అమరావతి: సీఎం జగన్ ప్రజల్లోకి రావలంటే భయపడుతున్నారా? తూతూమంత్రంగా వరద పర్యటన ముగించేశారా? ఏ సీఎంకి లేనంత కట్టుదిట్టమైన భద్రత ఎందుకు? ఇంటికో సిబ్బందితో కాపలా ఎందుకు కాశారు? బెదిరింపులు, అరెస్ట్‌ల పర్వం ఎందుకు సాగించారు? పెయిడ్ ఆర్టిస్టులకి వైసీపీ కార్యాలయంలోనే మున్సిపల్ కమిషనర్ శిక్షణ ఇచ్చారా? ఇలా అనేక ప్రశ్నల నేపథ్యంలో ఏబీఎన్‌కు కీలక ఆధారాలు దొరికాయి.
సీఎంను వరద బాధితులు ప్రశ్నించకుండా వైసీపీ నేతల చర్యలు తీసుకుంటున్న కీలక దృశ్యాలను ఏబీఎన్ సేకరించింది. వైసీపీ కార్యాలయంలో కొందరు వరద బాధితులకు మున్సిపల్ కమిషనర్ శిక్షణ ఇచ్చారు. జగన్‌తో ఏం మాట్లాడాలో మున్సిపల్ కమిషనర్ చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరద బాధితులు ఇంట్లో నుంచి బయటకు రాకుండా వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. బాధితులు బయటకి రాకుండా ఇంటింటికీ పోలీసు, సచివాలయ సిబ్బందితో కాపలా కాస్తున్నారు. రోడ్లపై గుంతలు, కోతలు, చెత్త చెదారాలు కనిపించకుండా పరదాలు ఏర్పాటు చేశారు. సీఎంకు సమస్యలు చెప్పుకోకుండా చేయడమేంటని వరద బాధితులు వాపోతున్నారు.
నెల్లూరు జిల్లాని ఇటీవల వరదలు ముంచెత్తాయి. పెన్నానదిలో పొర్లుకట్టలని ఇటీవల ఇసుకాసులు ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నా... అధికారగణం కిమ్మనలేదు. ఒకరిద్దరు అధికారులు ప్రశ్నిస్తే... ప్రభుత్వ పెద్దల నుంచే ఫోన్లు రావడంతో మిన్నకుండిపోయారు. ఆ పొర్లుకట్టల వద్ద పెన్నా నదికే భారీ గండ్లు పడ్డాయి. ఆ వరద నీరంతా గ్రామాలకి గ్రామాలనే ముంచేసింది. ప్రజలకి అపారనష్టం వాటిల్లింది. ఒక్క ఆక్వారంగానికే రూ.1000కోట్లకి పైగా నష్టం జరిగింది. వ్యవసాయ రంగంలోనూ రూ.వెయ్యి కోట్ల నష్టం వచ్చిందని బాధితులు చెబుతున్నారు.