ఈ పాపం ఎవరిది..?

ABN , First Publish Date - 2022-06-28T05:21:03+05:30 IST

బైపాస్‌ రోడ్డు నిర్మాణంలో మీ ఇళ్లు పోతాయని, పనులు ఎక్కడిక్కడ నిలిపివేయాలని జాతీయ రహదారుల అధికారులు చావు కబురు చల్లగా చెప్పడంతో హతాశతులయ్యారు.

ఈ పాపం ఎవరిది..?
నిర్మాణం పూర్తయిన తన ఇంటిని చూపుతున్న సయ్యద్‌ చాన్‌హీరా

బైపాస్‌ రోడ్డు నిర్మాణంలో కనుమరుగు కానున్న 54 ఇళ్లు 

రోడ్డు వస్తుందని అధికారులకు ముందే తెలుసా? 

రూ.1.70 కోట్లు నష్టపోయిన లబ్ధిదారులు

దిక్కుతోచని స్థితిలో బాధితులు


పీలేరు, జూన్‌ 27: వారంతా బడుగు జీవులు. రెక్కాడితేగానీ డొక్కాడని దిగువ మధ్య తరగతి వారు. సొంతిళ్లు లేకపోవడంతో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. నిర్మాణానికి అనువుగాని కొండలు, గుట్టలు చూపినా నోరెత్తకుండా తమకు ఓ గూడు ఏర్పడితే చాలని బండలు, కొండలు, గుట్టలు చదును చేసి ఇంటి నిర్మాణ పనులు మొదలెట్టారు. ఈలోపు సిమెంటు, ఇసుక, ఇటుక, కట్రాయి ధరలు కొండెక్కి కూర్చుంటే చేసేదేమీ లేక దిగులు పడి పనులు నిలిపేశారు. ఇళ్లు కట్టుకుంటారా లేక రద్దు చేయమంటారా అంటూ వలంటీర్లు, అధికారుల బెదిరింపులతో హడలిపోయి అప్పోసప్పో చేసి పనులు మళ్లీ మొదలెట్టారు. దాచుకున్న డబ్బు సరిపోకపోవడంతో ఎక్కడ ఇళ్లను రద్దు చేస్తారోనని భయపడి నగా నట్రా కుదువ పెట్టి, అధిక వడ్డీలకు అప్పులు చేసి మరీ ఇంటి పనులు కొనసాగిస్తున్నారు. ఈలోపు పిడుగు లాంటి వార్త వారి ఇళ్ల మీద పడింది. బైపాస్‌ రోడ్డు నిర్మాణంలో మీ ఇళ్లు పోతాయని, పనులు ఎక్కడిక్కడ నిలిపివేయాలని జాతీయ రహదారుల అధికారులు చావు కబురు చల్లగా చెప్పడంతో హతాశతులయ్యారు. ఏం చేయాలో, ఎవరిని ఆశ్రయించాలో తెలియక స్థానిక నాయకుల దగ్గర నుంచి కలెక్టర్‌ వరకు తమ సమస్యను చెప్పుకున్నారు. న్యాయం చేస్తామని వారు మొదట్లో చెప్పినా అనంతరం సత్యం వెలుగుచూసింది. మదనపల్లె-తిరుపతి నాలుగు లేన్ల రహదారి నిర్మాణంలో భాగంగా పీలేరుకు బైపాస్‌ రోడ్డు మంజూరైందని, 2018లోనే దానికి మార్కింగ్‌ ఇచ్చేశారని, అప్పట్లోనే ఆయా భూముల యజమానులు, స్థానిక రెవెన్యూ అధికారుల వద్ద నుంచి అభ్యంతరాలు, భూయాజమాన్య పత్రాలు తీసుకున్నారని తెలిసి నిశ్చేష్టులయ్యారు. స్థానిక అధికారులు, అధికార పార్టీ నేతలకు అక్కడ రోడ్డు వస్తుందన్న విషయం తెలిసీ తమకు అక్కడ ఇళ్లు కేటాయించారని, వారు మార్కింగ్‌ ఇచ్చిన మేరకు తాము కట్టుకుంటున్నామని, ఇప్పుడు వాటిని కూల్చేస్తామంటున్నారని, వారు చేసిన తప్పిదానికి మేము భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఇదీ పీలేరు కంకర ఫ్యాక్టరీ లే-ఔట్‌లోని జగనన్న కాలనీలో బైపాస్‌ రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారి పరిస్థితి. 


