ఒక చిన్న పుస్తకంపై ఎందుకంత భయం?

ABN , First Publish Date - 2021-11-25T06:37:36+05:30 IST

అసలంటూ నిషేధిత మావోయిస్టు సాహిత్యం ఉందా? మార్క్స్ నుండి మావో దాకా అందరి రచనలు నేడు ఇంటర్నెట్‌లో అందుబాటులోనే ఉన్నాయి. పసి మనసులను విషపూరితం చేసే అనేక పోర్న్ సైట్లనే మనం ఏమీ చేయలేకుండా ఉన్నాం....

ఒక చిన్న పుస్తకంపై ఎందుకంత భయం?

అసలంటూ నిషేధిత మావోయిస్టు సాహిత్యం ఉందా? మార్క్స్ నుండి మావో దాకా అందరి రచనలు నేడు ఇంటర్నెట్‌లో అందుబాటులోనే ఉన్నాయి. పసి మనసులను విషపూరితం చేసే అనేక పోర్న్ సైట్లనే మనం ఏమీ చేయలేకుండా ఉన్నాం. ఇంటర్నెట్టును, సోషల్ మీడియాను అదుపు చేయగలమా? శిరీష తన భర్త జ్ఞాపకంగా వేసుకుంటున్న ఈ పుస్తకం ఎలా ‘నిషేధింపబడాల్సిన సరుకుగా’ మారిందో ఎవరైనా అర్థమయ్యేటట్లు చెప్పగలరా?


ఆప్తుల మరణ వార్త విన్నప్పుడు కడసారి చూపుకోసం భూమి అంచుల వరకు ప్రయాణం చేస్తుంటాం. మరణించిన మనిషి చేరువలో మన సజీవ జ్ఞాపకాలను నెమరువేసుకుంటాం. ఆ చివరి చూపే మన చిట్టచివరి గౌరవంగా తలుస్తాం. అటువంటి అవకాశం లభించకపోవటం జీవించి ఉన్నవారికి మరణయాతన – ఈ పరిస్థితి సాధారణంగా శత్రుభూమిలో మరణించిన యుద్ధవీరుల బంధుమిత్రులకు ఎదురవుతుంది. ఇదే పరిస్థితి పీపుల్స్ వార్ అగ్రనాయకుడు రామకృష్ణ భార్య శిరీష గారికి ఇటీవల ఎదురైంది.


రామకృష్ణ సతీమణి శిరీష ఈ ప్రపంచలోనే ఎక్కడో సాదాసీదాగ తన బతుకేదో తాను గడుపుతున్నారని తెలుసు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఎన్‍కౌంటర్‍లో మరణించిన కొడుకు ‘మున్నా’ శవం చూసేందుకు, తెచ్చుకొనేందుకు గంటల కొద్దీ నిరీక్షించింది అని కూడా విన్నాం. తన జీవిత భాగస్వామిని కడసారి చూసేందుకు ఆమెకు ప్రభుత్వం ‘సేఫ్ పాసేజ్’ కల్పిస్తుందేమో అని భావించాం. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత వెలువడిన పత్రికా ప్రకటన, ఒక ఫోటో మాత్రమే అందరిలాగే శిరీష గారికి దక్కినట్లున్నాయి. నిషేధించబడిన ఒక రాజకీయ పార్టీకి చెంది, తుపాకుల మోతలో అనుక్షణం గడిపే వ్యక్తులకు అంతకుమించి మర్యాద దక్కుతుందని ఎలా ఆశించావు? అంటే చెప్పలేను. జెనీవా కన్వెన్షన్ ద్వారా యుద్ధం చేస్తున్న ఇరు వర్గాలకు అటువంటి వెసులుబాట్లు ఉంటాయేమోనని అపోహ.


