Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 10 Jan 2022 00:14:27 IST

‘‘చుట్టూ ఇంత జీవితమున్నాక ఊహల్లో తేలిపోవడం ఎందుకు అనిపించింది.’’

twitter-iconwatsapp-iconfb-icon
చుట్టూ ఇంత జీవితమున్నాక ఊహల్లో తేలిపోవడం ఎందుకు అనిపించింది.

కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత తగుళ్ళ గోపాల్‌తో ‘వివిధ’ జరిపిన సంభాషణ

తగుళ్ళ గోపాల్‌  


‘దండ కడియం’ పుస్తకానికి కేంద్ర సాహిత్య యువ పురస్కారాన్ని అందుకున్నందుకు అభినందనలు. కవిత్వం వైపు మీ తొలి అడుగుల గురించి చెప్పండి?

పదవ తరగతి బి.సి రెసిడెన్షియల్‌ నాగార్జున సాగర్‌లో చదువుకుంటున్నపుడు మా తెలుగు సార్‌ వాళ్ళు డి. సి. నరసింహులు, సుజాత మేడం గార్ల ప్రేరణతో ఆటవెలది, తేటగీతి పద్యాలు రాసేటోడిని. తర్వాత ఇంటర్‌ కల్వకుర్తిలో చేసేట పుడు ప్రాసలతో కూడిన మినీ కవితలు రాసేది. హైద్రాబాద్‌లో టి.టి.సి చేస్తున్నపుడు సింగిడి సాహిత్య సభలకు వెళ్ళేది. ఎం.నారాయణ శర్మ గారు రాసిన ‘అస్తిత్వ పుష్పాలు’ నానీలు ఎంతో ఆకర్షించాయి. వాటి ప్రేరణతో 2016లో ‘తీరొక్క పువ్వు’ అనే నానీల సంపుటి తెచ్చాను. వచన కవిత వైపు అడుగులు పడడానికి కవిసంగమం ఎంతో తోడ్పడింది. నేను నడిసొచ్చిన దారినంత కవిత్వం చేయడానికి కవిసంగమంలోని శీర్షికలు, చదివిన పుస్తకాలు ఎంతో ఉపయోగపడ్డాయి.


మీ శైలిని మలిచిన, వస్తువును నిర్దేశించిన అనుభవాలేమిటి?

మొదట అందరిలాగే సాధారణ భాషలో - కవిత్వం రాసేది. కాశిరాజన్న ‘భూమధ్య రేఖ’, నాగిళ్ళ రమేషన్న ‘ఉద్దరాశి పూలచెట్టు’ కవిత్వాలను చదివిన తర్వాత నా జీవితాన్ని వాటిల్లో చూసుకున్న. చుట్టూ ఇంత జీవితమున్నాక ఊహాల్లో తేలిపోవడం ఎందుకు అనిపించింది. పసుల గాసిన బాల్యం, కర్రీస్‌ పాయింటింగ్‌లో పని చేసిన జీవితానుభవాలు, గ్రామీణ బహుజన సంస్కృతే కవితా వస్తువులు నాకు. కవిత్వం చాలా మందికి చేరకపోవడానికి కారణం దానిలోని సంక్లిష్టత. అందుకే మాములు జనాలకు కూడా అర్థమయ్యేటట్లు కవిత్వం రాయాలని అట్లనే రాసిన.


మీ ‘దండ కడియం’ కవిత్వ సంపుటి గురించి?  

తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం ‘దండ కడియం’. పేదరికంలోంచి, పిల్ల బాటలు గుండా నడిచి ఒక అక్షరంగా మారిన  పల్లెటూరి పిలగాడి ఆత్మకథ. అచ్చంగా ఇది తాత, నాయినల శ్రమ వారసత్వం. అనేక శ్రామిక కూలాల చెమటబొట్లు. నలుగురు కూడి తినాలనుకునే విస్తరాకుల కట్ట. 


మనిషిని దగ్గరకు తీసుకునే తంగేడుపూల పరిమళం. స్థానికత, మానవీయతల కలబోత. ‘‘ఒకే ఆకాశాన్ని కప్పుకున్న వాళ్ళం/ ఒకే మట్టిని కప్పుకోవలసిన వాళ్ళం/ ఇది చాలదా/ మనం బంధువులం కావడానికి’’ అనే తాత్విక వాక్యాల సారాంశం నా ‘దండకడియం’.


కవిగా మీరు మున్ముందు నిర్దేశించుకున్న దారి ఏమైనా ఉందా?

జీవిత నేపథ్యం, సామాజిక సంఘర్షణలను రెండిటిని వేరువేరుగా చూడను. ఇప్పటి జీవితానుభవాలు, సామాజిక పరిణామాలను బట్టి నా కవితావాక్యం ఉంటుంది.


మీ ముందు తరం, మీ తరం కవిత్వం మీద మీ పరిశీలన?

వస్తువును చూసే చూపులో రెండు తరాల మధ్య అంతరం ఉంది. వస్తువు పట్ల ఇప్పటి తరం చూపు సూక్ష్మమైనది. నిర్మాణ పరంగా కూడా సంక్లిష్టత లేకుండా చెప్పడం ఇప్పటి తరంలో కనిపిస్తుంది. ఇంతకుముందులాగే ప్రపంచీకరణ, సామాజిక స్థితిగతులు ఇప్పటి తరాన్ని ప్రభావితం చేస్తున్నప్పటికి సాంకేతిక భాష, ఆధునిక జీవితం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటి తరం బతుకుతున్న లైఫ్‌ స్టైల్‌ వలన వాడే మెటాఫర్లలో తేడా వచ్చింది. అభివ్యక్తిలో తేడా వచ్చింది. ఒకరిని అనుకరించాలని కాకుండా ఎవరికి వారు వాళ్ళదైన భాషతో, వాళ్ళదైన జీవితాన్ని రాస్తున్నారు.

తగుళ్ళ గోపాల్‌

9505056316


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.