Abn logo
Jul 29 2021 @ 01:48AM

నేను ఎందుకు రాజకీయ నాయకుడిని కాలేకపోయాను..?

నేను రాజకీయ నాయకుడిని కాలేకపోయాను. ఎందుకంటే ఎన్నికలలో పోటీ చేయలేకపోయాను. 15వ ఏట 1963లో ఆరెస్సెస్ రాజకీయాలతో ప్రారంభించి, విద్యార్థి, ఉద్యోగ, యవజన, సాహిత్య ఉద్యమాలతో, 1991 నుంచి రచయితల, కళాకారుల సంఘాల, బీసీ ఎస్సీ సంఘాల, వర్గ కుల సంఘాల నిర్మాణాలలో, 1995 నుంచి మలి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలలో... నా జీవితమంతా గడిచిపోయింది. అవన్నీ ఓట్ల రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం లేనివే. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోతే జరిగే నష్టం తొలుత తెలియ రాలేదు. జాతీయోద్యమ కాలంలో కాంగ్రెస్ జాతీయోద్యమానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఎన్నో కులవృత్తి సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, ఆదివాసులు, శూద్ర అతిశూద్ర వర్గాలు ఉద్యమించాయి. కాని వాటికి రాజ్యాధికారం లక్ష్యం కాకపోవడం వల్ల ప్రత్యక్ష రాజకీయాలలోకి రాలేదు. రాజకీయ ఉద్యమంగా గుర్తింపూ లభించ లేదు. వీరు ఆనాడు ఓట్ల రాజకీయాలలో పాల్గొనలేదు. కాగా ప్రగడ కోటయ్య స్వయంగా పార్టీ పెట్టి టంగుటూరి ప్రకాశం పంతులుతో ఎన్నికల ఒప్పందం పెట్టుకొని ఏడు సీట్లు పోటీ చేసి నాలుగు సీట్లు గెలిచారు. 1969 జై తెలంగాణ ఉద్యమం తరువాత సాగించిన సామాజిక ఉద్యమంలో గానీ, మలి తెలంగాణా ఉద్యమంలో గానీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ పని చేయలేకపోయారు. కేసీఆర్‌కు తన ఇల్లు ఆశ్రయంగా ఇచ్చి ఆయనను నిలబెట్టి తాను ఉన్న ఇల్లు కోల్పోయారు. యువతరం, సకల జనులు త్యాగాలు చేసి, 1200 మంది ఆత్మార్పణలు చేసుకుంటే రాజ్యాధికారం ఓ కుటుంబానికి పరిమితమైపోయింది. ఇందుకేనా తెలంగాణ కావాలని కోరుకున్నది? 


1996–98లలో మొదలైన మలి దశ తెలంగాణ బహుజన సామాజిక ఉద్యమాలను రాజకీయ ఉద్యమాలుగా మలిచి ఉంటే రాజ్యాధికారం వారికే వచ్చి ఉండేది. ఇపుడు ఎవరి దయా దాక్షిణ్యాలతోనో ఏవో నామినేటెడ్ పదవులు పొందారనే అపకీర్తి గడించి ఉండేవారు కాదు. ఇలా ఎందుకు జరగ లేదు? 1980లో అస్సాం ఉద్యమం జరిగిన క్రమం చూస్తే ఉద్యమకారులే, విద్యార్థులు లెక్చరర్లే మంత్రులు ఎమ్మెల్యేలయ్యారు. అస్సాంలో లెక్చరరే ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ రాష్ట్ర మలి తెలంగాణ ఉద్యమంలో ఇలా ఎందుకు జరగలేదు? ఏదో లోపం జరిగింది. అందువల్ల ఇప్పుడు మూడవ దశ తెలంగాణ ఉద్యమం ముందుకు వచ్చింది. గతంలో జరిగిన పొరపాట్లు జరగ కూడదు.


మలిదశ ఉద్యమంలో ఏం జరిగింది? ఉద్యమకారులకు ఎన్నికల రాజకీయాలపై చిన్న చూపా? డబ్బు లేకపోవడమా? పొట్టకూటివల్ల ముందుకు సాగలేక పోవడమా? ఇతరులు స్వంత డబ్బులతో రాజకీయాలు చేస్తున్నారన్న భ్రమలేమైనా ఉన్నాయా? వాళ్ళకేమైనా ఎక్కువ తెలివి అన్న భ్రమలా? అనేక ఉద్యమాల గడ్డ ఐన తెలంగాణలో వాటి ప్రభావం వల్ల ఎన్నికల పట్ల చిన్న చూపు ఏర్పడింది. నేటి యువతరం రాజకీయాల్లో ఎదగడానికి ఈ గతాన్ని పరిశీలించడం అవసరం. 


