Abn logo
Oct 23 2021 @ 06:11AM

ఎందుకీ వివక్ష..?

రాజోలి జలాశయంతో ముంపునకు గురి కానున్న పంట పొలాలు

రాజోలి జలాశయం నిర్మాణంలో..

6,536.27 ఎకరాలు, ఐదు గ్రామాలు ముంపు

భూ సేకరణకు సన్నాహాలు

ఎకరాకు రూ.20-30 లక్షలు డిమాండ్‌

రూ.12 లక్షలు ఇస్తామంటున్న అధికారులు

(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో కేసీ కాలువ పరిధిలో 75 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. పంట చివర్లో సాగునీరు అందక దిగుబడి రూపంలో అన్నదాతలు భారీగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితి నుంచి ఆయకట్టు పొలాలను కాపాడేందుకు కుందూ నదిపై 2.95 టీఎంసీల సామర్థ్యంతో రాజోలి జలాశయం నిర్మాణానికి 2008లో బీజం వేశారు. 13 ఏళ్ల తరువాత కడప జిల్లా పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె, కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం రాజోలి మధ్య కుందూ నదిపై రాజోలి జలాశయం నిర్మాణానికి రూ.1,357.10 కోట్లతో సీఎం జగన శంకుస్థాపన చేశారు. అందులో రూ.306.46 కోట్లకు టెండర్లు పిలిచారు.


ఎకరాకు రూ.20-30 లక్షలు ఇవ్వాల్సిందే

రాజోలి జలాశయం నిర్మాణంలో పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె, గరిశలూరు, ఉప్పలూరు, బలపనగూడూరు, చిన్నముడియం గ్రామాలతో పాటు 8,260.27 ఎకరాలు ముంపునకు గురి అవుతున్నాయి. అందులో 6,536.27 ఎకరాలు పట్టా భూములే. భూ సేకరణలో భాగంగా ఇటీవల కడప కలెక్టరేట్‌లో జేసీ (రెవెన్యూ) గౌతమి, జీఎనఎ్‌సఎ్‌స స్పెషల్‌ కలెక్టరు ఎం.రాంమోహన భూ నిర్వాసిత రైతులతో సమావేశం నిర్వహించారు. భూమి స్వభావాన్నిబట్టి బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.18-20 లక్షలు పలుకుతోందని రైతులు అంటున్నారు. దీంతో ఎకరాకు మెట్ట భూములకు రూ.20 లక్షలు, సాగునీటి ఆధారం ఉన్న భూములకు రూ.30 లక్షలు ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా.. అక్కడ రిజిస్ట్రేషన విలువ ప్రకారం ఎకర రూ.4.50 లక్షలకు మించి లేదని, గత ఏడాది కుందూ వరద కాలువ నిర్మాణానికి రూ.11 లక్షలు ఇవ్వడంతో అదే ధర ఇచ్చేలా ప్రభుత్వానికి సిఫారస్‌ చేస్తామని అధికారులు తేల్చి చెప్పారు. ఆ తరువాత జమ్మలమడుగు ఆర్టీఓ ఆఫీసులో రెండో పర్యాయం రైతుల సమావేశం నిర్వహించి ఎకరాకు రూ.12 లక్షలకు రెకమెండ్‌ చేస్తామని స్పెషల్‌ కలెక్టరు రైతులకు వివరించారు. రైతులు కూడా ఓ మెట్టుదిగి రూ.19 లక్షలకు ఒక్క రూపాయి తగ్గినా ఒప్పుకోమంటూ విన్నవించారు.


అక్కడ అలా.. ఇక్కడ ఇలా..

ప్రొద్దుటూరు పట్టణంలో జగనన్న కాలనీల నిర్మాణంలో భాగంగా పేదల ఇంటి పట్టాల కోసం సుమారు 286 ఎకరాల భూ సేకరణ చేశారు. ఎకరాకు రామేశ్వరం దగ్గర రూ.27.63 లక్షలు, బొల్లావరం వద్ద రూ.40.40 లక్షలు, కొత్తపల్లి వద్ద రూ.45 లక్షలు భూ పరిహారం చెల్లించారు. ఈ భూములకు దాదాపుగా 10-12 కి.మీల దూరంలో ఉన్న పెద్దముడియం మండలంలో రాజోలి జలాశయం ముంపు గ్రామాల్లో ఎకరా రూ.12 లక్షలకు మించి ఇవ్వలేమని అధికారులు అంటున్నారు. రాజోలి జలాశయం నిర్మాణ గ్రామాలకు అతి సమీపంలోనే మెట్ట పొలాలకు ఎకరా రూ.27.65 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు ఇచ్చిన అధికారులు భవిష్యత్తు తరాల కోసం తాతల కాలం నుంచి జీవనాధారమైన సాగు భూములు త్యాగం చేస్తే సముచిత పరిహారం ఇవ్వకుండా ఎందుకు వివక్ష చూపుతున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు.


ఎకరం రూ.18-20 లక్షలు పలుకుతోంది

- ఎల్‌.వెంకటకృష్ణారెడ్డి, బాధిత రైతు, చిన్నముడియం గ్రామం, పెద్దముడియం మండలం

రాజోలి జలాశయం నిర్మాణం చేపడితే మాకున్న 60 ఎకరాలు మునిగిపోతుంది. మా పల్లెలో మొత్తం 1,500 ఎకరాలు ముంపులో పోతుంది. ప్రస్తుతం ఎకరా రూ.18-20 లక్షలు పలుకుతోంది. భూ సేకరణ అధికారులేమో ఎకరాకు మొదట రూ.11 లక్షలు, రెండో మీటింగ్‌లో రూ.12 లక్షలకు మించి ఇవ్వలేమని అంటున్నారు. ఆ రేటుకు మేము కొనాలంటే అర ఎకరా కూడా రాదు. మెట్ట పొలాలకు రూ.20 లక్షలు, బోర్లు, కుందూ నది మోటర్ల ద్వారా సాగునీటి ఆధారం ఉన్న పొలాలకు రూ.30 లక్షలు ఇవ్వాలని మా గ్రామ రైతులందరు కోరుతున్నాం. న్యాయమైన పరిహారం అందితేనే భూములు వదులుకుంటాం. ఇది ఊరంతా సమష్టిగా తీసుకున్న నిర్ణయం.


రైతులతో మాట్లాడుతున్నాం..

- ఎం.రాంమోహన, గాలేరు-నగరి ప్రాజెక్టు స్పెషల్‌ కలెక్టరు, కడప

రాజోలి జలాశయం నిర్మాణం కోసం 7,385.62 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది. అక్కడ ఎకరా రూ.4.50 లక్షలు ఉంది. గత ఏడాది కుందూ వరద కాలువ నిర్మాణం కోసం రూ.11 లక్షలకు సేకరించారు. అదే రేటు ఇస్తామని రైతులకు సూచించాం. రైతులు ఒప్పు కోవడం లేదు. మరోసారి రైతులతో సమావేశం అవుతాం. రైతుల విన్నపాలను స్వీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. 

రాజోలి రిజర్వాయరు ముంపు గ్రామాల్లో ఒకటైన చిన్నముడియం