బీటెక్ చేసిన వాళ్లు ఎంటెక్‌ వైపు కాకుండా.. ఎంబీఏ వైపే ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే..

ABN , First Publish Date - 2021-10-11T16:18:47+05:30 IST

బీటెక్‌ తరవాత ఎంబీఏలో..

బీటెక్ చేసిన వాళ్లు ఎంటెక్‌ వైపు కాకుండా.. ఎంబీఏ వైపే ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే..

కొనసాగుతున్న ట్రెండ్‌: బీటెక్‌ + ఎంబీఏ


బీటెక్‌ తరవాత ఎంబీఏలో చేరుతున్న ఇంజనీరింగ్‌ విద్యార్థుల సంఖ్య చాలాకాలంగా పెరుగుతూ వస్తోంది. రాను రాను ఇది ఒక ట్రెండ్‌గా కూడా మారింది. క్యాట్‌ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో టాప్‌ ర్యాంకులు సాధిస్తున్న వారిలో ఎక్కువ మంది ఐఐటి, ఎన్‌ఐటిల నుంచి పట్టా పొందిన ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు ఉంటున్నారు. అయితే, అత్యున్నత స్థాయిలో ప్రొఫెషనల్‌ స్కిల్స్‌ ఉన్న ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు మాత్రమే ఎంబీఏలో రాణించగలరని అనుకోవడం పొరపాటు. సాధారణ గ్రాడ్యుయేట్లు సైతం ఇంజనీరింగ్‌ అభ్యర్థులను మించి మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో రాణిస్తున్నారు. అసలు ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు ఎంటెక్‌ వైపు వెళ్లకుండా ఎంబీఏ వైపే ఎందుకు మొగ్గు చూపుతున్నారో పరిశీలిద్దాం.


- ఇంజనీరింగ్‌లో చేరిన కొంత కాలానికి టెక్నికల్‌ సబ్జెక్టులపై ఆసక్తి సన్నగిల్లిన విద్యార్థులు ఎంటెక్‌ కంటే ఎంబీఏ చేయడానికి ఇష్టపడటం.

- మనదేశంలో ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్ల కంటే బిజినెస్‌ స్కూళ్ల నుంచి వచ్చిన ఎంబీఏ అభ్యర్థులకు అధిక వేతనాలు లభించడం.

- ఇండియాలో ఎక్కువ శాతం ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బోధన ప్రమాణాలు పడిపోతున్నాయి. ఫలితంగా విద్యార్థులు ఇంజనీరింగ్‌ సబ్జెక్టులపై విముఖత ప్రదర్శిస్తున్నారు. దానికి తోడు ప్రస్తుతం ఉన్న ఇంజనీరింగ్‌ కరికులమ్‌ కూడా సమగ్రంగా లేదు. అయితే, కొన్ని ప్రైవేటు సంస్థలు, అటామస్‌ కాలేజీలు ఇందుకు మినహాయింపు.

- ఎంబీఏ చదవాలని లక్ష్యంగా పెట్టుకున్న వారు డిగ్రీలో సంప్రదాయ కోర్సుల కన్నా ఇంజనీరింగ్‌ వైపు వెళ్తున్నారు. ఎందుకంటే క్యాట్‌, గ్జాట్‌, స్నాప్‌ వంటి జాతీయ స్థాయి ఎంబీఏ ప్రవేశ పరీక్షల్లో ఇంజనీరింగ్‌ అభ్యర్థులే ఎక్కువగా టాప్‌ ర్యాంకులు సాధిస్తున్నారు. ఎంబీఏ ప్రవేశ పరీక్షలో మేథ్స్‌ విభాగాలైన క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, లాజికల్‌ రీజనింగ్‌లలో సమాధానాలు గుర్తించడం ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు నల్లేరు మీద నడక లాంటిదే.

- బీటెక్‌ తరవాత ఎంటెక్‌ చేయడం ఆసక్తి లేని వారు ఎంబీఏ చేసి జీవితంలో స్థిరపడాలని కోరుకోవడం.

- అత్యధిక మంది ఎంబీఏనే ఆప్షన్‌గా ఎంపిక చేసుకోవడంతో అదే బెటర్‌ చాయి్‌సగా భావించడం.

- ఇతర దేశాలతో పోల్చితే ఇండియాలో ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు తక్కువగా ఉద్యోగాలుంటాయనే అభిప్రాయం.

- ఇంజనీరింగ్‌ ‘సేఫ్‌ బెట్‌’ అయితే ఎంబీఏ ‘సేఫెస్ట్‌ బెట్‌’ అని భావించడం.


బెటర్‌... ఎందుకు అంటే?

- ఇంజనీర్‌గా సాంకేతిక నైపుణ్యాలున్న వారు సులువుగా మేనేజీరియల్‌ రోల్‌లో ఇమడగలరు.

