Advertisement
Advertisement
Abn logo
Advertisement

డాక్టర్లు లేని ఆస్పత్రి ఎందుకు? తాళాలు వేయండి!

మాడుగులలో మహిళల ఆందోళన

పాలకులుగా ఏం చేస్తున్నారని ఎంపీపీని ముట్టడించిన వైనం


మాడుగుల, డిసెంబరు 1: వైద్యులను వేరే ఆస్పత్రికి పంపిస్తే ఇక్కడ రోగుల పరిస్థితి ఏంటీ..? వైద్యులు లేని ఆస్పత్రి ఎందుకు..? తాళాలు వేసేయండి! అంటూ మహిళలు మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం మాడుగుల ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.  అనంతరం ఎంపీపీ వి.రామధర్మజను ముట్టడించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, ముగ్గురు వైద్యులలో ఒకరికి పాడేరు డిపుటేషన్‌పై పంపించారని, మరో వైద్యురాలు గర్భిని కావడంతో సెలవులో ఉన్నారని, ఈ పరిస్థితుల్లో  మండల ప్రజలకు వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి పెద్ద దిక్కుగా ఉన్న ఆస్పత్రిలో వైద్యులను డిప్యుటేషన్‌పై పంపించడం ఏంటని? ప్రజా ప్రతినిధులుగా మీరంతా ఏం చేస్తున్నారని? ఎంపీపీని ప్రశ్నించారు. వైద్యులను వెనక్కి రప్పించడంతో పాటు ఖాళీలను భర్తీ చేయించాలని, లేదంటే ఆస్పత్రికి తాళం వేయించాలని పట్టుబట్టారు. దీనికి ఎంపీపీ స్పందిస్తూ జిల్లా వైద్యాధికారులు, ఎమ్మెల్యేతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని చెప్పడంతో వారు శాంతించారు.


Advertisement
Advertisement