ఏందన్నా ఇదీ...!

ABN , First Publish Date - 2022-05-17T06:34:25+05:30 IST

పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల భవితవ్యాన్ని తేల్చే ప్రదేశం అది. ఇతరులకు ప్రవేశం లేదని విద్యాశాఖ అధికారులు గట్టిగా చెప్పేశారు.

ఏందన్నా ఇదీ...!
ఇటీవల స్పాట్‌కు వచ్చిన ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

స్పాట్‌లోకి ఎమ్మెల్సీ ఆశావహులు

చోద్యం చూస్తున్న జిల్లా అధికారులు


 పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల భవితవ్యాన్ని తేల్చే ప్రదేశం అది. ఇతరులకు ప్రవేశం లేదని విద్యాశాఖ అధికారులు గట్టిగా చెప్పేశారు. కానీ అంత గట్టిగా ఏమీ జరగడం లేదు. పైగా.. ఎన్నికల ప్రచార కేంద్రంగా మారిపోయింది. జవాబులను పరిశీలించి, మార్కులు వేస్తున్న గురువుల వద్దకు వెళ్లి.. తమకు ఓటు వేయాలని అడుగుతున్నారు. ఎప్పుడో.. 10 నెలల తరువాత జరిగే ఎన్నికలకు ఇప్పుడే ఓట్లు అడుగుతున్నారు. ఇది విడ్డూరం. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు నిర్ణయం జరిగే ప్రదేశంలో నాయకులు ఇలా చేయడాన్ని, ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడాన్ని ఏమనాలో..! 

- అనంతపురం విద్య


అడిగేదెవరు..?

బడిలో పిల్లలు అల్లరి చేస్తే.. ‘సైలెన్స.. ఇదేం బడా.. బందెలదొడ్డా..?’ అని అయ్యవార్లు కేకలు వేసేవారు. ఇప్పుడు అయ్యవార్లు పేపర్లు దిద్దేచోటును చూస్తే.. విద్యార్థులు రివర్స్‌లో అంటారేమో..! ఓట్లు అడిగేందుకు సమయం, సందర్భం ఉంటుంది. పట్టభద్రులు, టీచర్ల ఓట్లకు ఎరవేసేందుకు ఇంకా చాలా సమయం ఉంది. ఇవేమీ పట్టించుకోకుండా పదో తరగతి స్పాట్‌ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారు. నాలుగు రోజులుగా పలువురు ఆశావహ అభ్యర్థులు స్పాట్‌లోకి వచ్చిపోతున్నారు. స్పాట్‌ లోపల, బయట ఓట్ల కోసం హంగామా చేస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు, వారి బిడ్డలు, ప్రస్తుత మండలి సభ్యులు, స్థానిక సంస్థల సభ్యులు.. ఇలా ఎవరికివారు స్పాట్‌ కేంద్రంలోకి చొరబడుతున్నారు. నిషిద్ధ ప్రాంతానికి ఇతరులు వచ్చి వెళుతుంటే పరీక్షల విభాగం అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. 


సందర్భం లేదా..?

