పెట్రోల్ ధరల పెరుగుదలపై ఎందుకీ ఉదాసీనత!

ABN , First Publish Date - 2021-02-24T05:58:20+05:30 IST

ప్రధానమంత్రిగా మోదీ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశంలో వరుసగా పెట్రోలు, డీజిలు ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే...

పెట్రోల్ ధరల పెరుగుదలపై ఎందుకీ ఉదాసీనత!

ప్రధానమంత్రిగా మోదీ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశంలో వరుసగా పెట్రోలు, డీజిలు ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే లీటరు ధర సమీప భవిష్యత్తులో రూ.150కు కూడా చేరుకోవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల పర్యవేక్షణ అంతా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉండడంతో ప్రజల ముందు కేంద్ర ప్రభుత్వమే దోషిగా నిలబడవలసి వస్తున్నది. 


అయితే కేంద్రం తన బాధ్యత ఏమీ లేదన్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న స్థానిక పన్నుల కారణంగానే ధర పెరుగుతోందని అంటోంది. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గటమన్నది రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఉన్నదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోదీ ఒక అడుగు ముందుకేసి గత ప్రభుత్వాలు ఇంధనం రంగంలో స్వయంసమృద్ధి సాధించడం పట్ల శ్రద్ధ చూపకపోవడమే నేటి పరిస్థితికి కారణమంటున్నారు. అదీగాక, 85శాతం చమురు, 53శాతం గ్యాస్ అవసరాలకు దిగుమతులపై ఆధారపడటం వల్లనే ఈ విధంగా ధరలు పెరుగుతున్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు. వాస్తవానికి మన దేశంలో చమురు ధరలు పెరగడానికి, అంతర్జాతీయ పరిణామాలకు అసలు సంబంధం లేదు. 


అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు చాలావరకు స్థిరంగా ఉన్నాయి. అదే విధంగా డాలర్ - రూపాయి మారకం విలువ కూడా స్థిరంగా ఉంటున్నది. దేశంలో పెరుగుతున్న పన్నుల భారమే ధరల పెరుగుదలకు కారణమన్నది నిర్వివాదాంశం. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి దేశ ప్రజలను వంచిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న అభ్యంతరాల కారణంగా పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్టీ పరిధిలోకి తేలేక పోతున్నామని కేంద్ర నిస్సహాయత వ్యక్తం చేస్తున్నది. అదే నిజమైతే కనీసం బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎందుకు పన్నులు తగ్గించే ప్రయత్నం చేయడం లేదు? 


కేంద్రం ఎక్కువగా సెస్సు, సర్‍ఛార్జీల పేర్లతో పన్నులు వేస్తూ ఉండడంతో వాటిల్లో రాష్ట్రాలకు వాటాలు లభించడం లేదు. ఇక రాష్ట్రాలు కూడా వ్యాట్, సెస్సుల రూపంలో ఇష్టంవచ్చిన్నట్లు పన్నులు వేస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు గత ఏడేళ్లలో 40శాతం తగ్గినా మన దేశంలో మాత్రం 40శాతానికి పైగా ధరలు పెరగడం గమనిస్తున్నాం. ప్రస్తుతం కేంద్రం లీటరు పెట్రోలుపై రూ.32, డీజిలుపై రూ.32 చొప్పున వివిధ రకాల పన్నులు వసూలు చేస్తున్నది. ఒక సంవత్సరం క్రితం ఇవి పెట్రోలుపై రూ.20, డీజిలుపై రూ.16 మాత్రమే ఉన్నాయి. అంటే పెట్రోలుపై సుమారు 60 శాతం, డీజిలుపై 100 శాతం మేరకు పన్నులు పెంచింది. 


ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉత్పత్తుల ధరలపై కొంత శాతాన్ని వాటాగా విధిస్తూ ఉండడంతో పన్నులు పెంచకుండానే ఆ ఉత్పత్తులు ధరలు పెరిగినప్పుడల్లా అదనపు ఆదాయం పొందుతున్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలుపై 36శాతం, డీజిలుపై 26 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నది. వ్యాట్‌కు తోడుగా పెట్రోలుపై లీటరుకు రూ.1.50, డీజిలుపై రూ.1.75 చొప్పున అదనంగా రోడ్ సెస్సు వసూలు చేస్తున్నది. 


పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్ సెల్ (పిపిఎసి) అందిస్తున్న గణాంకాల ప్రకారం గత ఆరేళ్లకు పైగా మొదటి ఆరు నెలల్లో పెట్రోలియం పన్నుల నుంచి కేంద్ర ప్రభుత్వం రూ.19.33 లక్షల కోట్ల ఆదాయాన్ని పొందింది. రాష్ట్ర ప్రభుత్వాలు రూ.12.5 లక్షల కోట్ల ఆదాయంతోపాటు, కేంద్రానికి లభించిన ఆదాయంలో, ముఖ్యంగా కస్టమ్ సుంకాల నుంచి, కార్పొరేట్ పన్నుల నుంచి 45 శాతం వాటా పొందాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ప్రతి ఏటా రూ.5లక్షల కోట్లకు పైగా పెట్రోలియం ఉత్పత్తులపై ఆదాయాన్ని పొందుతున్నాయి. 


15వ ఆర్థిక కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉమ్మడి పన్నులలో రాష్ట్రాలకు 41శాతం వాటా ఇవ్వవలసి ఉండగా, కేంద్రం సెస్సు, సర్‍ఛార్జీల రూపంలో ఎక్కువగా వసూలు చేస్తుండడంతో ఆచరణలో రాష్ట్రాలకు 30శాతం వాటా మాత్రమే లభిస్తున్నది. అందుకనే ఈ అంశం కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణం అవుతున్నది. కేంద్రం రాష్ట్రాల ప్రయోజనాలను పట్టించుకోకుండా తన ఆదాయ వనరులను విస్తరించుకోవడం పట్లనే ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టం అవుతున్నది. 


పెట్రోలియం ధరల పెరుగుదలకు మరో ప్రధాన కారణం- దేశంలో ప్రభుత్వరంగంలో ఉన్న నాలుగు చమురు కంపెనీల నిర్వహణ వ్యయం ప్రపంచంలోని చమురు కంపెనీలు అన్నిటికన్నా ఎక్కువగా ఉండడమే. ఈ కంపెనీల పాలక వర్గాల్లో రాజకీయపరమైన నియామకాలు అవుతూండటంతో సమర్థవంతమైన యాజమాన్యానికి అవకాశం ఉండడం లేదు. ఈ కంపెనీలు తమ నిర్వహణ వ్యయంలో 5 నుండి 10 శాతం తగ్గించుకున్నా, పెట్రోలు, డీజిలు ధరలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది.

చలసాని నరేంద్ర

Updated Date - 2021-02-24T05:58:20+05:30 IST