‘మిమ్మల్ని అమ్మఒడి ఎవరడిగారు..?’

ABN , First Publish Date - 2021-10-26T14:16:42+05:30 IST

‘‘అమ్మఒడి ఎవరడిగారు..

‘మిమ్మల్ని అమ్మఒడి ఎవరడిగారు..?’

మా బడి మాకు కావాలి

రూ.15 వేలిచ్చి ఉచిత బడులు మూస్తారా? 

మూయడానికి జగన్మోహన్‌రెడ్డి ఎవరు?

ఎయిడెడ్‌ కోసం రోడ్డెక్కిన తల్లిదండ్రులు

సేక్రెడ్‌ హార్ట్‌, సెయింట్‌ పీటర్స్‌ మూతపై విశాఖలో వెల్లువెత్తిన ఆక్రోశ ఆగ్రహాలు

దాదాపు వెయ్యిమంది ఒకేసారి రోడ్డుపైకి

అటుగా వచ్చిన ఎమ్మెల్యే ఘెరావ్‌

కొనసాగించాలని చివరకు నిర్ణయం 


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి):

‘ఉచితంగా పాఠాలు చెప్పే పాఠశాలలను మూసేసి, వేలకు వేల రూపాయలు చెల్లించి ప్రైవేటు పాఠశాలల్లో చేరాలని చెప్పమనడానికి జగన్మోహన్‌రెడ్డి ఎవరు? పాఠశాలలను ఎవర్ని అడిగి మూసేస్తున్నారు? పేదలకు ఈ చదువులు కూడా లేకుండా చేస్తారా?’


‘అమ్మఒడి ఎవరడిగారు? ఏడాదికి రూ.15 వేలు ఇచ్చేసి ఉచితంగా పాఠాలు చెప్పే స్కూళ్లను మూసివేయడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇది’ 

                                                                      - ఎయిడెడ్‌ విద్యార్థుల తల్లిదండ్రుల ఆక్రోశం


‘‘అమ్మఒడి ఎవరడిగారు...మా పిల్లలు చదువుకునేందుకు బడి కావాలి...’’ అంటూ విశాఖలోని పలు ఎయిడెడ్‌ స్కూళ్ల విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కారు. ‘మా బడి మాకు కావాలి’ అంటూ ఒకేసారి వెయ్యిమంది రోడ్డు మీదకు రావడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఇదే సమయంలో అక్కడకు స్థానిక ఎమ్మెల్యే రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ధాటిగా ప్రభుత్వాన్ని నిలదీసిన తల్లిదండ్రుల ఆక్రోశ ఆగ్రహావేశాలు అక్కడున్నవారిని కదిలించాయి.  చివరకు ప్రభుత్వమే దిగివచ్చేలా చేశాయి. ఆ వివరాల్లోకి వెళితే.. విశాఖ జ్ఞానాపురంలోని సేక్రెడ్‌ హార్ట్‌, సెయింట్‌ పీటర్స్‌ పాఠశాలల యాజమాన్యం సోమవారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ప్రభుత్వ విధానాలు మారడం వల్ల తాము పాఠశాలలను నడపలేమని, మూసివేస్తున్నామని, పిల్లలను వేరే పాఠశాలల్లో చేర్పించుకోవాలని సూచించింది. మంగళవారం నుంచి పాఠశాలలు తెరవబోమని కూడా స్పష్టంచేశారు. ఆస్తులతో పాటు బోధన, బోధనేతర సిబ్బందిని తమకు అప్పగించాలని ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.


ఈ నేపథ్యంలోనే తమ విద్యా సంస్థలను మూసివేయాలని సేక్రెడ్‌ హార్ట్‌, సెయింట్‌ పీటర్స్‌ పాఠశాలల యాజమాన్యాలు నిర్ణయించి.. అదే విషయం పిల్లల తల్లిదండ్రులకు తెలిపాయి. ఈ విషయం తెలుసుకుని తల్లిదండ్రులు, విద్యార్థులు ఒక్కసారిగా హతాశులయ్యారు. విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నపళంగా పాఠశాల్ని మూసేయడం ఏమిటని నిలదీశారు. ప్రభుత్వ విధానం అలా ఉండటం వల్ల తాము ఏమీ చేయలేమని యాజమాన్యాలు చెప్పడంతో వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపైకి వచ్చారు. దాదాపు వేయి మందికి పైగా తల్లిదండ్రులు, వారి పిల్లలు ఒక్కసారిగా రోడ్డెక్కడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. పాఠశాలలను తెరుస్తామని హామీ ఇచ్చేంత వరకు తాము కదిలేది లేదని భీష్మించారు. తెలుగుదేశం, జనసేన పార్టీల నేతలు వారితో గొంతు పలిపారు. ఆందోళన విషయం తెలుసుకొని స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ అక్కడకు రాగా.. తల్లిదండ్రులు నిలదీశారు. ఆయన ముందే ప్రభుత్వ తీరును ఎండగడుతూ శాపనార్థాలు పెట్టారు.


