Abn logo
Feb 25 2021 @ 01:25AM

షర్మిల ఎవరి చాణక్యం?

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి. అయితే పోయిన చోట చీకటి ఉంది కదా అని వెలుగు ఉన్న చోట వెతికితే లభిస్తుందా? వైఎస్ఆర్‌సిపి స్థాపనలో, ఆంధ్రలో ఆ పార్టీ అధికారంలోకి రావడంలో షర్మిల కృషిని ఆ పార్టీ మరిచిపోయినా ప్రజలు మరువలేరు. అయితే జగన్ చెల్లెలికి ప్రాధాన్య మివ్వటంలేదన్నది నిజమైతే ఆంధ్రలోనే మరో పార్టీ పెట్టి పోరాడమే ఆమెకు సముచితం. పోయిందనుకుంటున్న ప్రాధాన్యం లభించడంతో పాటు అదృష్టం బాగుంటే తొలి మహిళా ముఖ్యమంత్రి కూడా కావచ్చు. మరి అవసరంలేని చోట, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని రుజువైన తర్వాత కూడా తెలంగాణలో షర్మిల రాజకీయ అరంగేట్రం చేయాలనుకోవడమేమిటి? ఈ పరిణామంపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఎవరో వెనుక ఉండి ఆడిస్తున్న రాజకీయమని పరిశీలకులు భావిస్తున్నారు. వారెవరు? దానికి కారణాలేమిటి? తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, బీజేపీ రూపంలో టిఆర్ఎస్‌కు పొంచి ఉన్న ముప్పుతో పాటు మతపరమైన అంశాలు కూడా తోడవుతున్నాయనిపిస్తోంది. 


ప్రజలకు దూరమవుతున్న టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదుగుతున్న విషయాన్ని దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక, జిహెచ్ఎంసి ఎన్నికలు నిరూపించాయి. బిజెపి రాష్ట్ర విభాగం అధ్యక్షుడు బండి సంజయ్ ఆ పార్టీని ప్రజలకు చేరువ చేస్తున్నారు. అది సూర్యాపేట జిల్లా గుర్రంబొడులో అధికార టిఆర్ఎస్ నాయకులు చేశారంటున్న గిరిజనుల భూముల ఆక్రమణల విషయం కావచ్చు, దుబ్బాక ఎన్నిక సందర్భం కావచ్చు లేదా జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా స్వర్గీయ పీవీ సమాధి వివాదంపై ఒవైసీకి సవాలు, భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి వరద సహాయంపై లేఖ విషయంలో కేసీఆర్‌కు సవాలు విసరడం కావచ్చు.. సంజయ్ పార్టీని సరైన దిశలో నడిపిస్తూ ప్రత్యామ్నాయం తామేనని రుజువు చేస్తున్నారు. మరి షర్మిల పార్టీకి ఇక్కడ చోటు ఎలా లభిస్తుందనుకుంటున్నారు?


టిఆర్ఎస్ విషయానికి వస్తే ప్రజల్లో ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. ఇలాంటి సంక్షోభాలు గతంలో కూడా ఆ పార్టీ ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ ముందుచూపుతో, మాయమాటలతో ప్రజలను నమ్మించి అధికారం చేజారకుండా చూసుకోగలిగినా, ప్రస్తుతం ఆ పార్టీలోని అంతర్గత సంక్షోభాలే దాని కొంప ముంచేలా కనిపిస్తున్నాయి. మరో ప్రత్యామ్నాయం కోసం చూడడంలో భాగంగానే తెలంగాణలో షర్మిల రాజకీయ అరంగేట్రం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌లోని కీలక నాయకుల ద్వారా ఆ పార్టీ సారథ్యంలోని కూటమిలో టిడిపి చేరే విధంగా కేసీఆర్ రాజకీయ చతురతను ప్రదర్శించి తన అధికారాన్ని నిలబెట్టుకున్నారని వాదనలు వినిపించాయి. అప్పట్లో మరోసారి ఆంధ్రుల పాలన మనకవసరమా? అని తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టిన విషయం తెలిసిందే. సరిగ్గా అలాంటి పాచికనే మరోసారి వాడడంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో చేతులు కలిపి ఇక్కడ షర్మిలను రాజకీయరంగప్రవేశం చేసేలా కేసీఆర్ పన్నాగం పన్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.


