Abn logo
Jun 11 2021 @ 15:19PM

70 ఏళ్ల క్రితం భారత్‌లో అదృశ్యమైన 400 మంది జవాన్ల అవశేషాల కోసం అమెరికా ఇప్పుడెందుకు వెతుకుతోంది..?

యుద్ధం అంటే అదొక భయంకర దృశ్యం. దేశం కోసం ప్రాణాలొడ్డేందుకు సిద్దపడ్డ జవాన్లలో యుద్ధం ముగిశాక ఎంతమంది ప్రాణాలతో ఉంటారో? ఎంతమంది ఆనవాళ్లు కూడా లేకుండా చరిత్ర గర్భంలో కలిసిపోతారో? చెప్పలేం. అయితే అలా కనిపించకుండా పోయిన తమ సైనికులను గుర్తుపట్టే ఆధారాలు సేకరించాలని అగ్రరాజ్యం అమెరికా తలపోసింది. అమెరికా పాల్గొన్న రెండో ప్రపంచ యుద్ధం, కొరియా యుద్ధం, కోల్డ్ వార్, వియత్నాం యుద్ధం, ఇరాక్ ఉద్రిక్తతలు.. వీటన్నింటిలో కనిపించకుండా పోయిన సైనికుల అవశేషాలను సేకరించే పనిలో పడింది. దీనికోసం అమెరికా రక్షణ శాఖలో డీపీఏఏ అనే విభాగాన్ని ఏర్పాటు చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రిజనర్స్ ఆఫ్ వార్/ మిస్సింగ్ ఇన్ యాక్షన్ అకౌంటింగ్ ఏజెన్సీ (డీపీఏఏ) పని యుద్ధాల్లో కనిపించకుండా పోయిన అమెరికా సైనికుల ఆనవాళ్లు సేకరించడం.


ఈ క్రమంలోనే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో భారత్‌లో కనిపించకుండా పోయిన సుమారు 400 మంది సైనికులు, వాయుసేన సిబ్బందికి సంబంధించిన ఆనవాళ్లను సేకకరించడం కోసం డీపీఏఏ సమాయత్తమైంది. దీనికోసం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్ఎఫ్ఎస్‌యూ)తో ఒప్పందం కుదుర్చుకుంది. మే 27న జరిగిన ఒక వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్ఎఫ్ఎస్‌యూ, యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా లింకన్ (యూఎన్ఎల్)తో డీపీఏఏ ఒక ఎంవోయూ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం, డీపీఏఏకు చెందిన ఒక బృందం భారత్ వచ్చి, రెండో ప్రపంచ యుద్ధంలో ఇక్కడ మిస్సయిన 400 మంది అమెరికా సైనికుల ఆనవాళ్లను ట్రేస్ చేసి, కుదిరితే సేకరించి స్వదేశానికి తీసుకెళ్తుంది.

2015లో కొన్ని ఏజెన్సీలను కలిపి డీపీఏఏను అమెరికా రక్షణ విభాగం ఏర్పాటు చేసింది. దీంతోపాటు అమెరికా రక్షణ విభాగానికి చెందిన ఇతర ఏజెన్సీలతో భారత్‌లో ఎనిమిదిసార్లు తమ సైనికుల అవక్షేపాలు వెతుక్కునే చర్యలు చేపడతారట. ఇలా భారత్‌లో మిస్సయిన సైనికుల కోసం ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, త్రిపురల్లో 2008 నుంచే అమెరికా గాలింపు చర్యలు చేపడుతోంది. 2016లో డీపీఏఏ, ఆంత్రోపాలజీ సర్వే ఆఫ్ ఇండియా బృందాలు అమెరికా సైనికులకు చెందిన కొన్ని అవశేషాలను గుర్తించారు. ఇక్కడ మొత్తం ఆరుగురు సైనికుల అవశేషాలు లభించాయని, భారత్‌లోనే చనిపోయినట్లు భావిస్తున్న 306 మందికి సంబంధించిన ఆధారాలేవీ దొరకలేదనీ డీపీఏఏ  చెప్పింది. ఇవి అధికారిక గణాంకాలైన ఈ సంఖ్య 400పైగా ఉండే అవకాశం ఉందని ఏజెన్సీ పేర్కొంది.

ఇలా పూర్వపు యుద్ధాల్లో కనిపించకుండా పోయిన సైనికుల అవశేషాలను గుర్తించడం కోసం డీపీఏఏ.. ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఆ దేశాల్లోని వాతావరణం, భూ పరిస్థితులను బట్టి ఎంతకాలం గాలింపు చర్యలు చేపట్టాలో ఒక అంచనాకు. ఆ తర్వాత ఒక రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ (ఆర్ఐటీ) బృందాన్ని పంపుతుంది. ఈ బృందం ఆయా దేశాల డేటాను పరిశీలించి తమ సైనికులు చివరగా ఎక్కడ కనిపించిందీ తెలుసుకుంటుంది. స్థానికుల కథనాలను కూడా సేకరిస్తుంది. ఈ ఆర్ఐటీ బృందం సేకరించిన డేటా ఆధారంగా ఒక ఆంత్రోపాలజీ, ఫోరెన్సిక్ సైన్స్ నిపుణుల బృందం ఆన్-సైట్ ఆపరేషన్స్ చేస్తుంది. ఇలా యుద్ధవిమానాల శకలాలు, స్థానిక స్మశానాల రికార్డుల వంటివి పరిశీలిస్తుంది. వాళ్లకు దొరికిన ఆధారం వాస్తవమే అనిపిస్తే తవ్వకాలు చేపడతారు. వీటిలో ఏవైనా మానవ అవశేషాలు లభిస్తే, వాటిని వెంటనే అమెరికాలోని ల్యాబొరేటరీలకు పంపేస్తారు.

ఎన్ఎఫ్ఎస్‌యూతో డీపీఏఏ చేసుకున్న తాజా ఒప్పందం ప్రకారం, డీపీఏఏ బృందంతోపాటు వర్సిటీ విద్యార్థులు, ఫారెన్సిక్ నిపుణులతో కూడిన ఒక బృందం ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తుంది. వీరితోపాటు ఆంత్రోపాలజీ సర్వే ఆఫ్ ఇండియా, స్థానిక బృందాలు కూడా ఈ చర్యల్లో పాల్గొంటాయి. 70 ఏళ్ల క్రితం నాటి కేసులో పనిచేయడం ఎన్ఎఫ్ఎస్‌యూకు ఇదే తొలిసారి. ఇంత పాత మృతదేహాలు, అస్థిపంజరాలను గుర్తించడానికి ఓడోంటాలజీ అనే విధానాన్ని ఉపయోగిస్తారు. దీనిలో ఫోరెన్సిక్ దంత పరిశీలన, ఫోరెన్సిక్ ఆంత్రోపాలజీలు కీలక పాత్ర పోషిస్తాయి. తమ వద్ద ఉన్న శాస్త్రీయ, లాజిస్టిక్ సామర్థ్యాలతో డీపీఏఏకు సహకరించడమే తమ బాధ్యత అని యూనివర్సిటీ వర్గాలు చెప్తున్నాయి.


ప్రత్యేకంమరిన్ని...

Advertisement