Advertisement
Advertisement
Abn logo
Advertisement

ట్విటర్, ఫేస్‌బుక్, వాట్సప్ ఏవీ బ్యాన్ కాలేదేంటి? మే 26 డెడ్‌లైన్ కథేంటి? ఇంతకీ ఏం జరిగిందంటే..

ఉదయాన్నే నిద్ర లేవగానే బ్రష్ చేయడాని కన్నా ముందు మనం చేసే పని వాట్సాప్ చెక్ చేసుకోవడం. బ్రష్ చేసుకోగానే ఫేస్‌బుక్ బ్రౌజ్ చేయడం. ఆ తర్వాత ఫ్రెషప్ అయ్యామంటే ఇక ఇన్‌స్టాగ్రామ్ మీద విరుచుపడం. క్షణక్షణానికి ట్విట్టర్ అప్‌డేట్స్ చూస్కోవడం సరేసరి. ఇక యూట్యూబ్ లేకుంటే కాలం గడిచేదెలా? కానీ ఈ ప్రముఖ సోషల్ మీడియా వేదికలన్నీ భారత్‌లో బ్యాన్ కాబోతున్నాయంటూ విపరీతంగా ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ట్విట్టర్ బ్యాన్, ఫేస్‌బుక్ బ్యాన్, వాట్సాప్ బ్యాన్, యూట్యూబ్ బ్యాన్ వంటి హ్యాష్‌ట్యాగులు విపరీతంగా ట్రెండింగ్ అయ్యాయి. 24 గంటలు దాటితే ఈ సామాజిక మాధ్యమాలు ఏమీ ఓపెన్ అవ్వవంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఆ వార్తల్లో పేర్కొన్న 26వ తారీఖు వచ్చిందీ.. పోయింది. కానీ సామాజిక మాధ్యమాలు మాత్రం యథాతథంగా పనిచేస్తూనే ఉన్నాయి. ఇంతకీ ఈ తరహా వార్తలు రావడానికి కారణమేంటి.? ఈ గందరగోళానికి సంబంధించిన అసలు కథేంటి..? అనే దానిపైనే ప్రత్యేక కథనం.


మే 26 నుంచి భారత ప్రభుత్వం సూచించిన కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వీటిని అనుసరించకపోతే ఆ యాప్స్‌ను బ్యాన్ చేస్తారని ప్రచారం జరిగింది. ఇప్పటికే భారత ప్రభుత్వం చేసిన కొత్త నిబంధనలను నెట్‌ఫ్లిక్స్ అంగీకరించింది. అయితే ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. దీనిపై ఫేస్‌బుక్ ఒక ప్రటకన విడుదల చేసింది. తాము ప్రభుత్వం కొత్తగా చేసిన ఐటీ నిబంధనలను అంగీకరించాలనే అనుకుంటున్నామని, అయితే కొన్ని సమస్యాత్మక అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ కంపెనీలు కనుక ప్రభుత్వ నిబంధనలను అగీకరించకపోతే పరిస్థితి ఏంటి? ఇంకేముంది టిక్‌టాక్‌లాగే ఇవి కూడా బ్యానే అని అనుకుని అంతా తప్పులో కాలేశారు. భారత్‌లో ఇలాంటి కంపెనీలకు రాజ్యాంగం భద్రత కల్పించడమే అవి బ్యాన్ కాకపోవడానికి అసలు కారణం. 

దేశంలో ఉన్న ప్రముఖ సోషల్ మీడియా వేదికలన్నీ ఇక నుంచి నూతన ఐటీ గైడ్‌లైన్స్ అనుసరించాలనీ, ఇవి మే 26న అమల్లోకి వస్తాయని భారత ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఈ నిబంధనల ప్రకారం, ఈ బడా టెక్ కంపెనీలన్నీ కూడా భారత్‌లో ఒక చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్‌ను నియమించాలి. వీళ్లు ప్రభుత్వానికి అవసరమైనప్పుడు వెంటనే స్పందించేలా ఉండాలి. ప్రభుత్వం అడిగిన సమాచారాన్ని సత్వరమే అందించాలి. అలాగే నోడల్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేయాలి. వీళ్లు ప్రభుత్వానికి అవసరం అయినప్పుడు.. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు 24 గంటలు అందుబాటులో ఉండాలి. వీళ్లతోపాటు గ్రీవెన్స్ రిడ్రసల్ అధికారిని కూడా నియమించాలి. వీళ్లు యూజర్లకు ఎదురయ్యే సమస్యలు, కష్టాలకు జవాబుదారీగా వ్యవహరించాలి.