ఇలాంటి అపోహలకు–2004లో పీపుల్స్ వార్ నాయకులు, జనశక్తి నేతలు, కొందరు మధ్యవర్తులు, ప్రభుత్వ పెద్దల మధ్య జరిగిన చర్చలు కూడా ఒక కారణం. ఎత్తుగా, బలంగా, పెద్ద పెద్ద మీసాలతో రాక్షసుల్లా అడవుల్లో నుంచి బయటకు వస్తారేమోనని ఎదురు చూస్తుంటే, అందరి మనుషుల్లాగే మామూలుగానే ఉన్నారే వీళ్ళు అని ఓ అధికారి వ్యాఖ్యానించాడని విన్నాం. మరీ ముఖ్యంగా మృదువుగా, సున్నితంగా, ఆదర్శవంతంగా, మాట్లాడుతున్న రామకృష్ణ ఆనాటి తెలుగు ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షించారు. మిగులు భూమిని దళితులకు, పేదలకు పంచమని, పౌర హక్కులు నెలకొల్పబడాలని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులనైనా ప్రజలకివ్వాలని ప్రధానంగా డిమాండ్ చేసారు. ఒక వారం తరువాత తిరిగి బృందమంతా అడవుల్లోకి వెళ్ళిపోయింది. చర్చలు విఫలమయ్యాయి కానీ వారిచ్చిన రాజకీయ ఎజెండాకు కట్టుబడే ఉన్నామని ప్రభుత్వం చెప్పుకుంటూనే వచ్చింది. మరొక కారణం– తెరాస ప్రభుత్వం ఉద్యమ కాలంలో ఈ ఎజెండా గురించి చాలానే మాట్లాడింది. దళితులకు మూడు ఎకరాల భూమికి ప్రాతిపదిక ఇలానే వచ్చిందని అంటుంటారు ‘‘ముఖ్యమంత్రి పదవి కంటే పౌర హక్కుల నాయకత్వమే మిన్న’’ అని సాక్షాత్తు కేసీఆర్ ఒక సభలో చెప్పారని ప్రొఫెసర్ హరగోపాల్ ఇటీవలే పేర్కొన్నారు. తెలంగాణా ఉద్యమానికి మద్దతునిచ్చిన, తాత్విక భూమికను కల్పించిన రాజకీయ పార్టీలలో పీపుల్స్ వార్ మొట్టమొదటిది. ఉద్యమ కాలంలో చాలామంది సానుభూతిపరులు, మద్దతుదారులు తెరాసలోకి వచ్చి చేరారు. వీటన్నిటి రీత్యా శిరీష గారికి ‘సేఫ్ పాసేజ్’ కల్పించి, తన సహచరుడికి వీడ్కోలు పలికే అవకాశం ఇస్తారని భావించాం.అవేవీ జరగలేదు.


కనీసం శిరీష తన భర్త జ్ఞాపకాలతో ఒక పుస్తకం వేసుకొని ఒక సంస్మరణ సభలో దాన్ని ఆవిష్కరించుకోవాలని అభిలషించారు. కానీ పుస్తకాలు ప్రచురితమవుతున్న ప్రెస్‌పై పోలీసులు దాడి చేశారు. ఆ పుస్తకంపై నిషేధిత సాహిత్యమన్న ముద్ర వేసి, పుస్తకాలు లేకుండా చేసి, ప్రెస్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చి, సంస్మరణ సభ జరగటానికి వీల్లేదని హుకుం జారీ చేసి, నానా భీభత్సం సృష్టించారు. అసలంటూ నిషేధిత మావోయిస్టు సాహిత్యం ఉందా? మార్క్స్ నుండి మావో దాకా అందరి రచనలు నేడు ఇంటర్నెట్‌లో అందుబాటులోనే ఉన్నాయి. దండకారణ్యంలో పీపుల్స్ వార్ గురించీ, జనతన సర్కార్ గురించీ డజన్లు కొద్ది ఇంగ్లీష్ పుస్తకాలు అన్ని పుస్తక కేంద్రాలలో, అమెజాన్‌లో దొరుకుతూనే ఉన్నాయి. పసి మనసులను విషపూరితం చేసే అనేక పోర్న్ సైట్లనే మనం ఏమీ చేయలేకుండా ఉన్నాం. ఇంటర్నెట్టును, సోషల్ మీడియాను అదుపు చేయగలమా? శిరీష గారు తన భర్త జ్ఞాపకంగా వేసుకుంటున్న ఈ పుస్తకం ఎలా ‘నిషేధింపబడాల్సిన సరుకుగా’ మారిందో ఎవరైనా అర్థమయ్యేటట్లు చెప్పగలరా?