లోయను తలపించిన కంకర ఫ్యాక్టరీ లేఔట్‌ 

పీలేరు పట్టణంలోని పేదల కోసం జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి కంకర ఫ్యాక్టరీ లేఔట్‌ను ఎంపిక చేసినప్పుడు పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. అక్కడ పెద్ద బండ రాళ్లు, గుండ్లు, గుట్టలు ఉండేవి. మొదటిసారి అక్కడికి వెళ్లినప్పుడు చాలా మంది లబ్ధిదారులు భయపడి మళ్లీ అటువైపు చూడలేదు. వలంటీర్లు, అధికారుల ఒత్తిడి కారణంగా అయిష్టంగానే పనులు మొదలెట్టిన వారు అధికం. పునాదుల కోసం ఆయా స్థలాలను చదును చేయడానికి దాదాపు రూ.50 వేలు వెచ్చించారు. గుట్టలు, ఎగుడుదిగుడు ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో నిర్మాణ సామాగ్రి తరలించేందుకు అనేక కష్టాలు పడ్డారు. ఇసుక ట్రాక్టర్లు, నీటి ట్యాంకర్ల యజమానులను బతిమాలి రెట్టింపు ధర చెల్లించి మరీ తరలించుకున్న సందర్భాలు అనేకం. జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం కంకర ఫ్యాక్టరీ లేఔట్‌లోని లబ్ధిదారులకు ఏమూలకూ సరిపోలేదు. ఉదాహరణకు కంకర ఫ్యాక్టరీ లేఔట్‌లో ఇంటి నిర్మాణ పునాదుల కోసం ప్రభుత్వం రూ.70 వేల ఆర్థిక సాయం అందించగా ఒక్కో లబ్ధిదారులు వారికి వచ్చిన స్థలాన్ని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు ఖర్చు చేశారు.


కనుమరుగు కానున్న 54 ఇళ్లు 

బైపాస్‌ రోడ్డు నిర్మాణంలో కంకర ఫ్యాక్టరీ లేఔట్‌లో అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం 54 ఇళ్లు కనుమరుగు కానున్నాయి. వాటికి ఆనుకుని మరో 10 ఇళ్లకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఆ 54 ఇళ్లలో పునాదుల వరకు 48, గోడల వరకు 3, ప్రారంభోత్సవానికి సిద్ధంగా 3 ఇళ్లు ఉన్నాయి. వాటి నిర్మాణం కోసం ఆయా లబ్ధిదారులు దాదాపు రూ.1.70 కోట్లు ఖర్చు పెట్టారు. వీరిలో అధిక శాతం మందికి ప్రభుత్వం బిల్లులు కూడా మంజూరు చేసింది. ఒక బిల్లు నుంచి మూడు బిల్లుల వరకు చెల్లింపులు జరిగాయి. 


అరణ్యరోదనగా లబ్ధిదారుల పరిస్థితి 

రోడ్డు నిర్మాణంలో ఇళ్లు పోగొట్టుకోబోతున్న వారి పరిస్థితి అరణ్యరోదనగా మారింది. తమను ఈ కష్టం నుంచి గట్టెక్కించమని వారు స్థానిక అధికారులు, అధికార పార్టీ నాయకుల దగ్గర నుంచి జిల్లా ఉన్నతాధికారుల వరకు వేడుకున్నారు. ఆ క్రమంలో కలెక్టర్‌ గిరీషా, జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ఆర్‌డీవో రంగనాథ్‌ వారి ఇళ్లను సందర్శించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఏ విధంగా న్యాయం చేస్తారో, పరిహారం ఏ మేరకు చెల్లిస్తారో స్పష్టంగా చెప్పలేదు. మరోచోట ఇళ్లు ఇస్తామని కొంత మంది నాయకులు చెబుతున్నారని, అదే జరిగితే తమ నష్టాన్ని ఎవరు చెల్లిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. వారికి ఏ నిబంధనల మేరకు పరిహారం చెల్లిస్తారో తెలియక వారు ఆశ్రయిస్తున్న కింది స్థాయి అధికారులు, నాయకులు తలలు పట్టుకుంటున్నారు. 


మోల్డింగ్‌కు సమాయత్తమవుతున్న కుమారి 

పీలేరు ఎర్రమరెడ్డిగుట్టకు చెందిన కుమారికి కంకర ఫ్యాక్టరీ లేఔట్‌లో ఫ్లాట్‌ నెం.340 వచ్చింది. ఆ ఫ్లాట్‌లో ఆమె దాదాపు రూ.8 లక్షలు ఖర్చు పెట్టి గోడల వరకు నిర్మాణం పూర్తి చేసింది. మోల్డింగ్‌ వేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక అధికారులు, స్థానిక నాయకుల చుట్టూ తిరుగుతోంది. 


