పౌరులను ఎందుకు వేధిస్తున్నారు?

ABN , First Publish Date - 2022-07-31T08:37:28+05:30 IST

హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ధరణిలో భూమి స్వభావం మార్పుల కోసం చేసుకున్న దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తే అందుకు కారణాలు

పౌరులను ఎందుకు వేధిస్తున్నారు?

ధరణిలో దరఖాస్తు తిరస్కరిస్తే కారణాలు చెప్పరా? 

సిద్దిపేట కలెక్టర్‌ వ్యక్తిగత హాజరుకు హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ధరణిలో భూమి స్వభావం మార్పుల కోసం చేసుకున్న దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తే అందుకు కారణాలు వివరించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ రకమైన వైఖరితో రెవెన్యూ అధికారులు పౌరులను వేధింపులకు గురిచేస్తున్నారని వ్యాఖ్యానించింది.  సిద్దిపేట కలెక్టర్‌, గజ్వేల్‌ మండల తహసీల్దార్‌ తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరై దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. 


సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ మండలం ముత్రాజ్‌పల్లికి చెందిన డి. ఇంద్రసేనరెడ్డికి సర్వే నంబర్‌ 210లో 3.07 ఎకరాల భూమి ఉంది. 2019లో కొండపోచమ్మ సాగర్‌ డిస్ర్టిబ్యూటరీ కెనాల్‌ కోసం రెవెన్యూ అధికారులు భూసేకరణ నోటిఫికేషన్‌ జారీచేశారు. అందుకోసం 2.5 గుంటల భూమి సేకరిస్తామని అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో భూసేకరణ నోటిఫికేషన్‌కు కాలంచెల్లిపోయింది. ఈ నోటిఫికేషన్‌ కారణంగా మొత్తం 3.07 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ భూమికి సంబంధించి ఎటువంటి లావాదేవీలు చేయకుండా ధరణి వెబ్‌సైట్‌లో ఆటోలాక్‌ పడింది. నిషేధిత జాబితా నుంచి తన భూమిని తొలిగించాలని కోరుతూ మీసేవలో దరఖాస్తు చేసి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగారు. ఎటువంటి కారణాలు వివరించకుండా సదరు దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దీంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎం సుధీర్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. రెవెన్యూ శాఖ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ మరోసారి మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వాదనలు నమోదు చేసుకున్న ఽధర్మాసనం అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు సిద్ధిపేట కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, గజ్వేల్‌ తహసీల్దార్‌ తమ ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణ ఆగస్టు 22కు వాయిదా పడింది. 


Updated Date - 2022-07-31T08:37:28+05:30 IST