ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిపై విమర్శలు.. ఆ కప్పుల్లో టీ తేవడంతో..

ABN , First Publish Date - 2022-07-10T02:37:52+05:30 IST

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె, బ్రిటన్ మాజీ మంత్రి రిషి సునాక్ భార్య అక్షతా మూర్తిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిపై విమర్శలు.. ఆ కప్పుల్లో టీ తేవడంతో..

ఎన్నారై డెస్క్: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె,  బ్రిటన్ మాజీ మంత్రి రిషి సునాక్ భార్య అక్షతా మూర్తిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన నివాసానికి వచ్చిన జర్నలిస్టులకు ఖరీదైన కప్పుల్లో అక్షతా మూర్తి టీ తేవడమే ఈ విమర్శలకు దారి తీసింది. బ్రిటన్ ప్రధాని రేసులో తానూ ఉన్నానంటూ రిషి సునాక్ ప్రకటించడంతో జర్నలిస్టులు ఆయన ఇంటర్వ్యూ కోసం వచ్చిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. అక్షతా మూర్తి తమకు టీ తీసుకొస్తున్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విలేకరులు..ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. అయితే.. నెటిజన్ల దృష్టి మాత్రం ఆ కప్పులపై పడింది.  ధరల పెరుగుదలతో అల్లాడుతున్న బ్రిటన్ ప్రజలు.. ఈ ఖరీదైన కప్పులు చూసి విస్తుపోయారు. ఒక్క కప్పు ధరతో ఓ కుటుంబానికి రెండు రోజుల పాటు భోజనం పెట్టొచ్చని కొందరు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కప్పుల ఖరీదు 39 పౌండ్లు అట. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే దాదాపు రూ.3700!


బ్రిటన్‌లో ట్యాక్స్ చెల్లించని కారణంగా గతంలో ఓసారి అక్షతా మూర్తిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. తనకు స్థానికత హోదా లేని కారణంగానే ట్యాక్సులు చెల్లించలేదని అక్షతా మూర్తి అప్పట్లో వివరణ ఇచ్చారు. భవిష్యత్తుల్లో స్థానికత హోదా తీసుకుని పన్నులు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు.. బోరిస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రిషి సునాక్‌పైనా అప్పట్లో పన్నుల విషయమై విమర్శలు చెలరేగాయి. ఆర్థిక మంత్రిగా ఆయన పన్నులు పెంచడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అక్షతా మూర్తి ఖరీదైన టీ కప్పులు వినియోగించడం బ్రిటన్‌లో చర్చనీయాంశమవుతోంది.  

Updated Date - 2022-07-10T02:37:52+05:30 IST