కాన్షీరాం వామపక్ష ట్రేడ్ యూనియన్ల గురించి ఒక విశ్లేషణ చేశారు. వారి ఉద్యమాల వల్ల లబ్ధి పొందినవారంతా ఓట్లేస్తే వారికి కనీసం 130 పార్లమెంటు సీట్లు వస్తాయి. కాని ముప్పయి సీట్లు రావడమే కష్టం. అనగా త్యాగాలు వీరివంతు అయితే ఓట్లు మాత్రం ఇతరులకు వేస్తున్నారు. ‘ఇలాంటి ట్రేడ్ యూనియన్లు నేను నడపను. సమాజం నుంచి మీరు పొందినందుకు మీరు సమాజానికి కూడా చేయాలి’ అని అన్నారు కాన్షీరాం. సమాజానికి తిరిగి చెల్లించండి అన్న నినాదం ఇచ్చారు. అలా ముందుకు వచ్చిన వారితో బామ్‌సెఫ్ నిర్మించారు. 


రాజకీయ నాయకత్వం ఒక్కరోజులో ఎదిగి రాదు. ఎమ్మెల్యే నుంచి మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి దాకా పి.వి. నరసింహారావు గెలుస్తూ ఓడుతూ నిరంతరం కృషి చేయడం ద్వారానే అలా ఎదగడం సాధ్యపడింది. అలా కృషి చేయకపోతే ఎన్ని హంగులు ఉన్నా రాహుల్ గాంధీ ఎదగలేకపోతున్న ఉదాహరణ మన ముంగట్నే ఉంది. 


మలి తెలంగాణ ఉద్యమం తనతో కాదని డా.కె. జయశంకర్ గమనించారు. అయితే బహుజనులు ముందుకు వచ్చినా, అగ్రకులాలనే ప్రోత్స హిస్తూ తన జ్ఞానాన్ని మద్దతును అందిస్తూ వచ్చారు. క్రమంగా మనదనుకున్న ఉద్యమం రూపంలో మనదైనా సారాంశంలో మనది కాని యుద్ధంగా కొనసాగింది. జయశంకర్ అట్ల ఎవరిని నెత్తికెత్తుకున్నాడో, దాంతో తెలంగాణ రాజ్యాధికారం ఎవరి వశమైందో చూస్తూనే ఉన్నాం. బహుజనుల ప్రాధాన్యతలైన నియామకాలు, ఉన్నత చదువులు, ఆర్థిక స్వావలంబన... ఇవి వెనక్కిపోయి వారు ఆశ్రితులుగా, పాలితులుగా మార్చబడ్డారు. ఇలా జరుగుతుందని 1998లోనే హెచ్చరించాం. జయ శంకర్ బీసీ ఎస్సీ ఉద్యకారులను చిన్న చూపు చూసి ఏ సామాజిక వర్గానికి మేలు చేశారో ఇపుడు స్పష్టంగా కనపడుతున్నది. 


ఎన్నికలలో పోటీ చేయని సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, కుల సంఘాలు, బీసీ ఎస్సీ సంఘాలు, దండోరా ఉద్యమాలు, రచయితల సంఘాలు, జర్నలిస్టుల సంఘాలు వంటి వాటిలో ఎంత పని చేసినా రాజకీయ నాయకులుగా ఎదగడం కష్టం. ఆయా రాజకీయ పార్టీలలో ఉంటూ ఇదే పని చేస్తే ఎపుడో ఒకప్పుడు ఎదుగుతారు. వారి కృషికి త్యాగానికి తగిన ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయాలు అవకాశ వాదంతో కూడుకున్నాయని ఈసడిస్తే లాభంలేదు. రాజ్యాధికారానికి అదే రాజ మార్గం అని మరిచిపోకూడదు.