మరో కారణం కూడా చెబుతున్నారు. రాష్ట్రంలో బిజెపి బలంగా ఎదుగుతోంది. ప్రజలు బిజెపి వైపు మళ్ళకుండా చీలిక తీసుకురావడం, తెలంగాణలో నివసించే ఆంధ్ర ప్రాంతం వారు ఆ పార్టీ వైపు మళ్ళకుండా చేయడంతో పాటు వారిలో చీలిక తీసుకురావడం కూడా కేసీఆర్ లక్ష్యం అంటున్నారు. ఇందులో భాగంగానే షర్మిల ప్రవేశమని పలువురు విశ్వసిస్తున్నారు. ఎన్నికల ముందు ఆమె వస్తే ఫలితాలెలా ఉంటాయో అంచనా వేయడం కష్టమవుతుంది. గత ఎన్నికల సందర్భంగా అయితే చంద్రబాబుపై తెలంగాణ వ్యతిరేకిగా అప్పటికే ఉన్న ముద్ర ఉపయోగ పడింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్-, టిడిపి కూటమి ఉంటుందనే గ్యారంటీ లేదు. అప్పటికప్పుడు షర్మిలలాంటి వారి పాచిక పారుతుందో లేదో తెలియదు కాబట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతోనే ఈ ఎత్తుగడ వేసినట్లుగా భావిస్తున్నారు. ఒకవేళ షర్మిల పార్టీకి ఒకటి, రెండు సీట్లు వచ్చినా తమ మిత్రపక్షంగా పడి ఉంటుంది తప్ప అధికారంలోకి వచ్చే అవకాశం మాత్రం ఉండబోదని ఆయన భావిస్తుండవచ్చని అనుకుంటున్నారు. ఇలా షర్మిల ద్వారా తన అధికారాన్ని నిలబెట్టుకోవడంతోపాటు బిజెపి అధికారంలోకి రాకుండా నిలువరించవచ్చని కేసీఆర్ అంచనా వేసి ఉంటారు. తెలంగాణలో బిజెపి ఓడిపోతే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆ పార్టీని దెబ్బకొట్టి తన అధికారాన్ని నిలబెట్టుకోవచ్చని జగన్ కూడా ఆలోచించి ఉంటారు.


ఇక హిందుత్వ భావజాల సంస్థలు మరో వాదనను లేవదీస్తున్నాయి. తెలంగాణలో షర్మిల ప్రవేశాన్ని ఈ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ జరుగుతున్న పరిణామాలను హిందువులు సహించలేకపోతున్నారు. జగన్ పాలనలో దేవాలయాలపై దాడులు, మతమార్పిడులు పెరిగాయి. దేవాలయాల్లోని విగ్రహాల విధ్వంసానికి తానే కారణమని ఒక పాస్టర్ బహిరంగంగా ప్రకటించాడంటే అక్కడి పరిస్థితిని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి దుశ్చర్యలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్‌తో పాటు బిజెపి, బజరంగ్‌దళ్ తదితర హిందుత్వ సంస్థలు తీవ్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ప్రభుత్వానికి సన్నిహితుడైన ఒక మఠాధిపతి నోరు మెదపకపోవడం కూడా హిందువుల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డ్ ఛైర్మన్ కూడా క్రిస్టియన్ మతస్థుడనే ప్రచారం కూడా జరిగింది. ఆంధ్రలో వలే తెలంగాణలో కూడా తమ మతవ్యాప్తి కార్యక్రమాలు విస్తరించడానికే క్రిస్టియన్ మతసంస్థలే షర్మిలను పంపించి ఉంటాయంటున్నారు. ఏది సత్యం? ఏదసత్యం?

శ్యామ్ సుందర్ వరయోగి

Advertisement
Advertisement
Advertisement