ఎవరి పనులు.. ఎవరి ఖాతాలో

ABN , First Publish Date - 2022-02-17T07:03:30+05:30 IST

ప్రాజెక్టు ప్రతిపాదనలు ఎవరివి? దానిని ఎవరు తీసుకొచ్చారు? పనులు ఎవరి హయాంలో జరిగాయి? ఈ వ్యవహారంలో వారి పాత్ర ఏమిటి? ఇవేవీ పట్టవు

ఎవరి పనులు.. ఎవరి ఖాతాలో

పతిపాదనలు, కష్టం టీడీపీది

ప్రాజెక్టులు ఇచ్చింది కేంద్రం

ప్రచారం మాత్రం నేటి ప్రభుత్వానిది

రెండున్నరేళ్లుగా ఘోరంగా దారులు

ముందుకు సాగని ‘అనంత-అమరావతి’

నిధుల మళ్లింపు.. నిలిచిన వీసీఐసీ రోడ్లు

ఎవరో పరిచిన ఎన్‌హెచ్‌లపై షికారు

బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌పై సొంత డబ్బా

మిగతా జాతీయ, రాష్ట్ర ప్రాజెక్టులపైనా ఇంతే


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టు ప్రతిపాదనలు ఎవరివి? దానిని ఎవరు తీసుకొచ్చారు?  పనులు ఎవరి హయాంలో జరిగాయి? ఈ వ్యవహారంలో వారి పాత్ర ఏమిటి? ఇవేవీ పట్టవు! ‘మా హయాంలో ప్రారంభోత్సవం జరిగింది కాబట్టి... క్రెడిట్‌ మొత్తం మాదే!’ అని వైసీపీ అంటోంది.   గురువారం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో కలిసి ప్రారంభించనున్న రహదారి ప్రాజెక్టులన్నీ తమ ఘనతగానే చెప్పుకొంటోంది. ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్లుగా జోరుగా క్రెడిట్‌ గేమ్‌ ఆడుతోంది!


ప్రతిపాదనలు తెలుగుదేశం హయాంలోవి! కష్టం... పాత ప్రభుత్వానిది! ప్రాజెక్టులు కేంద్రానివి! కానీ... ‘అదంతా మా ఘనతే’ అని వైసీపీ పెద్దలు సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. గురువారం కేంద్ర మంత్రి గడ్కరీ ప్రారంభించనున్న ప్రాజెక్టులన్నీ తామే తెచ్చినట్లుగా గొప్పలకు పోతున్నారు. వందల కిలోమీటర్ల రహదారులు తామే వేసినట్లుగా సొంత మీడియాలో, సోషల్‌ మీడియాలో ఊదరగొడుతున్నారు. నిజానికి... రహదారుల విషయంలో వైసీపీది అధ్వాన చరిత్ర. ఈ మాట అధికార వర్గాలే పరోక్షంగా ఎన్నోసార్లు ఒప్పుకొన్నాయి. మేజర్‌ రోడ్ల పనులను అలా ఉంచితే.. గుంతకు తట్ట కంకర పోసి మరమ్మతు చేయడానికే రోడ్లు రహదారుల శాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. అలాంటిది, రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఇటు రాష్ట్ర స్థాయిలో, అటు కేంద్ర స్థాయిలో ఒప్పించి మెప్పించి తీసుకొచ్చిన జాతీయ, రాష్ట్ర  రహదారి ప్రాజెక్టుల క్రెడిట్‌ను వైసీపీ తమ ఖాతాలో వేసుకుంటోంది. ‘మేం అధికారంలో ఉండగా పనులు పూర్తయ్యాయి. కాబట్టి... అది మా ఘనతే’ అని చెప్పుకొంటోంది. ‘రహదారి కష్టమంతా జగనన్నదే’ అంటూ సోషల్‌మీడియా వేదికగా ఓ ఎంపీ తెగ ప్రచారం చేస్తున్నారు. ఇది నిజమే అన్నట్లుగా ప్రభుత్వ ప్రకటనలు ఉంటున్నాయి. 


అప్పుడు అలా...

రాష్ట్రంలో కొత్తగా 3వేల కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారుల ఏర్పాటుకు టీడీపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు ఇచ్చింది. ఇవిగాక, 5,486 కిలోమీటర్ల రహదారులను పంచాయతీరాజ్‌ నుంచి తీసుకుని ఆర్‌అండ్‌బీకి అప్పగించి నాబార్డు, ఏఐఐబీ, ఎన్‌డీబీ, ఏడీబీ నిధులతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. మరో రెండువేల కిలోమీటర్ల రోడ్లను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. రాష్ట్ర స్థాయిలో మూడు వేల కిలోమీటర్ల రాష్ట్ర ప్రధాన రహదారులను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక కార్యక్రమం ప్రతిపాదించారు. నాడు కేంద్రప్రభుత్వం ముందుంచిన అనేకానేక ప్రతిపాదనలకు ఆమోదం తీసుకురావడంతో 2020 నాటికి రాష్ట్రంలో మొత్తం జాతీయ రహదారులను 6401 కిలోమీటర్ల నుంచి ఎనిమిది వేల కిలోమీటర్లకు తీసుకురావాలని నిర్ణయించారు. విజయవాడ-మచిలీపట్నం రహదారి (ఎన్‌హెచ్‌ 65) విస్తరణతోపాటు బెంజిసర్కిల్‌ ఫ్లైఓవర్‌ పనులను చేపట్టారు. ఎన్‌హెచ్‌ 6 పరిధిలో  నరసన్నపేట-రణస్థలం, రణస్థలం-ఆనందపురం, ఆనందపురం-అనకాపల్లి, గుండుగొలను-కొవ్వూరు వంటి రహదారి పనులను ప్రారంభించారు. బెంజిసర్కిల్‌ ఫ్లైఓవర్‌ను 120 కోట్ల రూపాయల వ్యయంతో మరింత పొడవుగా విస్తరించాలని అప్పట్లోనే ప్రతిపాదించారు. విజయవాడ నగరానికి 189 కిలోమీటర్ల పరిధిలో ఔటర్‌ రింగ్‌ రోడ్డును రూ. 18,238 కోట్ల వ్యయంతో ప్రతిపాదించారు.


రాష్ట్ర ప్రభుత్వమే భూ సేకరణ చేసేందుకు అంగీకరించింది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఫిజిబిలిటీ రిపోర్టు కూడా కేంద్రానికి వెళ్లింది. భారతమాల పరిధిలో చేర్చి అమలు చేస్తామన్నారు. 800 కోట్ల రూపాయల వ్యయంతో 16 కిలోమీటర్ల పొడవైన చిలుకలూరిపేట బైపా్‌సను కూడా గత ప్రభుత్వమే ప్రతిపాదించింది. ఎన్‌హెచ్‌ 544డి కింద గుంటూరు నుంచి గిద్దలూరు వరకు జాతీయ రహదారి ప్రతిపాదనకు కే చేయించారు. ఇందుకు రూ.2,250 కోట్లు వ్యయం కానుందని తేల్చారు. కేంద్రం కూడా అప్పట్లో అనుమతి ఇచ్చింది. ఏపీ, ఒడిశాలోని అటవీ ప్రాంతాలను కలుపుతూ 280 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని ప్రతిపాదించారు. ఇందులో ఏపీకి 218 కిలోమీటర్లు ఉంది. 2680 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. రాజధాని అమరావతికి రాయలసీమను అనుసంధానించేలా 25వేల కోట్లతో అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రె్‌సవేను టీడీపీ హయాంలోనే ప్రతిపాదించారు. కేంద్రం నంబర్‌ కూడా కేటాయించింది.  విశాఖపట్టణం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు మధ్య అడ్డంకులు లేని ప్రయాణాలు సాగేలా 2018లోనే చంద్రబాబు ప్రభుత్వం భీమిలీ-భోగాపురం బీచ్‌కారిడార్‌ రహదారిని ప్రతిపాదించారు. ఇవికాక, రాష్ట్రంలో గ్రామీణ, జిల్లా రహదారుల అభివృద్ధి, విస్తరణకోసం న్యూడెవల్‌పమెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) నుంచి 6,400 కోట్ల రుణం తీసుకొచ్చే ప్రణాళికను నాటి ప్రభుత్వం చేపట్టింది. రుణ మంజూరుకు ఎన్‌డీబీని ఒప్పించింది. ఆయా ప్రాజెక్టుల పనులు చాలావరకు టీడీపీ హ యాంలోనే పరుగులు తీశాయి. కొన్ని పనులు పూర్తయ్యాయి. మరికొన్ని పూర్తయ్యే దశకు చేరుకున్నాయి.


ఇప్పుడు ఇలా...

జగన్‌ సర్కారు 2019 మేలో అధికారంలో వచ్చింది. అప్పటినుంచి కొత్తగా ఎన్ని జాతీయ రహదారులు వచ్చాయి...అదనంగా ఎన్ని వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు అందుబాటులోకి వచ్చాయి...నూతనగా రాష్ట్ర, జిల్లా రహదారులను ఏ మేరకు నిర్మాణం చేశారు? ఈ ప్రశ్నలకు ఆర్‌అండ్‌బీ దగ్గరే సమాధానం లేదు. ఎందుకంటే గత రెండున్నరేళ్లుగా రోడ్లు భవనాల శాఖ పాత రోడ్లకు మరమ్మతులు కూడా సరిగ్గా చేయలేకపోయింది. ఇక కొత్తగా ఏ రహదారి నిర్మాణం చేపడుతుంది! ఒకవేళ చేస్తేగీస్తే గతంలో ప్రతిపాదించిన పనులనే పూర్తిచేసింది తప్ప కొత్తగా ఒక్క అడుగు కూడా రహదారి నిర్మాణం చేసిన దాఖలాలు లేవని అధికారవర్గాలే చెబుతున్నాయి. జగన్‌ సర్కారు వచ్చాక, నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయంలో చేపట్టిన, అప్పటికే నిర్మాణంలో ఉన్నవి, కొత్తగా ప్రతిపాదించిన వర్క్‌లను నిలిపివేశారు. అందులో బీచ్‌ కేరిడార్‌ కూడా ఒకటి. నాటి ప్రభుత్వం ప్రారంభించిన దుర్గమ్మ ఫ్లైఓవర్‌ పనులు పూర్తవ్వగానే ప్రారంభించి ఆ పనిని తాము దిగ్విజయంగా పూర్తిచేసినట్లు ఖాతాలో వేసుకుంది. బెంజి సర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌  ప్రతిపాదనలు గత ప్రభుత్వమే చేపట్టినా...పనులు తన హయంలో జరిగాయి కాబట్టి ఆ క్రెడిట్‌ తమదే అంటోంది జగన్‌ సర్కారు. ఇక, 6400 కోట్ల రూపాయల ఎన్‌డీబీ రుణం సాధించింది తెలుగుదేశం పార్టీ. కానీ అప్పటికే ఎన్నికలు జరిగి జగన్‌ సర్కారు అధికారంలోకి వచ్చింది. ఆ ప్రాజెక్టును చేపట్టాలా? వద్దా అని మల్లగుల్లాలు పడి చివరకు ఎన్‌డీబీతో రుణ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ  ప్రాజెక్టును జగన్‌ సర్కారే తీసుకొచ్చిందని ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య అధికారితోసహా ప్రభుత్వం పదేపదే చెప్పుకొంటోంది. గత ప్రభుత్వ హ యాంలో సాధించి, నిర్మాణం చేపట్టిన జాతీయరహదారి వర్క్‌లు, బ్రిడ్జిలు ఇటీవలికాలంలో పూర్తయ్యాయి. అవి కూడా తమ ఘనతే అన్నట్లుగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. ఆ పనులు చేపట్టినప్పుడు ఆర్‌అండ్‌బీలోనే లేని అధికారులు ఇప్పుడు ఆ క్రె డిట్‌ కూడా జగన్‌ సర్కారుదే అన్న పల్లవి వినిపిస్తుండటం కొసమెరుపు. భీమిలి-భోగాపురం బీచ్‌ కారిడార్‌ కూడా గత ప్రభుత్వంలో తీసుకొచ్చిందే. కానీ ఇది కూడా తమదే అంటున్నారు అధికారపార్టీ నేతలు. ఇక... అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రె్‌సవేను పూర్తిగా పక్కనపెట్టేశారు. అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఊసేలేదు. తనదంటూ ఓ ముద్ర ఉండాలని సొంత జిల్లా, సొంత నియోజకవర్గం నుంచి బెంగళూరుకు వెళ్లేలా ఓ జాతీయ రహదారిని సీఎం జగన్‌ ప్రతిపాదించారు. ఇంతకు మించి జగన్‌ సర్కారు కొత్తగా చేసిందేమిటి?

Updated Date - 2022-02-17T07:03:30+05:30 IST