NGT ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం.. గ్రీన్ ట్రైబ్యునల్ తీరుపై సుప్రీం ఆశ్చర్యం

ABN , First Publish Date - 2022-05-31T23:04:14+05:30 IST

చట్ట సభ్యుల దాఖలు చేస్తున్న లెటర్ పిటిషన్లను జాతీయ హరిత ధర్మాసనం (National Green Tribunal) విచారిస్తుండడంపై

NGT ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం.. గ్రీన్ ట్రైబ్యునల్ తీరుపై సుప్రీం ఆశ్చర్యం

న్యూఢిల్లీ: చట్ట సభ్యుల దాఖలు చేస్తున్న లెటర్ పిటిషన్లను జాతీయ హరిత ధర్మాసనం (National Green Tribunal) విచారిస్తుండడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కోర్టులను ఆశ్రయించలేని వారి కోసమే ఎన్‌జీటీ అధికార పరిధి ఉందని భావిస్తున్నట్టు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన వెకేషన్ బెంచ్ పేర్కొంది. ‘‘ఏంటిది? పార్లమెంటు సభ్యుల లేఖలను కూడా జాతీయ హరిత ధర్మాసనం విచారిస్తోంది. కోర్టులను ఆశ్రయించలేని వారి కోసమే ఎన్‌జీటీ పరిధి ఉందని భావించాం. అది ఉన్నది సాధారణ పౌరులకే కానీ చట్ట సభ్యులకు కాదు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.


రిషికొండలో సీఆర్‌జడ్ నిబంధనలను నిర్మాణ పనులు చేపట్టిన ప్రాజెక్టు ఉల్లంఘించిందంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన గ్రీన్ ట్రైబ్యునల్ నిర్మాణ పనులను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అప్పీలుపై విచారణ సందర్భంగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. 


ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. ఇది పర్యాటక రంగం కోసం ఒక ముఖ్యమైన ప్రజా ప్రయోజన ప్రాజెక్టు అని కోర్టుకు తెలిపారు. 300 మందికిపైగా ఉపాధి అవకాశాలు లభించాయని, రూ. 180 కోట్ల పెట్టబడులు వచ్చాయని పేర్కొన్నారు. దీంతో కల్పించుకున్న సుప్రీంకోర్టు బెంచ్..  రాజ్యాంగంలోని ఆర్టికల్ 227 ప్రకారం ఎన్‌జీటీ, హైకోర్టుకు అధీనంలో ఉన్న ట్రైబ్యునల్ అని చెబుతున్న తీర్పు కాపీ ఉందా? అని అభిషేక్‌ను ప్రశ్నించింది.


అయితే, దీనికి తనకు కొంత సమయం కావాలని సంఘ్వీ కోరారు. దీంతో తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కాగా, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కేసులను సమర్థంగా, త్వరితగతిన పరిష్కరించేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం 2010 ప్రకారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-05-31T23:04:14+05:30 IST