వాట్సాప్, ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. వంటి సామాజిక సంస్థలు.. ఏదైనా మెసేజ్ ఎక్కడ మొదలైందో, ఎవరు మొట్టమొదట పోస్ట్ చేశారో, ఎలా వైరల్ అయిందో కనిపెట్టి తమకు చెప్పే విధంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. దీని ద్వారా ఫేక్ ప్రోపగాండాను మొదలు పెట్టిన వాళ్లెవరో తెలుసుకోవచ్చన్నమాట. ఈ నిబంధనను కనుక అమలు చేయాలంటే ఈ యాప్స్ ఇప్పటి వరకూ వినియోగదారులకు అందిస్తున్న ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ తీసేయాలన్నమాట. ఇప్పటికే కొత్త ప్రైవసీ పాలసీ వల్ల తిప్పలు పడుతున్న వాట్సాప్‌.. ఈ కొత్త ఐటీ నిబంధనల వల్ల తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోంది. అందుకే ఈ విషయంలో ప్రభుత్వంతో ఇంకా చర్చలు జరపాలని ఈ కంపెనీ భావిస్తోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కూడా చర్చలవైపే మొగ్గుచూపుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించని ఈ కంపెనీలు దేశంలో బ్యాన్ చేస్తారా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి కాదు అనేదే సమాధానం. ప్రస్తుతానికైతే అస్సలు ఇలా జరగడం చాలా కష్టం. ఎందుకంటే ఐటీ చట్టంలోని సెక్షన్ 79(1) ప్రకారం, సోషల్ మీడియా, స్ట్రీమింగ్ సేవలకు  భద్రత ఉంటుంది.  ఈ చట్టం ఈ సేవలకు ‘ఇంటర్మీడియరీలు’గా పరిగణిస్తుంది. అంటే వీటిలో ఉండే కంటెంట్‌కు సదరు కంపెనీల బాధ్యత ఉండదు. 

ఇప్పుడు ప్రభుత్వం విధించిన కొత్త రూల్స్ పాటించని కంపెనీలకు ఈ భద్రత పోతుంది. అంటే ఈ వేదికలపై ఉన్న కంటెంట్‌ను కారణంగా చూపి వీటిని కోర్టుకు లాగడం సులభం అవుతుంది. అక్కడ విచారణ అనంతరం సంబంధిత చట్టాల ద్వారా ఈ కంపెనీలపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నూతన రూల్స్ పాటించకపోతే ప్రభుత్వానికి ఈ కంపెనీలన్నీ తమ జుట్టు అందించినట్లే. కానీ ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంతటి ప్రాముఖ్యతను సంపాదించుకుందో తెలిసిందే. జనజీవనంలో ఇవి బాగా పెనవేసుకుపోయాయి. కాబట్టి ప్రభుత్వం వీటి విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశాలు కూడా తక్కువే అని నిపుణులు అంటున్నారు. మరీ తీవ్రమైన పరిణామాలు జరిగి, ప్రభుత్వం ఈ సంస్థలపై కన్నెర్ర చేస్తే తప్ప ఇవి బ్యాన్ అవడం మాత్రం జరగదు. కాబట్టి ఇవి బ్యాన్ అవుతాయన్న భయం అక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ విషయంలో ప్రభుత్వం కానీ, సదరు కంపెనీలు కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయకుండా సడెన్‌గా మార్కెట్లో మాయమైపోవడం అస్సలు జరగదు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement