ఎవరి చట్టం, ఎవరి ఆదేశం?

ABN , First Publish Date - 2021-10-09T06:30:09+05:30 IST

‘భారత ప్రజలమైన మేము ఈ భారత రాజ్యాంగాన్ని మాకు మేమే రూపొందించుకుని, మాకు మేమే సమర్పించుకున్నాము’- ఈ మాటలు చాలా గట్టివి. ఎంతో ఘనమైనవి. మరెంతో ఉన్నతమైనవి. సూర్యకాంతిలా స్వచ్ఛమైనవి....

ఎవరి చట్టం, ఎవరి ఆదేశం?

‘భారత ప్రజలమైన మేము ఈ భారత రాజ్యాంగాన్ని మాకు మేమే రూపొందించుకుని, మాకు మేమే సమర్పించుకున్నాము’- ఈ మాటలు చాలా గట్టివి. ఎంతో ఘనమైనవి. మరెంతో ఉన్నతమైనవి. సూర్యకాంతిలా స్వచ్ఛమైనవి. అత్యంత స్పష్టమైనవి. నాటకీయమైనవి కూడా. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం; ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగిఉండే ఆరాధనా స్వేచ్ఛ; దేశీయ సమైక్యతను, అఖండతాభావాన్ని, సోదరభావాన్ని, వ్యక్తి గౌరవాన్ని పెంపొందించేందుకు ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకున్నాం. 


భారత రాజ్యాంగ పీఠికను ప్రతి ప్రభుత్వాధికారి, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి తప్పనిసరి పఠనీయాంశం చేయాలి. వారిలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తారు. వారి మొదటి బాధ్యత దేశపౌరుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను సంరక్షించడం; వారి మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం. వారు తమ విధ్యుక్తధర్మాన్ని నిర్వర్తించేందుకు మనం ఒక పార్లమెంట్‌ను సృష్టించాం; దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక శాసనవ్యవస్థను సృష్టించాం. ‘పౌరభద్రత’, ‘పోలీసు’ వ్యవహారాలపై చట్టాలు రూపొందించే బాధ్యతను రాష్ట్ర శాసనవ్యవస్థకు అప్పగించాం. క్రిమినల్ లా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ‘ప్రివెంటివ్ డిటెన్షన్’ అంశాలపై చట్టాలు చేసే బాధ్యతను పార్లమెంటు, శాసనసభ రెండిటికీ అప్పగించాం. 


చట్టాలను అమలుపరిచేందుకు ఒక కార్యనిర్వాహక వ్యవస్థను సృష్టించాం. కార్యనిర్వాహక వర్గ అధికారాలను నియంత్రించేందుకు దేశపౌరులకు రాజ్యాంగబద్ధమైన ‘ప్రాథమిక హక్కులు’ ప్రసాదించాం. ఈ హక్కులు సాధారణ చట్టపరమైన హక్కుల కంటే బలమైనవీ, ప్రత్యేక మైనవి. ఈ హక్కులకు భంగం కలిగినప్పుడు, పరిహారం కోరుతూ సంబంధిత వ్యక్తి నేరుగా సుప్రీం కోర్టును గానీ, హైకోర్టును గానీ ఆశ్రయించవచ్చు. ప్రాథమిక హక్కులపై కేవలం రాజ్యాంగం అనుమతించిన పరిమితులు మాత్రమే విధించవచ్చు. ‘చట్టం నిర్దేశించిన విధంగా మినహా మరొక విధంగా వ్యక్తికి గల జీవించే హక్కును గాని, అతనికిగల వ్యక్తి స్వేచ్ఛను గాని హరించరాదు’ (అధికరణం 21) అని హెచ్చరించాం. అలాగే ‘ఒక వ్యక్తి అరెస్టు కాబడి, నిర్బంధంలో ఉంచబడినప్పుడు సాధ్యమైనంత త్వరగా అరెస్ట్‌కు కారణాలను తెలియజేయాలి. అంతేగాక తనకు ఇష్టమైన న్యాయవాదితో సంప్రదింపులు జరిపే హక్కు, న్యాయవాదిని నియమించుకునే హక్కును సదరు వ్యక్తికి నిరాకరించరాదని’ (అధికరణ 22) స్పష్టం చేశాం. ‘అరెస్ట్ చేసి నిర్బంధంలో ఉంచబడిన 24 గంటల లోపల ఆ వ్యక్తిని సమీపంలోని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలని, మెజిస్టేట్ అనుమతి లేనిదే 24 గంటలకు మించి ఏ వ్యక్తినీ నిర్బంధంలో ఉంచరాదని కూడా స్పష్టం చేశాం. ఇవన్నీ నాగరీకమైన నిబంధనలు. మరి ఎందుకు ఉల్లంఘనకు గురవుతున్నాయి? మనం ఎక్కడ తప్పు చేశాం? ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడమే సుమా! 


లఖింపూర్ ఖేరీలో సంభవించిన విషాద ఘటనలో మొత్తం ఎనిమిది మంది  చనిపోయారు. ఒక ఎస్‌యువి తమ మీదకు దూసుకురావడంతో నలుగురు రైతులు మరణించగా,‍ దరిమిలా జరిగిన హింసాకాండలో మరో నలుగురు చనిపోయారు. రాజకీయ నాయకులు మృతుల స్వగ్రామాలకు వెళ్ళి వారి కుటుంబాలను పరామర్శించడం ఒక సహజ విషయం. అలా చేసేందుకు వారికి సంపూర్ణ హక్కు ఉంది. బాధలో ఉన్నవారికి సహానుభూతి వ్యక్తం చేస్తేనే రాజ్యాంగం ఆశించిన సౌభ్రాతృత్వం వర్ధిల్లుతుంది. 


భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులలో ఒకరైన ప్రియాంక గాంధీ వాధ్రా కారులో లఖింపూర్ ఖేరీకి వెళుతుండగా సీతాపూర్ వద్ద ఆమెను నిలిపివేశారు. ఆమె ప్రయాణం ముందుకు సాగకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి: అక్టోబర్ 4వ తేదీ ఉదయం 4.30 గంటలకు సీతాపూర్ వద్ద ప్రియాంక కారును నిలిపివేశారు. నేర విచారణ విధానస్మృతిలోని సెక్షన్ 151 కింద అరెస్ట్ చేస్తున్నట్టు ఆమెకు చెప్పారు. పురుష పోలీస్ ‌అధికారులు ఆమెను ఒక వ్యాన్ లోకి ఎక్కించారు. ఆమెను ఒక ప్రభుత్వ గెస్ట్‌హౌస్లో బుధవారం (అక్టోబర్ 6) వరకు నిర్బంధించారు. అరెస్ట్కు, విడుదలకు మధ్య 60 గంటల కాలంలో ఏ కారణాలతో అరెస్ట్ చేసిందీ ప్రియాంకకు చెప్పలేదు. అరెస్ట్ చేస్తున్నట్టు తెలియజేసే పత్రాన్ని ఆమెకు ఇవ్వలేదు, దానిపై ఆమె సంతకాన్ని తీసుకోలేదు. నిబంధనల ప్రకారం మెజిస్ట్రేట్ ముందు ఆమెను హాజరుపరచలేదు. ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేసి ఉంటే దాని ప్రతిని ఆమెకు ఇవ్వలేదు. ఆ గెస్ట్‌హౌస్ వెలుపల గంటల తరబడి వేచిఉన్న తన న్యాయవాదిని కలుసుకోవడానికి ప్రియాంకకు అనుమతి ఇవ్వలేదు. నేర విచారణ విధానస్మృతిలోని సెక్షన్ 151 కింద, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 107, 116 కింద అభియోగాలు మోపినట్టు అక్టోబర్ 5 (మంగళవారం)న ప్రియాంకకు చెప్పారు. 


