Abn logo
Jan 24 2021 @ 02:17AM

ఎన్నికలు ఎందుకొద్దు!

 • ఉద్యోగులు ప్రజాసేవకులు
 • ఈ ధర్మాన్ని విస్మరిస్తే దుష్ఫలితాలు
 • ఎన్నికల సంఘం అంబేడ్కర్‌ మానస పుత్రిక
 • సకాలంలో ఎలక్షన్ల నిర్వహణ దాని విధి
 • సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చినా పాటిస్తాం
 • కమిషన్‌కు ప్రభుత్వం సహకరించాలి
 • సమావేశానికి రావాలని కోరినా
 • సీఎస్‌, ముఖ్య కార్యదర్శి రాలేదు
 • ఇబ్బందులెదురైతే సర్కారుదే బాధ్యత
 • సమస్యలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తా
 • అవసరమైతే సుప్రీంకోర్టుకూ చెబుతా
 • కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ స్పష్టీకరణ
 • ఆ వాదనలో సహేతుకత లేదు


ఎన్నికల్లో పాల్గొనాలని ప్రజలు ఉత్సుకతతో ఉన్నారు. వారి అభిప్రాయాన్ని గౌరవించాలి. మూడు రోజుల్లో గణతంత్ర దినోత్సవాలు జరుపుకోనున్నాం. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి.

దేశమంతటా ఎన్నికలు జరుగుతున్నా.. ఇక్కడ వద్దనడం సరికాదు. ఉద్యోగులు ప్రజాసేవకులు. ఈ ధర్మాన్ని విస్మరిస్తే దుష్ఫలితాలుంటాయి.

- కమిషనర్‌

అమరావతి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ సహాయ నిరాకరణ కొనసాగుతున్నప్పటికీ... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ తనపని తాను చేసుకుపోయారు. పంచాయతీ ఎన్నికలకు శనివారం ఆయన ‘తొలి’ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా రమేశ్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు సహేతుకమేనని, ఎస్‌ఈసీ వాదనను కోర్టు విశ్వసించిందని తెలిపారు. స్థానిక ఎన్నికలను షెడ్యూలు ప్రకారమే నిర్వహిస్తామని ప్రకటించారు. హైకోర్టు ఆదేశాల మేరకే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ చేపట్టామని  తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని, కోర్టు ఏ తీర్పు ఇచ్చినా తక్షణం పాటిస్తామన్నారు. ఎస్‌ఈసీకి న్యాయవ్యవస్థపై విశ్వాసం, విధేయత ఉన్నాయని చెప్పారు. ఈ ఎన్నికల నిర్వహణ  పెను సవాలేనన్నారు. ఎన్నికల నిర్వహణపై ఉద్యోగ సంఘాలు భిన్న వాదనలు వినిపించాయని.. దేశమంతటా ఎన్నికలు జరుగుతున్నా.. ఇక్కడ వద్దనడం సరికాదని చెప్పారు. ఉద్యోగులు ప్రజాసేవకులని.. ఈ ధర్మాన్ని విస్మరిస్తే దుష్ఫలితాలుంటాయన్నారు.


ఎన్నికల సక్రమ నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. రెవెన్యూ డివిజన్‌ ప్రాతిపదికన నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని.. తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహాయించి మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. ‘రాజ్యాంగం రచించిన అంబేడ్కర్‌ మానస పుత్రికే ఎన్నికల సంఘం. ఎన్నికలు సకాలంలో నిర్వహించడం దాని విధి. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ స్పందనపై మిశ్రమ అనుభవాలున్నాయి. శుక్రవారం హాజరుకావాలని కోరినా అధికారులు రాలేదు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎస్‌, పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి హాజరుకావాలని కోరాం. అయినా హాజరు కాలేదు. పంచాయతీ ఎన్నికలు చరిత్రాత్మకం. వీటి వల్ల స్థానిక నాయకత్వం బలపడుతుంది. విధులు, నిధులు, అధికారాలు ఎన్నికల వల్లే సాధ్యం’ అని పేర్కొన్నారు. 


ఏకగ్రీవాలపై సునిశిత పరిశీలన..

