వైద్యులపై కేసులెందుకు పెట్టలేదు?

ABN , First Publish Date - 2020-05-28T08:38:21+05:30 IST

గద్వాల జిల్లాకు చెందిన గర్భిణికి చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహించిన డాక్టర్లపై క్రిమినల్‌ కేసులు ఎందుకు పెట్టలేదని హైకోర్టు ప్రశ్నించింది. ‘‘ఇది కఠోరమైన వాస్తవం. కరోనా సోకిందనే అనుమానంతోనే పురిటి నొప్పులతో వచ్చిన మహిళకు వైద్యులు చికిత్స నిరాకరించారు’’ అని ధర్మాసనం

వైద్యులపై కేసులెందుకు పెట్టలేదు?

హైదరాబాద్‌, మే 27(ఆంధ్రజ్యోతి): గద్వాల జిల్లాకు చెందిన గర్భిణికి చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహించిన డాక్టర్లపై క్రిమినల్‌ కేసులు ఎందుకు పెట్టలేదని హైకోర్టు ప్రశ్నించింది. ‘‘ఇది కఠోరమైన వాస్తవం. కరోనా సోకిందనే అనుమానంతోనే పురిటి నొప్పులతో వచ్చిన మహిళకు వైద్యులు చికిత్స నిరాకరించారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. క్రిమినల్‌ కేసులకూ, శాఖపరమైన విచారణ మధ్య చాలా తేడా ఉందని తెలిపింది. చికిత్స అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని స్పష్టం చేసింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా ఎవరూ అడ్డుపడలేరని అభిప్రాయపడింది. సదరు వైద్యులపై నమోదు చేసిన కేసుల వివరాలు జూన్‌ 10లోగా కోర్టుకు ఇవ్వాలని తేల్చిచెప్పింది. ఈమేరకు హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. గద్వాల జిల్లాకు చెందిన జెనీలా(22) ఇటీవల పురిటి నొప్పులతో ఆసుపత్రికి వెళ్లగా అక్కడ వైద్యులు కరోనా లక్షణాలున్నాయనే అనుమానంతో చికిత్స అందించలేదు. ఆమె ప్రసవించాక తల్లి, శిశువు వేర్వేరు ఆస్పత్రుల్లో మరణించారు. ఈ కేసు బుధవారం విచారణకు వచ్చింది. జెనీలాకు చికిత్స  విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై శాఖాపరమైన విచారణకు ఆదేశించామని, విచారణ పూర్తయి నివేదిక రాగానే బాధ్యులైన వైద్యులపైన, చికిత్స అందించడానికి నిరాకరించిన ఏడు ఆసుపత్రులపైనా చర్యలు తీసుకుంటామని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ కోర్టుకు తెలిపారు. కేసు పూర్వాపరాలపై గాంధీ/ఉస్మానియా ఆస్పత్రులకు చెందిన విశ్రాంత సూపరింటెండెంట్‌, వైద్య, ఆరోగ్యశాఖ విశ్రాంత కార్యదర్శులను అమికస్‌ క్యూరీలుగా నియమిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.

Updated Date - 2020-05-28T08:38:21+05:30 IST