చట్ట నిబంధనలు ఎన్ని ఉల్లంఘింపబడ్డాయో నేను లెక్కవేయలేను. మీకు కనుక ఆసక్తి ఉంటే రాజ్యాంగం ప్రతిని, నేర విచారణ విధానస్మృతి, భారత శిక్షాస్మృతిని తీసుకుని పరిశీలించండి. రాజ్యాంగ అధికరణలు 19, 21, 22; నేర విచారణ విధానస్మృతిలోని సెక్షన్లు 41 బి, 41 డి, 46, 50, 56, 57, 60ఎ, 151 (ముఖ్యంగా సబ్‌సెక్షన్ 2), 167; భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 107, 116 ఉల్లంఘనకు గురయ్యాయి.


యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల భావనకు భిన్న అర్థం ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో ఒక చట్టం ఉంది-అది భారత చట్టం కాదు, ఆదిత్యనాథ్ చట్టం. అక్కడ బహుళ ఆదేశాలు అమల్లో ఉన్నాయి. అవన్నీ ఆదిత్యనాథ్ ఆదేశాలేగానీ, చట్టబద్ధమైన ఆదేశాలు కావు. పోలీసులు శాంతిభద్రతలను నిర్వహిస్తుంటారు–-ఆదిత్యనాథ్ చట్టాన్ని, ఆదిత్యనాథ్ ఆదేశాలను శిరసావహిస్తుంటారు. 


ఇక పోలీసుల వివేకశీలతను చూద్దాం. నేర విచారణ విధానస్మృతిలోని సెక్షన్ 151లో ఏ నేరం గురించిన ప్రస్తావన లేదు. మరి ఆ సెక్షన్ కింద ‘అభియోగం’ మోపడమేమిటి? భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 107, 116 నేరాన్ని ప్రేరేపించడం, ప్రోత్సహించడానికి సంబంధించినవి. నేరాన్ని ప్రేరేపించినట్టు నిర్దిష్టంగా ఒక వ్యక్తి పేరును లేదా అతడు ప్రోత్సహించిన నేరాన్ని స్పష్టంగా పేర్కొన్నప్పుడు మాత్రమే ఆ అభియోగం అర్థవంతమైనదిగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ సూక్ష్మాన్ని గుర్తించినట్టు లేదు. కనుక ప్రియాంకపై అభియోగాలు మోపడమనేది తెలివితక్కువ వ్యవహారం. ఉత్తరప్రదేశ్ పోలీసులకు రాజ్యాంగం గురించి, రాజ్యాంగ విహిత చట్టాల గురించి తెలీదని భావించాలి. ఈ అజ్ఞానం గర్హనీయమైనది. ఒకవేళ తెలిసినా తమ చట్టవిరుద్ధ చర్యల వల్ల తమకేమీ జరగదనే భరోసా. ఇటువంటి పరిస్థితి ఏ విధంగానూ వాంఛనీయం కాదు. ఉత్తరప్రదేశ్ పోలీస్‌శాఖలో డిజిపి హోదా అధికారులు పలువురు ఉన్నారు. ఉన్నతస్థాయి పోలీస్‌ అధికారుల నుంచి సామాన్య కానిస్టేబుల్ దాకా వారు మరింత మెరుగైన పేరుప్రతిష్ఠలకు అర్హులు. అంతకంటే ముఖ్యంగా 23.5 కోట్ల మంది ఉత్తరప్రదేశ్ ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలకు అర్హులు. 


స్వేచ్ఛ అనే తీరం ఒక సునామీతో కొట్టుకుపోదు. ఎడతెగకుండా విరుచుకుపడుతున్న కెరటాలతో దాని అంచులు శిథిలమవుతాయి. ఉంభా (సోన్‌భద్ర), ఉన్నావో-1, షాజహాన్‌పూర్, ఉన్నావో–-2, ఎన్‌ఆర్‌సి/ సిఏఏ, హత్రాస్, ఇప్పుడు లఖింపూర్ ఖేరీ.. స్వేచ్ఛాతీరంపై విరుచుకుపడుతున్న విధ్వంసక కెరటాలను మీరు చూడడం లేదా?


పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2021-10-09T06:30:09+05:30 IST