ఈ పాపం ఎవరిది?

ABN , First Publish Date - 2022-08-13T06:58:07+05:30 IST

ఈ పాపం ఎవరిది?

ఈ పాపం ఎవరిది?
మ్యానహోల్‌ నుంచి వాననీరు పోయేలా చేస్తున్న ఖమ్మం డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది(ఫైల్‌)

కార్పొరేషన్‌ అధికారుల అత్యుత్సాహం

సరైన శిక్షణ లేని సిబ్బందిని ‘విపత్తు’కు వినియోగిస్తున్న వైనం

ప్రాణాలు కోల్పోతున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది

ఖమ్మం కార్పొరేషన, ఆగస్టు 12: అధికారుల అత్యుత్సా హం నగరపాలకసంస్థ కార్యాలయంలో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ప్రాణాలను తీస్తోంది. ముఖ్యంగా కార్యాలయంలో కాకుండా, క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులను వారి అనుభవం మేరకు పనులకు పంపాల్సి ఉన్నా.. ఇష్టారీతిన పంపుతుండటంతో ప్రాణాలు పోతున్నాయి. వాటర్‌ట్యాంకు శుభ్రం చేయడంలో అనుభవం లేకున్నా.. ఓ పం పు ఆపరేటర్‌ను ఆ పనికి పంపగా.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో  అతడు ప్రాణాలు పోగుట్టుకున్నాడు. తాజాగా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లివద్ద చెక్‌డ్యాంలో పడిన వ్యక్తిని గాలించేందుకు నలుగురు డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని పంపగా, వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గజ ఈతగాళ్లు అని పేరుపెట్టి.. అంతగా శిక్షణ లేని వారిని అక్కడికి పంపడంపై అందరిలోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. వాస్తవంగా డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని నగరపాలకసంస్థ ద్వారా నియమించినా, వారికి ఎలాంటి శిక్షణా లేదు. నియామకం జరిగిన తరువాత హైదరాబాద్‌లో 15రోజల పాటు మాత్రమే శిక్షణనిచ్చారు. అది కూడా క్షేత్రస్థాయిలో కాకుండా కేవలం తరగతులకే పరిమితం చేశారు. కానీ శిక్షణ పూర్తయినట్లు పంపి.. రెస్క్యూటీమ్‌, ఎనడీఆర్‌ఎ్‌ఫ బృందాలు చేయాల్సిన పనులను డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి అప్పగించటంతో రెండు ప్రాణాలు బలయ్యాయి.


డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఏం చేస్తారంటే...

వర్షానికి నగరంలోని ప్రధానవీధులు జలమయమైనప్పుడు, కాలువల్లో చెత్తను తొలగించి, నీళ్లు ప్రవహించేలా చూడటం, ఎక్కడైనా చెట్టు విరిగిపడితే వాటిని తొలగించడం, ఫుట్‌పాతలపై ఆక్రమణలు తొలగించడం, అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిండం లాంటి పనులను డీఆర్‌ఎ్‌ఫకు అప్పగించారు. కానీ గతంలో ఓ సారి సాగర్‌కాలువలో కొట్టుకువచ్చిన మృతదేహాన్ని బయటకు తీశారు. అంతేకాని వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించటం, గల్లంతైన వారిని వెదకటం తదితర పనుల్లో డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి అనుభవం లేదు. ప్రమాదకరంగా సుడులు తిరుగుతున్న వాగు వద్దకు పంపి, ఇద్దరి ప్రాణాలు తీసి, వారి కుటుంబాల్లో తీరని విషాదం నింపారు అధికారులు. 


అధికారుల ఒత్తిడితో సతమతం...

క్షేత్రస్థాయిలో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అధికారుల ఒత్తిడితో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా వారిపై అజమాయిషీ చేసే అధికారి చెప్పింది చేయకపోతే ఉద్యోగులను తొలగిస్తామంటూ చేసే బెదిరింపులతో భయాందోళనకు గురవుతున్నారు. సదరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి అసలు ఆ విధులు నిర్వహించగలడా? తగిన జాగ్రత్తలు తీసుకోగలడా? అన్న అంశాలను కూడా పరిశీలించకుండా పనులకు పంపించటంతో ప్రమాదాల బారిన పడి కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగులుతోంది. వాటర్‌ట్యాంక్‌లు శుభ్రం చేసుప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇటీవల అనుభవం లేని ఓ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని ఆ పనికి పంపటంతో అతడు పైప్‌లైనలో ఇరుక్కొని మృతిచెందాడు. అలాగే డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది విషయంలో కూడా జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి వద్ద చెక్‌డ్యాం కమ్‌ బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహ స్థాయిని తెలుసుకోకుండా డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని ఒత్తిడి చేసి పంపటంతో రెండు నిండుప్రాణాలు బలయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గల్లంతయిన యువకుడిని గాలించేందుకు డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వద్ద ఉన్న రక్షణ పరికరాలు సరిపోకపోయినా వారిని గాలింపు చర్యలకు పంపడం, అజమాయిషీ చేసే అధికారి చేస్తున్నఒత్తికి నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సదరు అధికారి తీరుమార్చుకుని పని తీవ్రత, సిబ్బంది సామర్థ్యాలను బేరీజు వేసుకున్నాకే పనిలోకి పంపాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. 

Updated Date - 2022-08-13T06:58:07+05:30 IST