మానిన గాయాన్ని మళ్లీ ఎందుకు రేపుతున్నారు?

ABN , First Publish Date - 2021-09-13T06:04:35+05:30 IST

‘చరిత్రలో చెదిరిన అస్తిత్వాలు చెప్పుకున్న స్వగతాలు’ - శీర్షికతో ఆంధ్రజ్యోతి ‘వివిధ’ సాహిత్య వేదిక (23.08.2021)లో బి తిరుపతిరావు గారు రాసిన వ్యాసం చదివి, నేను హతాశుడనయ్యాను....

మానిన గాయాన్ని మళ్లీ ఎందుకు రేపుతున్నారు?

‘చరిత్రలో చెదిరిన అస్తిత్వాలు చెప్పుకున్న స్వగతాలు’ - శీర్షికతో ఆంధ్రజ్యోతి ‘వివిధ’ సాహిత్య వేదిక (23.08.2021)లో బి తిరుపతిరావు గారు రాసిన వ్యాసం చదివి, నేను హతాశుడనయ్యాను. మధురాంతకం నరేంద్ర గారి నవల ‘మనోధర్మపరాగం’ను, ఈ వ్యాసంలో ఆయన సమీక్షించారు. రచయిత ఎవరి మేలు కోసం ఈ నవల రాశారు? ఆటా నిర్వాహకులు ఏం ఆశించి బహుమతి ప్రకటించారు? సమీక్షకులు ఏమి ప్రయోజనం కోసం ఇంత వ్యాసం రాశారు? 


‘‘ఇది దాదాపు 130సంవత్సరాల దక్షిణ భారతదేశ దేవదాసీ వ్యవస్థ పూర్వపరాలను, ఆ వ్యవస్థ నుంచి వచ్చి ప్రముఖులైన కొందరి స్త్రీల జీవితాలను చిత్రించిన నవల’’ అని సమీక్షకులు పేర్కొన్నారు. రచయితగానీ, సమీక్షకులుగానీ గమనించాల్సిన విషయం ఏమంటే.. దక్షిణ భారతదేశంలో దేవదాసీ వ్యవస్థను రూపుమాపి ఇప్పటికే 74 సంవ త్సరాల కాలం గడిచింది. మన దేశానికి 1947 ఆగస్టులో స్వాతంత్య్రం సిద్ధిస్తే గాంధీలాంటి పెద్దలు మరుసటి నెల సెప్టెంబర్‌లోనే దేవదాసీ వ్యవస్థను రూపు మాపుతూ చట్టం తెచ్చారు. సభ్యసమాజంలో ఇంకే మాత్రం కొనసాగకూడని వ్యవస్థగా వారు దీన్ని గుర్తించారు. అప్పటి నుంచీ దేవదాసీ వ్యవస్థలో కొత్తగా చేరికలు లేవు. అంతకు క్రితం 54 సంవత్సరాలుగా వున్నవారు సైతం ఈ వ్యవస్థను విసర్జించారు. జరి గింది ఇదయితే, ‘‘దేవదాసీలు ఎంతో సంస్కార వంతంగా, గొప్ప అభిరుచితో జీవించారనే చారిత్రక వాస్తవాన్ని అత్యంత శక్తివంతంగా, ఆ పాత్రల హుందా తనం ఏమాత్రం తగ్గకుండా చిత్రించాడు రచయిత. వాటి ఆత్మను, లైంగిక అభిరుచుల్ని, వాంఛల్ని హుందాగా ప్రకటింపజేశాడు. ఏమాత్రం వల్గారిటీకి ఆస్కారం లేకుండా చూశాడు’’ - అని సమీక్షలో తిరుపతిరావు కితాబిచ్చారు. ఇంత అనాలోచితంగా రాయటంలోని ఔచిత్యం ఏమిటో నాకు అంతుబట్టలేదు. లైంగిక అభిరుచులు-వాంఛలను వల్గారిటీకి దూరంగా ‘హుందా’గా ప్రకటించగలగడం సాధ్యమా? అయినా ఈ వాంఛలు- అభిరుచులు ఏ ఏ వర్గాలకు ఉపయుక్తమని భావించి రచించిన చారిత్రక గ్రంథమిది? 


తొలిదశలో దేవదాసీ వ్యవస్థ లక్ష్యం అత్యంత పవిత్రతతో కూడినది. సచ్ఛీలురై పూర్తిగా దేవుని సేవకు అంకితమవ్వడమే ‘దేవదాసి’ కర్తవ్యం. ఆలయాల్లో నాట్యం చేయడం, గుడిని శుభ్రపరచడం, పండుగలు, పర్వదినాలకు ఊరేగింపుల్లో పవిత్ర దివిటీలు పట్టుకోవడం దేవదాసీ విధులు. ఇందుకు వారికి కొంత పైకం చెల్లించే వారు. దేవస్థాన యాజమాన్యం నుంచి దేవదాసీకి కొంత భూమి లభించేది. ఆమెకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం దక్కేవి. వివాహం, పండుగలు, ప్రయాణాలు యిలా విభిన్న సందర్భాల్లో ఆమెను అందరూ పుణ్యస్త్రీగా భావించి ఆమె ఆశీస్సులు పొందుతూ ఉన్నత స్థానం కల్పించేవారు.


