దేశం నాట్యం చేస్తోంది : మోదీ

ABN , First Publish Date - 2021-08-05T19:40:14+05:30 IST

భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడంతో

దేశం నాట్యం చేస్తోంది : మోదీ

న్యూఢిల్లీ : భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడంతో యావత్తు దేశం నాట్యం చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నాలుగు దశాబ్దాల ఎదురుచూపులకు తెర దించుతూ జర్మనీపై భారత్ విజయం నమోదైన వెంటనే భారత జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌కు మోదీ ఫోన్ చేసి, అభినందించారు. 


టోక్యో ఒలింపిక్స్‌లో గురువారం భారత్, జర్మనీ హాకీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ 5-4 తేడాతో విజయం సాధించింది. వెనువెంటనే భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ‘‘మన్‌ప్రీత్, మీకు, మీ యావత్తు జట్టుకు చాలా చాలా అభినందనలు. మీరంతా చాలా గొప్ప కృషి చేశారు. యావత్తు దేశం నాట్యం చేస్తోంది. నా మనసంతా సంతోషంగా ఉంది. జట్టు సభ్యులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేయండి. ఆగస్టు 15న మనమంతా కలుసుకుందాం. నేను అందరినీ ఆహ్వానించాను’’ అని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది.


సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బెల్జియం చేతిలో పరాజయాన్ని చవి చూసిన తర్వాత కూడా మోదీ భారత హాకీ జట్టుతో మాట్లాడారు. టీమ్ ఇండియా చీఫ్ కోచ్ గ్రాహం రీడ్ కూడా మోదీతో మాట్లాడారు. రీడ్  కఠోర శ్రమకు ఫలితాలు కనిపిస్తున్నాయని మోదీ అన్నారు. సెమీ ఫైనల్‌లో భారత జట్టు పరాజయం తర్వాత ప్రోత్సాహకరంగా మాట్లాడినందుకు మోదీకి రీడ్ ధన్యవాదాలు తెలిపారు. 


జర్మనీపై భారత్ గెలిచిన తర్వాత మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, ప్రతి భారతీయుని మధుర జ్ఞాపకాల్లో చెరగని చారిత్రక దినం ఇది అని పేర్కొన్నారు. దేశానికి కాంస్య పతకం తీసుకొస్తున్నందుకు హాకీ జట్టు సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. ఈ జట్టును చూసి దేశం గర్విస్తోందన్నారు.


Updated Date - 2021-08-05T19:40:14+05:30 IST