- ఇంజనీర్‌గా ఉత్పాదక నైపుణ్యాలను గడించిన వారు, వాటిని మించి లాభాదాయక వ్యాపారంగా మరల్చుకోవాలనుకుంటున్నారు. అందుకోసం ఎంబీఏలో చేరి మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌, ఆంత్రప్రెన్యూ్‌ర స్కిల్స్‌ని పెంచుకొని సొంత బిజినెస్‌ వెంచర్‌ని ప్రారంభించవచ్చు. లేదంటే ఏదైనా పెద్ద సంస్థలో చేరవచ్చు.

- ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో ఒక వస్తువు ఉత్పత్తి దశ నుంచి మార్కెటింగ్‌ వరకు జరిగే అన్ని దశల్లో ఇంజనీర్లు బహుముఖ పాత్రను పోషిస్తున్నారు. కాబట్టి ప్రొడక్షన్‌, మేనేజింగ్‌, మార్కెటింగ్‌ స్కిల్స్‌ విడివిడిగా ఉన్న వారి కంటే ఇవన్నీ కలగలిపి ఉన్న ‘బీటెక్‌- ఎంబీఏ’ అభ్యర్థులకే నేడు ఎంతో ప్రాధాన్యం లభిస్తోంది. అందువల్లనే ఏటా ఇంజనీరింగ్‌ పూర్తి చేసుకుంటున్న లక్షలాది మంది విద్యార్థుల్లో సుమారు 70 నుంచి 80 శాతం వరకు ఎంబీఏలో ప్రవేశాల కోసం క్యాట్‌ వంటి పరీక్షలకు హాజరవుతున్నారు.

- ఒక రకంగా చెప్పాలంటే ఈ పోటీ ప్రపంచంలో కేవలం బీటెక్‌ డిగ్రీతో నెగ్గుకు రావడం అంత సులువు కాదు. ఎందుకంటే  ఏటా విడుదలయ్యే ఎంప్లాయిబిలిటీ రిపోర్టులను పరిశీలిస్తే ఎక్కువ శాతం మంది ఎంటెక్‌ లేదా ఎంబీఏ చదివినవారినే మంచి అవకాశాలు వరిస్తున్నాయి.


వెన్వెంటనే చేరాలా?

బీటెక్‌ తరవాత వెంటనే ఎంబీఏ చేరాలా లేదా ఏదైనా జాబ్‌ చేసి కొంత అనుభవం గడించాక చేరాలా అనే సందేహాలు తలెత్తడం సహజమే. అయితే కొన్ని పెద్ద బిజినెస్‌ స్కూళ్లూ వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న వారికి మాత్రమే మేనేజ్‌మెంట్‌ విద్యలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఎంబీఏలో ఉండే కాన్సెఫ్ట్స్‌, ప్రిన్సిపల్స్‌కు సంబంధించి అభ్యర్థులు ముందుగానే అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉండగలిగితే మంచిదని భావించడమే అందుకు కారణం. కొన్ని సందర్భాల్లో వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ అనేది అనివార్యం. ఒక నిర్ధిష్ట సందర్భాన్ని చర్చించడానికి, తదుపరి నిర్వహించడానికి కొంత పని అనుభవం ఉన్న వ్యక్తి సామర్థ్యం ఫ్రెషర్‌ కంటే ఎక్కువ ఆచరణాత్మక విధానాన్ని కలిగి ఉంటుంది.

- ఇంజనీర్లు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను మేనేజ్‌మెంట్‌ నిర్వహణలో జొప్పించగలిగితే వారు అతి తొందరగా సీనియర్‌ మేనేజర్‌ స్థాయికి చేరుకోగలుగుతారు.

- పారిశ్రామిక రంగంలో ఇంజనీర్ల పాత్ర చాలా విస్తృతంగా మార్పు చెందుతోంది. అందుకు తగ్గట్టుగా రాణించాలంటే మేనేజ్‌మెంట్‌ నిర్వహణలో కూడా నైపుణ్యాలు అనివార్యం.

- ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ ఆయిన ఒక మేనేజరు తన విధి నిర్వహణలో ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నూతన  ఆవిష్కరణలు, సాంకేతిక పద్ధతులను అమలు చేయగలడు. 

- తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తిని సాధించే దిశలో అవసరమైన మేనేజీరియల్‌ స్కిల్స్‌ని మేనేజ్‌మెంట్‌ డిగ్రీ ద్వారా పొందవచ్చు. 


వేతనాలూ ఎక్కువే

ఇతర బీటెక్‌ అభ్యర్థులతో పోల్చితే బిటెక్‌+ఎంబీఏ అభ్యర్థులకు మంచి వేతన ప్యాకేజీలు లభిస్తున్నాయి. అయితే కేవలం పట్టాలు ఉన్నంత మాత్రమే సరిపోదని, సదరు జాబ్‌ రోల్స్‌కి అనుగుణ్యమైన స్కిల్స్‌ ఉండి ఆప్టిట్యూడ్‌, ఇతర కమ్యూనికేషన్‌, రైటింగ్‌ స్కిల్స్‌లో పట్టున్న వారికే ఇండస్ట్రీ పట్టంగడుతున్నదని నిపుణులు చెబుతున్నారు.


Updated Date - 2021-10-11T16:18:47+05:30 IST