ఇంటింటికి వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎందుకు సాధ్యం కాదు?: కేంద్రాన్ని నిలదీసిన ముంబై హైకోర్టు

ABN , First Publish Date - 2021-06-13T01:18:45+05:30 IST

దేశవ్యాప్తంగా నేరుగా ఇళ్లవద్దకే వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది సాధ్యం కాదని చెబుతున్న ప్రస్తుత..

ఇంటింటికి వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎందుకు సాధ్యం కాదు?: కేంద్రాన్ని నిలదీసిన ముంబై హైకోర్టు

ముంబై: దేశవ్యాప్తంగా నేరుగా ఇళ్లవద్దకే వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది సాధ్యం కాదని చెబుతున్న ప్రస్తుత వ్యాక్సినేషన్ విధానంపై కేంద్రాన్ని ముంబై హైకోర్టు నిలదీసింది. కేరళ, జమ్మూకశ్మీర్‌లను ఉదహరిస్తూ, అక్కడ చేపట్టిన ఇంటింటికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతమైందని కోర్టు పేర్కొంది. కేరళ, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో ఇది సాధ్యమైనప్పటికీ ''డోర్ టు డోర్ వ్యాక్సినేషన్‌'' ప్రారంభించేందుకు కేంద్రానికి ఉన్న సమస్య ఏమిటని చీఫ్ జస్టిస్ దీపంకర్ దత్తా, జస్టిస్ జీఎస్ కులకర్ణితో కూడిన ధర్మాసనం ప్రశ్నిచింది. ప్రస్తుత వ్యాక్సినేషన్ విధానంపై దృఢమైన నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచించింది.


కాగా, ఈ వారం ప్రారంభంలో కోర్టు మరో ప్రశ్న లేవనెత్తింది. ముంబైలోని తన ఇంట్లోనే ఒక సీనియర్ రాజకీయనేత ఎలా వ్యాక్సినేషన్ తీసుకోగలిగారు అంటూ బెంచ్ ప్రశ్నించింది. దీనికి బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ తరఫున హాజరైన న్యాయవాదిగా అనిల్ సఖరే సమాధానమిచ్చారు. తమ మున్సిపాలిటీ ఎలాంటి వ్యాక్సిన్ ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది గీతా శాస్త్రిని ఇదే ప్రశ్న కోర్టు అడిగింది. వారం రోజులు సమయం ఇవ్వాలని శాస్త్రి కోరడంతో...దీనికి వారం రోజులు కావాలా? ఎంత దయనీయం? అని చీఫ్ జస్టిస్ దత్తా వ్యాఖ్యానించారు. కోవిడ్ మహమ్మారిని సమర్ధవంతంగా బీఎంసీ ఎదుర్కొందంటూ కోర్టు ప్రశంసిస్తూ, ఇంటింటికీ వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు బీఎంసీ ఎందుకు వెనుకాబడుతోందని ప్రశ్నించింది. ఇందుకు తాము సిద్ధమేనని, కేంద్రం ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని బీఎంసీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

Updated Date - 2021-06-13T01:18:45+05:30 IST