పదో తరగతి మూల్యాంకనంలో 2 వేల మందికిపైగా ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లు, సెకెండరీ గ్రేడ్‌ టీచర్లు పాల్గొంటున్నారు. స్పాట్‌ వద్దకు వెళితే ఒకేసారి వేలమందిని కలవొచ్చు అనుకుంటున్నారేగాని, అక్కడికి వెళ్లొచ్చా..? అన్న వివేచన చేయడం లేదు. మేధావులు ఉండే మండలి సభ్యత్వాన్ని ఆశించేవారు ఇలా చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇది సరికాదని ఉపాధ్యాయ సంఘాల నాయకులైనా చెప్పాల్సింది. కానీ కొందరు నాయకులే ఆశావహులను వెంటబెట్టుకొచ్చారు. పది పరీక్షల్లో విద్యార్థుల భవిష్యత్తుని నిర్ణయించేది ఎగ్జామినర్లు వేసే మార్కులు. ఒక పేపర్‌ క్షుణ్ణంగా దిద్దాలంటే.. కనీసం 10 నిమిషాలు పడుతుంది. కాస్త అటు ఇటుగా దిద్దినా... 5 నిమిషాలు తీసుకుంటుంది. చుట్టూ ప్రశాంత వాతావరణం ఉంటేనే పొరపాట్లకు తావుండదు. అలాంటి చోట ప్రచార జాతా జరిగితే.. ఎలా దిద్దగలరు..? ఏం మార్కులు వేయగలరు..? పేపర్లు దిద్దే టీచర్ల వద్ద రాజకీయ చర్చలు మొదలు పెడితే.. వారి ఏకాగ్రత దెబ్బతినదా..? ఆ గందరగోళంలో ఏదైనా పొరపాటు జరిగితే విద్యార్థులకు నష్టం జరగదా..? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు..? పాఠశాలల విలీనం, పీఆర్సీలో కోతలు, సీపీఎస్‌ రద్దు తదితర సమస్యలపై పెదవి విప్పనివారు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు గగ్గోలు పెడుతుంటే.. సానుభూతి చూపనివారు పలువురు స్పాట్‌ వద్ద ‘గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తాం’ అని ప్రచారం చేసుకుంటున్నారు. 


హంగామా..

టెన్త్‌ స్పాట్‌ ఈ నెల 13 నుంచి జిల్లా కేంద్రంలోని కేఎ్‌సఆర్‌ హైస్కూల్‌లో నిర్వహిస్తున్నారు. తొలిరోజు నుంచి నాయకులు రావడం మొదలుపెట్టారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆశావహ అభ్యర్థులు టీచర్ల వెంట పడుతున్నారు.  ఫోర్టో గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులు ఇటీవల స్పాట్‌కు వచ్చారు. ఆయనతోపాటు కొందరు సంఘాల నాయకులు వచ్చారు. ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి, ఆయనతోపాటు ఎస్టీయూ నాయకులు అక్కడికి వచ్చారు. ఎమ్మెల్సీ, విప్‌ వెన్నపూస గోపాల్‌రెడ్డి కుమారుడు వెన్నపూస రవీంద్రారెడ్డి కూడా స్పాట్‌ వద్దకు వచ్చారు. ఆయనకు మద్దతుగా కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెంట వచ్చారు. కాంగ్రెస్‌ నాయకుడు బీసీ నాగరాజు స్పాట్‌ ప్రాంగణానికి వచ్చారు. అనంతపురం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ కోగటం విజయ భాస్కర్‌రెడ్డి కొందరు కార్పొరేటర్లు, నాయకులతో కలసి స్పాట్‌కు వచ్చారు. కొందరు స్పాట్‌ లోపల, మరికొందరు బయట ఉపాధ్యాయ సంఘాల నాయకులను, ఉపాధ్యాయులను కలుస్తున్నారు. మాటలు కలిపి, ఓట్లు అడిగి సందడి చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమను ఆశీర్వదించాలని కాకా పడుతున్నారు.


చోద్యం చూస్తున్నారా..?

స్పాట్‌ కేంద్రంలోకి బయటి వ్యక్తులు ప్రవేశించడానికి వీల్లేదని అధికారులు ప్రకటించారు. కానీ రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, వారి పిల్లలు వచ్చి మూల్యాంకన కేంద్రంలోకి స్వేచ్ఛగా వచ్చి వెళుతున్నారు. టీచర్లను పలకరిస్తామని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెండు జిల్లాల డీఈవోలు, పరీక్షల విభాగం అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం విమర్శలకు తావిస్తోంది. నిబంధనలు తెలియవా..? లేక అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులు.. అని వదిలేశారా..? అన్న చర్చ జరుగుతోంది. దీనిపై వివరణ కోరేందుకు డీఈఓ శామ్యూల్‌కు ఫోన్‌ చేయగా, అందుబాటులోకి రాలేదు.



Updated Date - 2022-05-17T06:34:25+05:30 IST