లు బయోమెట్రిక్‌ విధానం వల్ల ఎక్కువగా సచివాలయాల్లో ఫీల్డ్‌ తిరిగే వాళ్లకే కష్టమని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. మదనపల్లె పట్టణం రామారావు కాలనీలోని సచివాలయంలో సోమవారం 8 మంది విధులకు హాజరయ్యారు. ఉదయం 10.30 గంటల నుంచి 11గంటలలోపు ఒక్కొక్కరు వచ్చారు. ఉదయం నుంచి సర్వర్‌ పనిచేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగులు అందరూ కార్యాలయం ఆవరణలో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. బయోమెట్రిక్‌ పనిచేయకపోవడంతో.. ఏ పని మీద బయటకు వెళుతున్నారో రిజిస్టర్‌లో నమోదు చేసి వెళ్ళారు. మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ బయోమెట్రిక్‌ కోసం సచివాలయానికి హాజరయ్యారు. రైల్వేకోడూరు మండలం వెంకటరెడ్డిపల్లె సచివాలయంలో సోమవారం 8 మంది విధులకు హాజరయ్యారు. ఆంధ్రజ్యోతి విజిట్‌ చేసినపుడు ముగ్గురు విధుల్లో ఉన్నారు. మిగిలిన వాళ్లు ఫీల్డ్‌కు వెళ్ళినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. సాయంత్రం బయోమెట్రిక్‌ కోసం ఫీల్డ్‌కు వెళ్ళిన సిబ్బంది ఊసురోమంటూ సచివాలయానికి వచ్చారు. ఇదే పరిస్థితి జిల్లా అంతటా ఉంది.. సాధారణంగా సచివాలయానికి వెళ్లిన ఉద్యోగులు బయోమెట్రిక్‌ వేసి ఫీల్డ్‌కు దాదాపుగా అందరూ వెళతారు. సచివాలయ సిబ్బందిలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, వీఆర్‌వో, సర్వే అసిస్టెంట్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, మహిళా పోలీసు, ఏఎన్‌ఎం, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌,  సిరికల్చర్‌ అసిస్టెంట్‌, హార్టికల్చర్‌ అసిస్టెంట్‌, వెటర్నరీ అసిస్టెంట్‌లు దాదాపు ప్రతిరోజూ ఫీల్డ్‌కు వెళ్లాల్సిందే. ఒక్కోసారి ఫీల్డ్‌లోనే ఎక్కువ పని కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడుసార్లు బయోమెట్రిక్‌ విధానం వల్ల ఇలా ఫీల్డ్‌కు వెళ్లే వారికే ఇబ్బందిగా ఉంటుంది. 


సగటున రోజుకు 25 మంది

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాలలో సగటున రోజుకు 25 మంది ప్రజలు తమ పనుల కోసం వస్తారు. ఇందులో భూముల వ్యవహారంపై వచ్చే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. తర్వాత వ్యవసాయ సంబంధ సమస్యలు, ఇతర అవసరాల కోసం వచ్చే వారి సంఖ్య ఉంటుంది. నవరత్నాల సేవల కోసం వచ్చే వారి సంఖ్య తర్వాత స్థానం అని చెప్పుకోవచ్చు. ఎలాగూ ఫీల్డ్‌కు వెళ్ళే సిబ్బంది ప్రజలను వారి ఇళ్ల దగ్గరే కలిసి సమస్యలపై చర్చిస్తారు. ఇక వారు సచివాలయానికి రావాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. సచివాలయంలో ఉండి విధులు నిర్వహించే సిబ్బందితో పని ఉన్న వారే సచివాలయానికి వస్తుంటారు. ఈ లెక్కన రోజుకు 20 నుంచి 30 మంది మాత్రమే సచివాలయానికి వస్తున్నారు. గుర్రంకొండ మండలం తరిగొండ సచివాలయంలో సోమవారం ఇళ్లకు సంబంధించి 10 మంది ఓటీఎస్‌ నమోదు చేసుకున్నారు. జగనన్న విద్యా దీవెన కోసం ఆరుగురు వచ్చారు. సర్వర్‌ పనిచేయకపోవడంతో వెనుతిరిగారు. అమ్మఒడి పథకం ఈకేవైసీ కోసం పలువురు వచ్చి సర్వర్‌ పనిచేయకపోవడంతో వెనక్కు వెళ్లిపోయారు. సంబేపల్లె మండల సచివాలయంలో సోమవారం ఉదయం వన్‌బీ అడంగల్‌ కోసం సుమారు పది మంది వచ్చారు. ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కోసం 20 మంది వచ్చారు. ఇలా సగటున 20 నుంచి 30 మంది మాత్రమే వస్తుంటే.. మళ్ళీ సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు స్పందన అని ఆ కార్యక్రమానికి అందరూ సచివాలయ సిబ్బంది ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైన ఉద్యోగులు విస్మయం చెందుతున్నారు. ఈ నిర్ణయంపై.. పైకి ఏమీ మాట్లాడలేక... లోలోపల ఆవేదన చెందుతున్నారు.

మహిళా ఉద్యోగులకే ఇబ్బంది

సచివాలయ ఉద్యోగుల్లో ఎక్కువగా మహిళా ఉద్యోగులే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సచివాలయ ఉద్యోగుల్లో ఒకటి రెండు ఉద్యోగాలు మినహా మిగిలిన వాటిలో దాదాపు మహిళా ఉద్యోగులే ఉన్నారు. వీరిలో గర్భిణులు, చిన్నపిల్లల తల్లులు, ఏదైనా అనారోగ్యంతో ఆపరేషన్లు చేసుకున్న వాళ్లు, తాము పనిచేస్తున్న చోటికి కుటుంబాన్ని తీసుకురాలేని వాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. దీంతో రోజూ తాము పనిచేస్తున్న చోటికి దాదాపు 50 కిలోమీటర్ల దూరం బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. అదిగో ప్రొబెషన్‌ పీరియడ్‌ అయిపోతుంది.. ఇదిగో అయిపోతుంది..అంటూ.. ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ జూన్‌ ఆఖరికి ప్రొబెషన్‌ పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నేపధ్యంలో మూడుపూటలా బయోమెట్రిక్‌ హాజరు ప్రవేశపెట్టడంపై సచివాలయ మహిళా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి వాస్తవాలు తెలుసుకుని మూడు పూటలా బయోమెట్రిక్‌పై పునరాలోచన చేయాలని కోరుతున్నారు. 



Updated Date - 2022-04-20T05:30:00+05:30 IST