దేవదాసీల సేవలపై ప్రముఖులు కురిపించిన ప్రశంసలు చరిత్రపుటల్లో సైతం నిక్షిప్తమై వున్నాయి. ‘‘దేవదాసీలు బ్రహ్మచారిణులై దేవాలయములలో దేవ సేవ చేయుచుండెడివారు’’ అని శ్రీశ్రీశ్రీ జగద్గురు శృంగేరి స్వామి, అహోబిలం జీయర్‌ స్వామి, వానమామలై జీయర్‌ స్వామి, తిరువడత్తురాయి సంధర సమాధి స్వామి, ధర్మాపురము సంధర సమాధి స్వామి, సూర్యనార కోవిల్‌ సంధర సమాధి స్వామి, పిరన్‌ మలాయి సంధర సమాధి స్వామి, మధురై సంధర సమాధి స్వామి, తంబి రాన్‌ అవర్ఘళ్‌ పంధర సమాధి స్వామి, తెరుపెనండాల్‌ స్వామి, మన్నార్‌ గుడి బ్రహ్మశ్రీ మహామహోపాధ్యాయ రాజు శాస్త్రియర్‌ అవర్ఘళ్‌, చిదంబరం మహామహోపాధ్యాయ చంద్రశేఖర దీక్షితార్‌, కంజీవరం ఆదిశైవ బ్రాహ్మణులు, ఉత్తర కోశమంగాయి ఆదిశైవ బ్రాహ్మణులు, తదితరులు ప్రస్తుతించినట్లు .25-8-1895న రామనాధ పురం (రామ్నాడు) రాజా శ్రీశ్రీశ్రీ యం.భాస్కర శ్వేతపతి ప్రకటించారు. ఈ ఫర్మానాను 30-8-1896వ తేదీ ‘హిందూ’ పత్రికలో ప్రచురించారు.


‘‘దేవదాసీలు పూర్వము యోగినులు. వారు మతమును బోధించుచుండెడివారు’’ అని మద్రాస్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ డాక్టర్‌ ముత్తులక్ష్మీరెడ్డి అమ్మాళ్‌ 9-10-1930న ఆంధ్రపత్రికలో ప్రకటించారు. ‘‘దేవదాసీలు పరిశుద్ధ బ్రహ్మచారిణులై దైవసేవ చేయు చుండెడివారు’’ అని దాదాపు శతాబ్దానికి పూర్వమే మైసూరు ప్రభుత్వంవారు నియ మించిన పండితులు పేర్కొన్నారు. డాక్టర్‌ అనిబిసెంట్‌ కూడా ‘‘దేవదాసీలు విశుద్ధ బ్రహ్మచారిణులై, అత్యంత గౌరవపాత్రులై యుండెడివారు’’ అని ప్రస్తుతించారు. శ్రీ సేలం విజయరాఘవాచారి కూడా 1913 సంవత్సరంలో యిదే అభిప్రాయం సెలవిచ్చిరి అని ‘ఇండియన్‌ సోషల్‌ రిఫార్మర్‌’ పత్రికా సంపాదకులు శ్రీ ఎన్‌.లక్ష్మణ మొదలియార్‌ మద్రాస్‌ అసెంబ్లీ సెలక్టు కమిటీ ఎదుట 12-4-1928న సాక్ష్యం యిచ్చారు.


దేవదాసీ వ్యవస్థపై ప్రధాన స్రవంతి పత్రికల్లో అడపాదడపా వచ్చే వ్యాసాలు చదివితే బాధ కలుగుతుంది. ఇలా రాసేవారు దేవదాసీలపై కరుణ, జాలి, దయ, సానుభూతి చూపుతున్నట్టు, వారినేదో ఉద్ధరిస్తున్నట్టు భావిస్తున్నారే కానీ.. మానిన గాయాన్ని గోకి, రాచపుండును రేపుతున్నామనే కనీస స్పృహను కోల్పోతున్నారు. తమ కాలంలో దేవదాసీలు కళారంగ పోషకులుగా రాణించారనటంలో ఎలాంటి సందేహం లేదు. సంగీత సాహిత్యాలు, శాస్త్రీయ నృత్య, కళా ప్రదర్శనలతో ప్రముఖుల నుంచి పామరుల వరకు వారు రంజింపజేశారు. శిక్షణ ఇవ్వడం ద్వారా కళలు చెదిరి పోకుండా భద్రంగా భవిష్యత్తరాలకు అందించారు. దేశం గర్వంగా చెప్పుకునేలా తమ కళా వారసత్వాన్ని మన ముందు ఘనంగా నిలిపారు. ఈ కోణంలో చారిత్రక నవలలు, ఇతరత్రా సాహిత్యం వెలికివస్తే ప్రజలకు ప్రయోజనం. అంతేగానీ, 74 ఏళ్ల క్రితమే చట్టపరంగా రూపుమాపిన వ్యవస్థను గురించి రాస్తే సమాజానికి ఏం ఒనగూరుతుంది? 

దాసరి కేశవులు,

94402 75055


Updated Date - 2021-09-13T06:04:35+05:30 IST