యవ్వనంలో ఆదర్శాల వెలుగులో రామకృష్ణ సహచర్యం కోరుకున్న ఓ దళిత స్త్రీ శిరీష. ఆమెకు ఆయనతో చాలా తక్కువ సమయమే లభించింది. ఇన్నేళ్ళ జీవితంలో లెక్కగడితే మహా అయితే కొన్ని వారాలు. ఆమె తన కొడుకుతో మనందరి మధ్యనే ఉంది. తన భర్త పీపుల్స్ వార్‌లో అగ్ర నాయకుడు కదా అని ఆ పేరును ఎక్కడా వాడినట్లు చూడం. ఈ మధ్యలో ఎందరు నయీంలను, ఎందరు జడలు విచ్చుకున్న నాగరాజులను చూడలేదు మనం. ఆమె తన జీవితాన్ని పేద దళిత కుటుంబాల మధ్యనే సాదాసీదాగానే గడిపింది. కొడుకును ఎన్‌కౌంటర్‌లో పోగొట్టుకున్నప్పుడు అమర వీరుల బంధువుల సంఘం వాళ్ళతో కలిసి కొడుకు శవం కోసం నిరీక్షించింది. ఈ రాజ్యం ఆమెకు ఈపాటి ప్రజాస్వామ్య స్థలాన్ని కల్పిస్తే ఏం పోతుందో నాకు అర్థం కాలేదు. పీపుల్స్ వార్ ఉనికి లేకుండా చేయగలిగామని భావించే రాష్ట్రంలో ఓ పేద దళిత మహిళ తన భర్త గుర్తుగా ఓ పుస్తకం వేసుకొంటే పీపుల్స్ వార్ పునరుజ్జీవం పొందుతుందా? మరో విచిత్రం ఏమిటంటే రాజ్యాంగంపై నమ్మకం లేదని ప్రకటించినవారేమో ప్రజలకు రాజ్యాంగపు హక్కులన్నా ఇవ్వండి అని డిమాండ్ చేయడం, రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలో ఉన్న వారేమో ఆ హక్కుల్ని మర్చిపోవటం, కాలరాయటం.


ప్రజాస్వామిక హక్కులు కాలరాయబడినప్పుడు ప్రజలు ప్రత్యామ్నాయాల దిశగా ఆలోచిస్తారు. ఒకనాడు ‘ది హిందూ’కిచ్చిన ఇంటర్వ్యూలో పీపుల్స్ వార్ నేత ఆజాద్ ఈ మాటే తేల్చి చెప్పారు. తామేం కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్లు తుపాకులతో పుట్టలేదని – అన్ని పోరాటాలు అణిచివేయబడినప్పుడు, హక్కులు ధ్వంసం అయినప్పుడు వేరే దారిలేక సాయుధ పోరాటాన్ని మార్గంగా ఎంచుకోవాల్సి వస్తుందని అన్నారు. ఈ వాదనతో మనం ఏకీభవించాల్సిన పనిలేదు. కాని రాజ్యం కూడా రాజ్యాంగాన్ని వదిలి తుపాకీ పైనే ఆధారపడుతుందా? పోనీ పీపుల్స్ వార్ శ్రేణులపై అంటే సరే, మీ చట్టాలకు లోబడి మీటింగులకు మిమ్మల్నే అనుమతి అడిగే శిరీష లాంటి మహిళల విషయంలో కూడా రాజ్యాంగాన్ని పక్కనపెట్టి తుపాకీనే ఎక్కుపెట్టాలా? రాజ్యం ఉదాత్తంగా ఉండగలిగిన సందర్భాలు అప్పుడప్పుడు చరిత్రలో వస్తాయి. వాటిని జారవిడుచుకోవడం, తాను కూడగట్టుకునే సాంఘీక మద్దతును బలహీన పరుస్తుంది. ఒక చిన్నపాటి గెశ్చర్ చూపించగలిగి వుంటే ప్రజాస్వామ్యంపై చాలామంది నమ్మకం పెంచుకునేవాళ్ళు.


 ఐ.వి. రమణారావు

Updated Date - 2021-11-25T06:37:36+05:30 IST