ఉచితంగా పాఠాలు చెప్పే పాఠశాలలను మూసేసి, వేలకు వేలు రూపాయలు చెల్లించి ప్రైవేటు పాఠశాలల్లో చేరాలని చెప్పడం ఏం న్యాయమని వాపోయారు. రేపటి నుంచి తమ పిల్లల భవిష్యత్తు ఏమిటి? అంటూ ఎమ్మెల్యేను ధాటిగా నిలదీశారు. ఈ దశలో పాఠశాల యాజమాన్యం ఎక్కువ ఫీజులు వసూలు చేసేందుకు యత్నిస్తోందంటూ ఎమ్మెల్యే ఏదో చెప్పడానికి ప్రయత్నించగా.. తల్లిదండ్రులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగొచ్చిన అధికారులు: తల్లిదండ్రుల ఆందోళనతో విద్యా శాఖ దిగివచ్చింది. పాఠశాలల ప్రతినిధులతో అధికారులు మాట్లాడారు. చివరకు మంగళవారం నుంచి పాఠశాలలు కొనసాగించడానికి  అంగీకరించడంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. కాగా, విశాఖ జిల్లాలో తొమ్మిది పాఠశాలల యాజమాన్యాలు ఆస్తుల అప్పగింతకు అంగీకరించాయి. మరో 62 పాఠశాలల యాజమాన్యాలు టీచర్లు, స్టాఫ్‌ను అప్పగించాలని నిర్ణయించాయి.


ఎంతో ఘనత...

జ్ఞానాపురంలో సేక్రెడ్‌ హార్ట్‌ పాఠశాలను 1965లో, సెయింట్‌ పీటర్స్‌ పాఠశాలను 1968లో ప్రారంభించారు. ఈ రెండింటిలోను రెండు వేల మందికి పైగా పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. సేక్రెడ్‌హార్ట్‌ పాఠశాలలో విద్యార్థుల నుంచి నెలకు రూ.100 నుంచి రూ.150 ఫీజు వసూలు చేస్తుంటారు. సెయింట్‌ పీటర్స్‌లో అయితే పూర్తిగా ఉచితం. నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికలు ఇక్కడ చదువుతున్నారు.



ఇక్కడైతేనే ఆడపిల్లలకు రక్షణ

‘‘ఆడపిల్లలకు మంచి రక్షణగా ఉన్న పాఠశాల మూసివేత నిర్ణయాన్ని యాజమాన్యం వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ఎయిడెడ్‌ పాఠశాలలపై తీసుకువచ్చిన జీవోలను రద్దు చేయాలి. అప్పుడే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. మాకు అమ్మఒడి వద్దు. పాఠశాలలే కావాలి’’

                                                                                               - కృష్ణవేణి, విద్యార్థిని తల్లి


డబ్బులొద్దు.. పిల్లల భవిష్యత్తు కావాలి

‘‘అర్ధంతరంగా పాఠశాలను మూసివేస్తే మా పిల్లల భవిష్యత్తు ఎలా? మా పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలి? మాకు డబ్బులు వద్దు. పాఠశాల కావాలి. పిల్లల భవిష్యత్తు కావాలి’’  

                                                                                                        - లక్ష్మీ, విద్యార్థి తల్లి


ఆందోళనతో వచ్చాను

‘‘పాఠశాల మూసివేస్తున్నారన్న వార్త తెలియగానే తీవ్ర ఆందోళన చెందాను. క్రమశిక్షణ గల పాఠశాల కారణంగా ఎంతోమంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ప్రభుత్వం న్యాయం చేయాలి. ఎయిడెడ్‌ పాఠశాలలపై తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలి’’

                                                                                                - భవానీ, పూర్వ విద్యార్థిని

Updated Date - 2021-10-26T14:16:42+05:30 IST