మాపై అంత కక్ష ఎందుకో?

ABN , First Publish Date - 2022-08-11T06:11:18+05:30 IST

సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రొటోకాల్‌ పాటించకపోవడమే కాకుండా ఎమ్మెల్యే, వైసీపీ నాయకులు, అధికారులు కూడబలుక్కుని చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు అని హుస్సేన్‌పురం సర్పంచ్‌ దద్దాల మంజుభార్గవి బుధవారం ఓ ప్రకటనలో విమర్శించారు.

మాపై అంత కక్ష ఎందుకో?

వెలిగండ్ల, ఆగస్టు 10 : సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రొటోకాల్‌ పాటించకపోవడమే కాకుండా ఎమ్మెల్యే, వైసీపీ నాయకులు, అధికారులు కూడబలుక్కుని చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు అని హుస్సేన్‌పురం సర్పంచ్‌ దద్దాల మంజుభార్గవి బుధవారం ఓ ప్రకటనలో విమర్శించారు. గడపగడపకూ  కార్యక్రమానికి ఎంపీపీ భర్త రామన తిరుపతిరెడ్డి సమాచారం ఇచ్చిన మాట వాస్తవమేనన్నారు. కానీ మా గ్రామంలో సమస్య పరిష్కారం చేస్తే తప్ప రావద్దని చెప్పినా వినకుండా ఎమ్యెల్యేని ఊళ్లోకి తీసుకొచ్చారని విమర్శించారు. ఈ విషయం తెలుసుకున్న తన భర్త హెచ్‌ఎంపాడు జడ్పీటీసీ సభ్యుడు నారాయణ పశువుల బీడు సమస్య గురించి ఎమ్యెల్యేను అడిగే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారన్నారు. ఈక్రమంలో మహిళలకు, పోలీసులకు మధ్య వాగ్విదం జరిగిందన్నారు. ఎమ్యెల్యే ఆ తర్వాత హుస్సేన్‌పురం గ్రామసచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారని, కార్యక్రమంలో ప్రొటోకాల్‌ పాటించలేదని తెలిపారు. గ్రామ ప్రథమ పౌరురాలైనా సర్పంచ్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా వివక్ష చూపారన్నారు. అంతేగాక ప్రత్యేక ఆహ్వానం ఉందని ఎమ్యెల్యే వర్గం చెబుతున్నారని, ఆహ్వానించినట్లు రుజువు చేయగలరా అని సవాల్‌ విసిరారు. ఎమ్యెల్యే కాక ముందు నుంచి ఆయన వెన్నంటి ఉన్న పాపానికి తగిన గుణపాఠం చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా భూవివాదంలో తన భర్తపై కేసులు పెట్టించారని, అదే తరహాలో ఇప్పుడు కూడా వెలిగండ్లలో కేసు పెట్టించారని తెలిపారు. ఈ విషయాలను సీఎం జగన్‌ దృష్టికి తీసుకు వెళ్తామని ఆమె ఆ ప్రకటనలో తెలిపారు.


Updated Date - 2022-08-11T06:11:18+05:30 IST