ప్రతి ఏటా లక్షల మంది భారత పౌరసత్వాన్ని విడిచిపెట్టి విదేశాలలో ఎందుకు స్థిరపడుతున్నారంటే..

ABN , First Publish Date - 2022-02-05T14:57:47+05:30 IST

ఎన్‌ఆర్‌సి అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్‌కి..

ప్రతి ఏటా లక్షల మంది భారత పౌరసత్వాన్ని విడిచిపెట్టి విదేశాలలో ఎందుకు స్థిరపడుతున్నారంటే..

ఎన్‌ఆర్‌సి అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్‌కి సంబంధించి దేశంలో ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, అయితే సిఎఎ అంటే పౌరసత్వ సవరణ బిల్లు 2020, జనవరి 10 నుంచి అమలులో ఉంది. ఫలితంగా అర్హులైన వ్యక్తులు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది భారతదేశ పౌరసత్వం పొందడానికి సంబంధించిన విషయం.. అయితే మరోవైపు ప్రతి సంవత్సరం లక్షలమంది భారతీయలు దేశ పౌరసత్వాన్ని విడిచిపెట్టి విదేశాలలో స్థిపడుతున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం 2015- 2019 మధ్య కాలంలో 6.76 లక్షల మందికి పైగా ప్రజలు భారత పౌరసత్వాన్ని వదులుకుని, ఇతర దేశాల పౌరసత్వం తీసుకున్నారు. గతంలో లోక్‌సభలో ఒక ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. మొత్తం 1,24,99,395 మంది భారత పౌరులు ఇతర దేశాల్లో నివసిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు దేశ పౌరసత్వాన్ని వదులుకోవడానికి కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. యూఎస్‌లో నివసిస్తున్న సగటున 44 శాతం భారతీయులు పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. అదే సమయంలో కెనడా, ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయులలో 33 శాతం మంది పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. అమెరికా వెళ్లే భారతీయుల్లో 44 శాతం మంది అక్కడి పౌరసత్వం పొంది అక్కడే స్థిరపడుతుండగా, కెనడా, ఆస్ట్రేలియాలకు వెళ్లే భారతీయుల్లో 33 శాతం మంది కూడా అదే విధంగా ఉన్నారని స్పష్టమవుతోంది. మిగిలిన దేశాల గురించి చెప్పాలంటే.. యుకె, సౌదీ అరేబియా, కువైట్, యుఎఇ, ఖతార్, సింగపూర్ మొదలైన దేశాల్లో కూడా పెద్ద సంఖ్యలో భారతీయులు స్థిరపడుతున్నారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం 1.25 కోట్ల మంది భారతీయ పౌరులు విదేశాల్లో నివసిస్తున్నారు. వీరిలో 37 లక్షల మంది ఓసీఐ అంటే ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్లు. అయితే వారికి ఓటు హక్కు, దేశంలో ఎన్నికల్లో పోటీ చేయడం, వ్యవసాయ ఆస్తులు కొనుగోలు చేయడం లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే హక్కు కూడా లేదు. ఇంతకీ భారతీయులు అక్కడి పౌరసత్వాన్ని ఎందుకు వదులుకుంటున్నారు? విద్య, మెరుగైన కెరీర్, ఆర్థిక శ్రేయస్సు, భవిష్యత్తు దృష్ట్యా.. భారతదేశం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు విదేశాలకు తరలివెళుతుంటారని నిపుణులు భావిస్తున్నారు. 


ఈ విషయమై ఢిల్లీ స్కూల్ ఆఫ్ జర్నలిజం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రుద్రేష్ నారాయణ్ మిశ్రా పలు వివరాలు తెలిజేస్తూ.. గత కొన్నేళ్లుగా విదేశాలకు వెళ్లి చదువుకునే యువతలో 80 శాతం మంది తిరిగి ఇక్కడకు రావడం లేదని కొన్ని రిపోర్టులలో వెల్లడవుతున్నదన్నారు. ఉన్నత కెరీర్ అవకాశాలను చూసుకుని విదేశాలలో స్థిపడుతున్నారని తెలిపారు. భారతీయ సంతతికి చెందిన సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, అరవింద్ కృష్ణ, పరాగ్ అగర్వాల్ తదితర సిఇఓలు దీనికి ఉదాహరణ అని అన్నారు. వీరు భారతీయ యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు.  ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ డెలాయిట్ సీఈవో పునీత్, వీఎంవేర్ సీఈవో రఘురామ్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అడోబ్ సీఈవో శంతను నారాయణ్ తదితరులు ఈ కోవలోనే ఉన్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువత బహుళజాతి కంపెనీల వైపు మొగ్గు చూపడంలో ఆశ్చర్యం లేదన్నారు. మరోవైపు భారతదేశంలో ఒకే పౌరసత్వం అనే నిబంధన ఉంది. భారత రాజ్యాంగం భారతీయులు ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉండేందుకు అనుమతించదు. ఇటలీ, ఐర్లాండ్, పరాగ్వే, అర్జెంటీనా వంటి దేశాల్లో ద్వంద్వ పౌరసత్వానికి నిబంధనలు ఉన్నాయి. ఈ దేశాల పౌరసత్వాన్ని సులభంగా పొందవచ్చు. భారత్‌లో ఇది చాలా కష్టం. భారత పౌరసత్వ చట్టం, 1955 ప్రకారం భారత పౌరునిగా ఉన్నప్పుడు మరొక దేశ పౌరునిగా ఉండేందుకు అవకాశం లేదు. పౌరసత్వ సవరణ చట్టం 1955 ప్రకారం, భారత పౌరులెవరూ రెండు దేశాల పౌరసత్వం తీసుకోలేరు. ఒకవేళ ఎవరైనా ఇందుకు ప్రయత్నిస్తే చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం వారి భారత పౌరసత్వం రద్దవుతుంది. భారతదేశంలోని ఎవరైనా పౌరులు నివాసం, ఉద్యోగం లేదా ఇతర కారణాలతో వేరే దేశ పౌరసత్వాన్ని తీసుకుంటే, వారి భారత పౌరసత్వాన్ని తొలగిస్తారు. ప్రస్తుతం ప్రభుత్వం ద్వంద్వ పౌరసత్వ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడం లేదని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గతంలో లోక్‌సభకు తెలిపింది.




Updated Date - 2022-02-05T14:57:47+05:30 IST