- కారణాలపై ఉత్పత్తిదారులది తలో మాట
- లిథియం-అయాన్ బ్యాటరీలపైనే అనుమానాలు
- ఎర్త్ లేకుంటే.. షార్ట్ సర్క్యూట్‌కు దోహదం!
- భారత్‌లో ప్రారంభం కాని బీఐఎస్ లైసెన్సింగ్
- కనీసం రిజిస్ట్రేషన్‌కూ కేంద్రం చర్యలు నిల్
- వారం రోజుల్లో ఆరు ఘటనలు
- ఈవీ వాహనాల కొనుగోళ్లపై నీలి నీడలు
- మోదీ సర్కారు 2030 లక్ష్యంపై తీవ్ర ప్రభావం!
- జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు
- వారం రోజుల్లో ఆరు ఘటనలు
- కారణాలపై ఉత్పత్తిదారులది తలో మాట
- జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు
(సెంట్రల్ డెస్క్)
‘‘వారం క్రితం తమిళనాడులోని వెల్లూరులో ఈ-స్కూటర్ చార్జింగ్ పెట్టి పడుకున్న కుటుంబం.. పేలిన బ్యాటరీ.. తండ్రీకూతుళ్ల దుర్మరణం’’.. ‘‘ఉత్తర చెన్నైలో మూడు రోజుల క్రితం పార్క్ చేసిన ఈ-స్కూటర్లో మంటలు’’.. ‘‘తమిళనాడు తిరుచ్చిలో పేలిన ఈ-స్కూటర్ బ్యాటరీ’’.. ‘‘మహారాష్ట్రలోని పుణెలో పార్క్ చేసిన ఈ-స్కూటర్‌కు మంటలు’’.. ఇలా గడిచిన వారం రోజుల్లో ఆరు చోట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లు అగ్నిప్రమాదాలకు దారితీసిన కేసులు నమోదయ్యాయి. గత ఏడాది కూడా ఇలాంటి ఉదంతాలు వెలుగుచూసినా.. ఇటీవలి ఘటనలు పార్లమెంట్లో కూడా ప్రకంపనలు సృష్టించాయి. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. అసలు ఈ-స్కూటర్లు ఎందుకు పేలుతున్నాయి? మానవ తప్పిదమా? లేక ఉత్పత్తిలో లోపమా? కారణాలేమిటి??
లిథియం అయాన్ బ్యాటరీలే కారణమా?
ఇటీవల చోటుచేసుకున్న ఈ-స్కూటర్ల పేలుడు ప్రమాదాలకు ప్రధాన కారణం వాటిల్లో వాడే లిథియం-అయాన్ బ్యాటరీలేనని పలువురు ఉత్పత్తిదారులు పేర్కొన్నారు. సంప్రదాయ లెడ్-యాసిడ్ బ్యాటరీలతో పోలిస్తే.. లిథియం-అయాన్ బ్యాటరీల నాణ్యత, మన్నిక చాలా ఎక్కువ. ఒక కిలో బరువుండే లిథియం-అయాన్ బ్యాటరీలో 150 వాట్-అవర్స్ మేర స్టోరేజీ ఉంటుంది. అదే సంప్రదాయ బ్యాటరీల నిల్వ సామర్థ్యం కేవలం 25 వాట్-అవర్స్. సంప్రదాయ బ్యాటరీలతో పోలిస్తే.. లిథియం-అయాన్ బ్యాటరీలు తేలిగ్గా ఉంటాయి. ఫుల్చార్జింగ్కు తక్కువ సమయం తీసుకుంటాయి. ఈ కారణంతో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టా్‌పలలో లిథియం-అయాన్‌ను వాడుతున్నారు.
అయితే.. ఈ బ్యాటరీల్లో మెకానిజం కొంత క్లిష్టంగా ఉంటుంది. విద్యుత్తు సాంద్రత(డెన్సిటీ) చాలా ఎక్కువ. వీటిల్లో బ్యాటరీ నిర్వహణ వ్యవస్థ(బీఎంఎస్) ద్వారానే బ్యాటరీ ఫుల్‌చార్జ్ అయ్యిందా? ఇంకా ఎంత బ్యాటరీ చార్జ్ ఉంది? అనే అంశాలు స్మార్ట్ఫోన్లలో, ఈ-స్కూటర్ల తెరపై కనిపిస్తాయి. ఒకవేళ బీఎంఎస్ సరిగ్గా పనిచేయకపోతే.. బ్యాటరీ 90-100 డిగ్రీల స్థాయిలో వేడెక్కినా.. హెచ్చరికలు ఉండవని, బ్యాటరీలు పేలే ప్రమాదాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.
షార్ట్ సర్క్యూట్ కూడా కారణమే?
