సైన్యాన్ని బద్నాం చేయడానికి కేసీఆర్‌కు అంత ఉత్సాహం ఎందుకు? : హిమంత బిశ్వ శర్మ

ABN , First Publish Date - 2022-02-14T22:19:36+05:30 IST

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో భారత సైన్యం జరిపిన లక్షిత దాడులకు

సైన్యాన్ని బద్నాం చేయడానికి కేసీఆర్‌కు అంత ఉత్సాహం ఎందుకు? : హిమంత బిశ్వ శర్మ

గువాహటి (అస్సాం) : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో భారత సైన్యం జరిపిన లక్షిత దాడులకు సంబంధించిన వీడియో‌ను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోమవారం విడుదల చేశారు. ఈ సర్జికల్ స్ట్రైక్స్‌‌ను ప్రశ్నించిన తెలంగాణా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుపై మండిపడ్డారు. ధైర్యసాహసాలుగల మన సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించిన వీడియో గ్రాఫిక్ సాక్ష్యాధారాలు ఇవిగో చూడండి అని కేసీఆర్‌‌ను ఉద్దేశించి చెప్పారు. 


‘‘ప్రియమైన కేసీఆర్ గారూ, ధైర్యసాహసాలుగల మన సైన్యం నిర్వహించిన లక్షిత దాడుల వీడియోగ్రాఫిక్ సాక్ష్యం ఇదిగో. ఇది ఉన్నప్పటికీ మీరు మన సాయుధ దళాల సత్తాను ప్రశ్నిస్తున్నారు, వారిని అవమానిస్తున్నారు. మన సైన్యాన్ని అపఖ్యాతిపాలు చేయడానికి, మన సైన్యంపై దాడి చేయడానికి మీకెందుకంత తెగింపు? మన సైన్యాన్ని అవమానించడాన్ని నవ భారతం సహించబోదు’’ అని ఓ ట్వీట్‌లో స్పష్టం చేశారు. దీనితోపాటు ఓ వీడియోను జత చేశారు. ఈ వీడియోలో మ్యాపుల స్క్రీన్‌షాట్స్, ఉపగ్రహ ఛాయాచిత్రాలు, వివిధ వీడియోల్లోని కట్ షాట్స్ ఉన్నాయి. 


తెలంగాణా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఆదివారం మాట్లాడుతూ, నేటికీ తాను రుజువు అడుగుతున్నానని చెప్పారు. భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్‌కు రుజువు చూపించాలన్నారు. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, అందుకే ప్రజలు అడుగుతున్నారని చెప్పారు. 


వివాదానికి మూలం...

హిమంత బిశ్వ శర్మ శుక్రవారం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మన దేశానికి గర్వకారణమని చెప్పారు. ఆయన నాయకత్వంలో పాకిస్థాన్‌లో మన దేశ సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసిందన్నారు. వీటికి కూడా రాహుల్ గాంధీ రుజువులు అడుగుతున్నారన్నారు. ‘‘మీరు రాజీవ్ గాంధీ కుమారుడేనా? కాదా? అని మేము అడుగుతున్నామా?’’ అని ప్రశ్నించారు. సైన్యం నుంచి రుజువును డిమాండ్ చేయడానికి మీకు ఉన్న అధికారం ఏమిటని ప్రశ్నించారు. 


దీంతో కేసీఆర్ స్పందిస్తూ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు చేసిన హిమంత బిశ్వ శర్మను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను డిమాండ్ చేశారు. 


కేసీఆర్‌పై హిమంత బిశ్వ శర్మ విరుచుకుపడుతూ, లక్షిత దాడులు చేశారా? లేదా? అని సైన్యాన్ని ప్రశ్నించడం పెద్ద నేరమని చెప్పారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల కేసీఆర్ ఆందోళన చెందుతున్నారని, అయితే రాహుల్ గాంధీ మన సైన్యంపై చేసిన వ్యాఖ్యల పట్ల  స్పందించడం లేదని అన్నారు. 


ఉరిలోని భారత సైన్యం బేస్ క్యాంపుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 19 మంది సైనికులు అమరులవడంతో భారత సైన్యం 2016 సెప్టెంబరులో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో సర్జికల్ స్ట్రైక్స్‌ను నిర్వహించింది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు మరణించారు. 


Updated Date - 2022-02-14T22:19:36+05:30 IST