గృహ ప్రవేశానికి సిద్ధమవుతున్న సయ్యద్‌ చాన్‌హీరా 

పీలేరు రాజీవ్‌నగర్‌ కాలనీకి చెందిన సయ్యద్‌ చాన్‌హీరాకు తనకు వచ్చిన ఫ్లాట్‌ నెం.427లో దాదాపు రూ.12 లక్షలు ఖర్చు చేసి ఇంటిని కట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఇంటిలో వైరింగ్‌ పనులు జరుగుతున్నాయి. అవి పూర్తయితే ఇంటికి రంగులు వేసుకుని గృహప్రవేశం చేసుకోవాలని బంధువులందరికీ చెప్పుకుంది. ఇప్పుడు ఆ ఇల్లు రోడ్డుకు అడ్డంగా ఉందని అధికారులు తేల్చారు. 


పునాదుల కోసం రూ.లక్ష ఖర్చు చేసిన రేణుక 

పీలేరుకు చెందిన రేణుకకు ఫ్లాట్‌ నెం.497 కేటాయించారు అధికారులు. ఆ స్థలం పెద్దపెద్ద బండరాళ్లు, గుండ్లతో నిండి ఉండడంతో దానిని చదును చేయడానికి దాదాపు రూ.లక్ష ఖర్చు అయినట్లు ఆమె తెలిపింది. ఆ ఖర్చుతో పాటు పునాదుల కోసం రూ.2 లక్షలు ఖర్చు పెట్టానని, ప్రస్తుతం అది రోడ్డు జాగాలో వస్తోందని పనులు నిలిపివేసింది. 


ఇటుకలకు కాపలా కాస్తున్న షమీమ్‌ 

ఫ్లాట్‌ నెం.425 పొందిన పి.షమీమ్‌ దానిలో రూ.2.50 లక్షలు ఖర్చు చేసి పునాదులు వేసుకుంది. గోడల కోసం మరో రూ.50 వేలు వెచ్చించి ఇటుకలు కూడా అక్కడకు తోలుకుంది. తీరా రోడ్డుకు అడ్డంగా ఉందని అధికారులు తేల్చడంతో పనులు నిలిపివేసింది. పనులు ప్రారంభించాలో లేక ఆపేయాలో తెలియడం లేదని, గోడల కోసం తెచ్చుకున్న ఇటుకలకు కాపలా ఉండలేక చస్తున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇటుకలు అందుబాటులో ఉండడంతో ఇతర ఇళ్ల వారు ఆమెకు తెలియకుండా ఆమె ఇటుకలు వాడేస్తుండడంతో రోజురోజుకీ అవి కూడా తరిగిపోతున్నాయి. 


పునాదుల బిల్లుల కోసం ఎదురుచూస్తున్న రమాదేవి 

పీలేరుకు చెందిన కె.రమాదేవికి ఫ్లాట్‌ నెం.387 మంజూరైంది. ఎనిమిది నెలల క్రితం పునాదులు పూర్తి చేసి బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతోంది. పునాదుల బిల్లు పడితే గోడల పనులు చేయాలని ఎదురు చూస్తుండగానే ఇల్లు పోతుందనే వార్త తెలిసింది. ఇప్పుడు పనులు చేయాలో లేక పూర్తిగా మానేయాలో తెలియని గందరగోళంలో ఉంది. 


పరిహారం అనుమానమేనా?

బైపాస్‌ రోడ్డులో కనుమరుగు కానున్న ఇళ్లకు పరిహారం లభించడం అనుమానమేనంటున్నారు పీలేరుకు చెందిన ప్రముఖ న్యాయవాది, ఎన్‌హెచ్‌ఏఐ స్టాండింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు బి.చంద్రశేఖరరెడ్డి. ఎన్‌హెచ్‌ అధికారులు 2018లోనే బైపాస్‌ మార్కింగ్‌ ఇచ్చారని, అప్పుడున్న రెవెన్యూ అధికారులందరికీ ఆ విషయం తెలుసునని, 09-10-2018న కేంద్ర రోడ్లు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 3జీ నోటీసు జారీ చేసిందని, కంకర ఫ్యాక్టరీ లేఔట్‌లో జగనన్న కాలనీని 2021లో ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. ఎన్‌హెచ్‌ కోసం కేటాయించిన స్థలంలో కాలనీ ఇవ్వడం పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని, కాలనీ ఇళ్లు మంజూరు చేసిన రెవెన్యూ అధికారులను బాధ్యులను చేసి వారి నుంచి పరిహారం రాబట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తాను త్వరలోనే కోర్టులో దావా వేయనున్నట్లు వెల్లడించారు. రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారికి ఎన్‌హెచ్‌ఏఐ నుంచి పరిహారం రావడం అనుమానమేనని, ముందుగా వారు సేకరించిన స్థలంలో ఇళ్లు ఇవ్వడం అధికారుల తప్పిదేమేనని ఆయన  చెప్పారు.



Updated Date - 2022-06-28T05:21:03+05:30 IST