షార్ట్ సర్క్యూట్, వోల్టేజీలో భారీ హెచ్చుతగ్గుల కారణంగా లిథియం-అయాన్ బ్యాటరీలు పేలే ప్రమాదముందని విద్యుత్తు రంగ నిపుణులు చెబుతున్నారు. ఎర్త్ లేకుండా బ్యాటరీలను చార్జ్ చేస్తే.. వైరింగ్‌లో లోపాల వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదాలు ఉన్నాయంటున్నారు. చాలా మంది రాత్రిళ్లు ఈ-స్కూటర్లను చార్జింగ్ పెట్టి, నిద్రపోతుంటారని.. ఓవర్ చార్జింగ్, వోల్టేజీలో హెచ్చుతగ్గుల వల్ల ప్రమాదాలు జరుగుతాయని రోడ్‌సేఫ్టీ క్లబ్ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ ఆదిలాబాద్ జిల్లా డిప్యూటీ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.
ఉత్పత్తిదారులు ఏమంటున్నారు?
ఇటీవల ఈ-స్కూటర్లు పేలడంపై ఉత్పత్తిదారులు తమ పరిశోధన కొనసాగుతోందని వివరించారు. ఓలా, ఎథర్, ఒకినవా ఉత్పత్తిదారులు కారణాలను ఇంకా విశ్లేషిస్తున్నామని చెప్పారు. ఉత్పత్తిదారులు బ్యాటరీలకు టెస్టింగ్ నిర్వహించకపోవడం కూడా ప్రమాదాలకు కారణమని పేర్కొన్నారు.
భారత్‌లో అసలు లైసెన్సింగే లేదు
భారత్‌లో ఉత్పత్తి అయ్యే పరికరాలు, ఉపకరణాలకు భారత నాణ్యత-ప్రమాణాల బ్యూరో(బీఐఎస్) లైసెన్సు(ఐఎ్‌సఐ మార్క్) ఇస్తుంది. లిథియం-అయాన్ బ్యాటరీల విషయంలో ఇప్పటికీ లైసెన్సింగ్ గానీ, రిజిస్ట్రేషన్ గానీ లేదని బీఐఎస్ తెలంగాణ రీజియన్ చీఫ్ కేవీ రావు ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. బీఐఎస్ అధికారులు తాము లైసెన్స్ ఇచ్చిన కంపెనీల్లో తరచూ తనిఖీలు నిర్వహించి, ఆయా ఉత్పత్తులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదాహరణకు ఓ సీలింగ్ ఫ్యాన్ విషయాన్ని తీసుకుంటే.. పూర్తిస్తాయిలో బిగించిన సీలింగ్ ఫ్యాన్‌ను ఆరడుగుల ఎత్తు నుంచి కింద పారేసి.. పగుళ్లు వచ్చాయా? కింద పడ్డా పనితీరు ఎలా ఉంది? అనే అంశాలను పరిశీలిస్తారు. లిథియం-అయాన్ బ్యాటరీలనూ బీఐఎస్ పరిధిలోకి తెస్తే.. వాటి ప్రమాణాలను నిరంతరం పరిశీలించే అవకాశాలుంటాయి.
టెస్టింగ్ లేకపోవడంతో..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రోజువారీగా పెట్రో ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ-స్కూటర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ఉత్పత్తిదారులు బ్యాటరీలకు టెస్టింగ్ నిర్వహించకుండానే మార్కెట్‌కు పంపుతున్నారనే ఆరోపణలున్నాయి. బీఐఎస్ లైసెన్సింగ్ ఉండి ఉంటే.. ఈ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతుందని, కనీసం రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి కాకపోవడంతో లిథియం-అయాన్ బ్యాటరీల ఉత్పత్తిదారులు ఏరోజుకారోజే ఉత్పత్తులను మార్కెట్‌కు పంపుతున్నారని తెలుస్తోంది. ఈ-స్కూటర్ల ఉత్పత్తిదారులు కూడా డిమాండ్ నేపథ్యంలో.. ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
కేంద్రం లక్ష్యాలపై తీవ్ర ప్రభావం
పర్యావరణ కోణంలో ఈ-స్కూటర్లను కేంద్రంలోని మోదీ సర్కారు ప్రోత్సహిస్తోంది. దేశీయంగా బ్యాటరీలు, ఈ-స్కూటర్లను ఉత్పత్తి చేసే కంపెనీలకు ప్రోత్సాహకాలిస్తోంది. 2030 కల్లా దేశంలోని ద్విచక్రవాహనాల్లో ఈ-స్కూటర్లు, ఈ-బైక్‌ల వాటా 80శాతానికి పెరిగేలా చర్యలు తీసుకుంటోంది. వచ్చే ఏడాదికల్లా 10 లక్షలకు పైగా ఈ-స్కూటర్ల విక్రయాలు ఉంటాయని, సేల్స్ విలువ రూ. 37,976.8 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న ప్రమాదాలతో.. కేంద్రం అంచనాలపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశాలున్నాయి.