Abn logo
Apr 3 2020 @ 00:30AM

బొగ్గుగని కార్మికులపట్ల ఎందుకీ వివక్ష?

లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత దేశంలోని 14 వేల పైచిలుకు పరిశ్రమలు మూతపడ్డాయి. ఒక విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు మాత్రమే పనిచేస్తున్నాయి. కోలిండియా లెక్క ప్రకారం లాక్‌డౌన్‌ నాటికి దేశంలోని విద్యుత్‌ సంస్థల వద్ద ఉన్న బొగ్గు స్టాక్‌ 107 మిలియన్‌ టన్నులు. ఇటు సింగరేణి బొగ్గు సరఫరా చేసే ఎన్‌టిపిసి, ఎస్‌టీపీపీ, అటు ఏపీ జెన్‌కో, అటు కర్నాటక, తమిళనాడు విద్యుత్‌ సంస్థల వద్ద 34 రోజులకు సరిపడా బొగ్గు ఉంది. ఇటు, సింగరేణిలోనూ తవ్వి తీసి గ్రౌండ్‌ మీద ఉన్న బొగ్గు 3 మిలియన్‌ టన్నులకు పైగానే ఉన్నది. బొగ్గు అవసరం మరో రెండు నెలల వరకూ విద్యుత్‌ సంస్థలకు ఉండదు. ప్రభుత్వాలకు కూడా ఈ విషయాలు తెలుసు. అయినా బొగ్గుగనులకు లాక్‌డౌన్‌ ఇవ్వలేదు. లాక్‌డౌన్‌ ప్రకటించిన తొమ్మిది రోజుల వరకు సింగరేణిలో కార్మికులు పనిచేస్తూనే ఉన్నారు. కొన్ని ప్రాంతాలు మినహా కోలిండియాలో ఇంకా భూగర్భగనులలో కార్మికులు విధులకు వెళ్తూనే ఉన్నారు. ఉత్పత్తి చేస్తూనే ఉన్నారు. బొగ్గుగనులలో పనిచేసే కార్మికులకు భౌతిక దూరం అసాధ్యం.


15 నుంచి 20 మంది కార్మికులు కలిసి భూగర్భగనులలో పనిచేయాల్సి ఉంటుంది. దేశంలోని అత్యున్నత భూగర్భగనుల రక్షణ విభాగం అధికారి (చీఫ్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ) సాహు మొన్న మార్చి 30న దేశంలోని బొగ్గు సంస్థలన్నింటికి కూడా భూగర్భగనులను బంద్‌ చేయాలని, లాక్‌డౌన్‌ చేయాలని ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు సింగరేణి బుధవారం సెకండ్‌ షిప్టు నుంచి 22 నాన మెకనైజ్డ్‌ బొగ్గు బావులకు లాక్‌డౌన్‌ బదులు లే ఆఫ్‌ ఇచ్చింది. లే ఆఫ్‌ అంటే కార్మికులు గనుల వరకు వెళ్ళి హాజరు వేయించుకొని తిరిగి రావాలి. ఈనెల 14 వరకు ఇదే పరిస్థితి. దీనికి మినహాయింపు ఇస్తామని అధికారులు మౌఖికంగా ప్రకటించారు. లే ఆఫ్‌ అంటే కార్మికులకు సగం జీతం. లాక్‌డౌన్‌ అంటే పూర్తి జీతం. ఇప్పుడు యూనియన్లు పూర్తి జీతం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయి. చట్ట ప్రకారం ఇది సరైనది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి 44 రోజులు సమ్మె నిర్వహించి ఢిల్లీ దాకా నిరసనను వినిపించిన ఉద్యమంలో మొదటివరుసలో నిలబడ్డ తమకు ప్రభుత్వం ఇలా అన్యాయం చేస్తున్నదని సింగరేణి కార్మికులు వాపోతున్నారు. బొగ్గుగని కార్మికులకు సకలజనుల సమ్మె జీతం ఇవ్వడంతో పాటు తెలంగాణ ఇంక్రిమెంట్‌ను కూడా ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏమీ మాట్లాడలేదు. లాక్‌డౌన్‌లో పనిచేసిన సింగరేణి కార్మికులను ప్రశంసించలేదు. దేశంలో ఎలాంటి విపత్తు వచ్చినా తమ ఒక్క రోజు వేతనాన్ని అందించి, ఆ ప్రాంతాలకు వెళ్ళి భౌతిక సహాయాన్ని కూడా చేసిన బొగ్గుగని కార్మికులు ఇప్పుడు కోవిడ్‌-19 విషయంలో ఒక్క మస్టర్‌ ఇవ్వడానికి కూడా సిద్ధంగాలేమని అంటున్నారు.


కారణం తమని నిర్లక్ష్యం చేస్తున్నారన్నభావనే. పేమెంట్స్‌ యాక్ట్‌కు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన సింగరేణి కార్మికుల జీతాల నుంచి ఆర్థిక పరిస్థితి బాగా లేదన్న వాదనతో 50 శాతం కోత విధించడాన్ని కూడా కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది సేవా రంగం వారికి పూర్తి జీతాలు ఇస్తామని చెబుతున్నప్పుడు, తమకెందుకు కోత అన్నది వారి ప్రశ్న. తమకు డబ్బులిచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్రప్రభుత్వ రంగంలో ఉన్న తమ సంస్థ లాభాలలో ఉంది, జీతాలు కూడా సంస్థ అకౌంట్‌లోకే వస్తాయి మరి మాకెందుకు ఈ కోత అని సింగరేణి కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కార్మికులు తీవ్ర ఆందోళనలో, అసంతృప్తితో ఉన్న విషయాన్ని గుర్తించిన జాతీయ సంఘాలు గురువారం సమ్మె నోటీసు ఇచ్చాయి. సమ్మెకు కార్మికులు వెళ్ళడానికి వెనకాడరు. ప్రస్తుతం 45 బొగ్గుబావులలో 22 భూగర్భగనులు లే ఆఫ్‌లో ఉన్నాయి. ఐదు మెకనైజ్డ్స్‌ భూగర్భగనులు, 18 ఓపెన్‌కాస్ట్‌ గనులు పనిచేస్తున్నాయి. సింగరేణిలో ఇంకా ఉత్పత్తి జరుగుతూనే ఉంది. పూర్తిస్థాయిలో విధులు నిర్వహించి, మార్చి నెలలో బొగ్గును అందించిన కార్మికులకు వేతనాల్లో 50 శాతం కోత ఏమిటి? ఆర్థికభారం రాష్ట్ర ప్రభుత్వానికి పడనప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.27 సింగరేణికి ఎందుకు వర్తింపజేయాలి అనేది ప్రశ్న. తమకు పూర్తి వేతనాలు ఇచ్చి లాక్‌డౌన్‌ విధించాలని, లాక్‌డౌన్‌లోనూ పూర్తి వేతనాలు ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు. ఒక్క రోజు వేతనం కోవిడ్‌-19 కరోనా నివారణకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇవ్వడానికి అభ్యంతరం లేదని కూడా మెజార్టీ కార్మికులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గని కార్మికులకు అన్నీ ఇస్తున్నారు. మరి ఈ విపత్కరమైన పరిస్థితులలో ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో తెలియదు. 

ఎండి. మునీర్

Advertisement
Advertisement