ఎన్ని ఉద్యమాలు చేసినా నేను ప్రత్యక్ష రాజకీయాలలో ఎన్నడూ పోటీ చేయలేకపోయాను. అందువల్ల రాజకీయ నాయకుడిని కాలేకపోయాను. మా జీవితాలతో యువతరం గమనించాల్సిందేమిటో స్పష్టమైందనుకుంటాను. ఉంటే స్పష్టంగా రాజకీయాల్లో ఉండండి. రాజకీయాలు చేయండి. ప్రగడ కోటయ్యలా ఎన్నికల పొత్తులు పెట్టుకొని కొన్ని సీట్లయినా గెలవాలి. అలా అనుభవాలతో మూడవ దశ ఉద్యమ నాయకులు అందరూ కలిసి ఒక పార్టీగా మారాలి. కేజ్రీవాల్‍లా ఎదగండి. ఈనాడు కాకపోతే మరోనాడు విజయం సాధిస్తారు. అంతేగాని 1200 మంది ప్రాణాలు బలి ఇచ్చి, ఎందరో త్యాగాలు చేసి, లక్షలాదిమంది ఉద్యమించి ఓ కుటుంబానికి రాజ్యాధికారం బందీ అయిపోవడం విషాద పరిణామం.


దీనికి మూలకారణం ఉద్యమంలోనే ఉంది. మలిదశ ప్రారంభ దినాలలో 1996–98లలో ఆచార్య కె. జయశంకర్ వంటి వారు భావజాల వ్యాప్తికై పర్యటిస్తున్నపుడు నాయకత్వ సమస్య గురించి ప్రశ్నించడం జరిగింది. ఉద్యమకారులు బీసీ ఎస్సీ ఎస్టీల నాయకత్వంలో సాగాలని వారినే ముందుకు తేవాలని ఎక్కడిక్కడ నిలదీసారు. అగ్రకుల నాయకత్వాన్ని అంగీకరించబోం, వ్యతిరేకిస్తాం, ఉద్యమకాలంలోనే ఇది తేలాలి అని పట్టుపట్టారు. సామాజిక న్యాయం, సామాజిక మార్పు బహుజనులకే అవసరం అని వక్కాణించారు. మాట వరసకు ఒప్పుకున్నా ఆచరణలో జయశంకర్ మరో దారి తీసుకున్నారు. దాని పర్యవసానమే ఈనాటి దుస్థితి. తెలంగాణ సాధన యుద్ధం మిగిలే ఉంది. ఆ యుద్ధమే మూడవ దశ ఉద్యమం. అధికారంలో ఉన్నవారికి కరోనా వరమైంది. ఎమర్జెన్సీని మించిన అత్యవసర స్థితి అమలైంది. ఇపుడిపుడే మూడవ దశ ఉద్యమం మొదలైంది. 


బహుజనులకు, సబ్బండ వర్ణాలకు విద్య, వైద్యం, ఉద్యోగం, ఆర్థికం, పరిశ్రమలు, వ్యాపారం, కాంట్రాక్టులు, స్వావలంబన అనే ప్రధానాంశాలే మూడవ దశ ఉద్యమ నినాదాలు. వీటికి రాజకీయ అధికారం మాస్టర్ కీ. బీసీ ఎస్సీ సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ విద్యార్థి సంఘాలు, ఎన్నికల పొత్తులలో గెలిచే విధంగా ఎదగాలి. అన్నీ మనమే పోటీ చేద్దాం అనే అత్యాశ, అవాస్తవిక ధోరణి మానుకొని సాగాలి. అలా పని చేస్తూ పోతే విజయం వారిదే. అందుకు ప్రగడ కోటయ్య, కాన్షీరాం, కేజ్రీవాల్‌ మనకు ఆదర్శం కావాలి. దీర్ఘకాలిక ప్రణాళికలో తక్షణ ప్రణాళికను జోడించాలి. మన ఓట్లు మనవారికే అనే నినాదం పుంజుకుంటున్నది. ఎక్కడ ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉందో అక్కడ వారినే నిలబెట్టి అట్లా ఏడెనిమిది నియోజక వర్గాలలో నిలబడిన కులాల వారంతా అన్ని నియోజక వర్గాల్లో కలిసి ప్రచారం చేయాలి. ఉద్యమ నిర్మాతలే నాయకులుగా ఎదగకపోతే ఇన్ని త్యాగాలు చేసి సాధించిన రాజ్యం గుంట నక్కల పాలవుతుంది.

బి.ఎస్. రాములు