ఏకగ్రీవ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని నిమ్మగడ్డ తెలిపారు. ఐజీ స్థాయి అధికారులతో ఏకగ్రీవాలను సునిశితంగా పరిశీలిస్తామన్నారు. ఎన్నికల సంఘానికి నిధులు, సిబ్బంది కొరత వంటి సమస్యలున్నాయని.. కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, జాయింట్‌ డైరెక్టర్‌, న్యాయ సలహాదారులెవరూ లేరని చెప్పారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని.. దీంతో కోర్టు కెళ్లామని, కోర్టు చెప్పినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన కనిపించలేదని తెలిపారు. ప్రభుత్వ ఉదాశీనతను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఎస్‌ఈసీలో కొంత మంది సిబ్బందే ఉన్నా.. సమర్థంగా పనిచేస్తున్నారని.. సిబ్బంది కొరత ఉన్నా.. పనితీరులో అలసత్వం ఉండదని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులు ఎదురైతే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కమిషనర్‌ తేల్చిచెప్పారు. దీనిపై గవర్నర్‌కు నివేదిస్తానన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్తానని తెలిపారు. రాజ్యాంగ బాధ్యతలు పూర్తి చేయడానికి ముందుకెళ్తానని, ఇది వ్యక్తిగత నిర్ణయం కాదన్నారు. సవాళ్లను అధిగమించి ముందుకు వెళ్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, జిల్లా కలెక్టర్ల సహకారం ఉంటుందని భావిస్తున్నామని అన్నారు. 


3.6 లక్షల మంది ఓటు కోల్పోయారు 

ఓటర్ల జాబితా వివరాలు ఇవ్వడంలో పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ విఫలమయ్యారని నిమ్మగడ్డ ఆక్షేపించారు. ‘2021 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలకు వెళ్లాల్సి ఉండగా విధిలేని పరిస్థితుల్లో 2019 జాబితాతోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. దీంతో 3.6 లక్షల మంది కొత్త ఓటు హక్కు పొందిన యువత అవకాశం కోల్పోతున్నారు. బాధ్యులైనవారిపై సరైన సమయంలో ఎస్‌ఈసీ చర్యలు తీసుకుంటుంది. సుప్రీంకోర్టులో సోమవారం విచారణ ఉన్నందున అప్పటి వరకు నోటిఫికేషన్‌ నిలుపుదల చేయాలని ప్రభుత్వం కోరిం ది. కానీ ఇది సహేతుకంగా లేదని ఎస్‌ఈసీ అభిప్రాయపడింది. సమాచారాన్ని గోప్యంగా ఉంచడంలో సీఎస్‌ విఫలమయ్యారు. కొన్ని సమాచారాలు రహస్యంగా ఉండాలి. ఎస్‌ఈసీ ఆ నిబంధనలు పాటిస్తుంది. కానీ సీఎస్‌ శుక్రవారం రాసిన లేఖ నాకు చేరకముందే టీవీ చానళ్లలో వచ్చింది. ఇక నుంచైనా ఆయన గోప్యత పాటించాలి’ అని కమిషనర్‌ సూచించారు.


వెంకట్రామిరెడ్డివి నేరపూరిత వ్యాఖ్యలు

కమిషనర్‌కు ప్రాణహాని బెదిరింపు 

డీజీపీకి నిమ్మగడ్డ లేఖ 

 పంచాయతీ ఎన్నికలను వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు నేరపూరితం గా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అన్నారు. ఆయన కార్యకలాపాలపై నిఘా పె ట్టాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు శనివారం లేఖ రాశా రు. ‘పంచాయతీ ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వెంకట్రామిరెడ్డి.. బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ ఆత్మరక్షణ హక్కు కల్పించింద ని.. దీనికి కొనసాగింపుగా ఎదుట వారిని చంపే హక్కు కూడా కల్పించిందని వ్యాఖ్యానించారు. వీటిని రెచ్చగొట్టే వ్యాఖ్యలుగా.. కమిషనర్‌కు ప్రాణహాని బెదిరింపుగా ఎస్‌ఈసీ పరిగణిస్తోంది. అందుచేత డీజీపీ వీటిని పరిగణనలోకి తీసుకుని.. కమిషనర్‌పై భౌతిక దాడులకు దారితీసే విధంగా వెంకట్రామిరెడ్డి కార్యకలాపాలు ఉన్నాయేమో నిఘా పెట్టాలని కోరుతోంది’ అని అందులో పేర్కొన్నారు. శనివారం ఉదయం ఎస్‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశాక వెంకట్రామిరెడ్డి పైవ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొవిడ్‌ ప్రభావమున్నందున ఎన్నికలు నిర్వహించరాదని, ఉద్యోగులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతారని గతంలో కూడా ఆయన అన్నారు.

Advertisement
Advertisement
Advertisement