ట్రంపే గెలుస్తారట..!

ABN , First Publish Date - 2020-10-30T21:57:20+05:30 IST

అమెరికా ఎన్నికల సమయం దగ్గర పడింది. నవంబర్ 3న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. అమెరికా అధ్యక్ష పీఠాన్ని మరోసారి దక్కించుకోవడానికి రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, అమెరికా అధ్యక్షుడు డొనా

ట్రంపే గెలుస్తారట..!

వాషింగ్టన్: అమెరికా ఎన్నికల సమయం దగ్గర పడింది. నవంబర్ 3న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. అమెరికా అధ్యక్ష పీఠాన్ని మరోసారి దక్కించుకోవడానికి రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ట్రంప్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు డెమొక్రటిక్ అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేక పరిస్థితుల మధ్య జరుగుతున్న ఎన్నికలు కావడంతో అమెరికా సహా యావత్ ప్రపంచం.. గెలుపు ఎవరిదన్న విషయంపై చర్చించుకుంటోంది. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో విజయం.. ట్రంప్‌ను వరించబోతుందోని ఓ జ్యోతిష్కుడు కుండబద్ధలు కొట్టారు. అధ్యక్ష పీఠంపై ట్రంప్ మరో నాలుగు సంవత్సరాలు కొనసాగుతారని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. 


నవంబర్ 3న జరగబోయే ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయ ఢంకా మోగిస్తారని భారత్‌కు చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు శంకర్ చరణ్ త్రిపాఠి వెల్లడించారు. ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థుల గ్రహాల స్థితిగతులు, జన్మించిన ప్రదేశం, పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తారని అంచనా వేశారు. నాలుగు నుంచి తొమ్మిది లక్షల ఓట్ల తేడాతో జో బైడెన్‌పై ట్రంప్ విజయం సాధిస్తారని తెలిపారు.  ట్రంప్ గెలుపునకు కేవలం నాలుగు రాష్ట్రాలు మాత్రమే కారణం కాబోతున్నాయని పేర్కొన్నారు. ట్రంప్‌కు డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ ఆయనకు ఓటమి తప్పదన్నారు. నాలుగు రాష్ట్రాల్లో తక్కువగా ఓట్లు పడటం వల్ల జో బైడెన్ ఎన్నికల్లో ఓడిపోతారని చెప్పారు. అయితే హోరాహోరీ పోటీలో ట్రంప్ గెలిచినప్పటికీ.. ఆయన తీవ్ర విమర్శల పాలవుతారని శంకర్ చరణ్ త్రిపాఠి వెల్లడించారు. ఓట్లను మ్యానేజ్ చేయడం, హ్యాకింగ్ చేయడం వల్లే ఆయన గెలిచాడన్న ఆరోపణలను ట్రంప్ ఎదుర్కొంటారని వివరించారు. 


ఇంతకూ ఎవరీ శంకర్ చరణ్ త్రిపాఠి?

అమెరికా ఎన్నికలు పూర్తవకముందే గెలుపు ఓటములు ఎవరివో తేల్చేసిన శంకర్ చరణ్ త్రిపాఠి ఎవరు అన్న విషయానికి వస్తే.. ఆయన ఆర్జేడీ మాజీ నేత. గతంలో ఆర్జేడీ అధికార ప్రతినిధిగా శంకర్ చరణ్ త్రిపాఠి పని చేశారు. 2018లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల పార్టీ నుంచి ఆయనను తొలగించారు. రాజకీయాల్లో లాలూ ప్రసాద్ హవా కొనసాగిన సమయంలో ఆయనకు శంకర్ చరణ్ త్రిపాఠి సలహాలు సూచనలు ఇస్తుండేవారు. 


గెలుపు ఎవరిదన్న అంశంపై ఉత్కంఠ

అధ్యక్ష పదవికి ఎన్నికల సమయం దగ్గర పడిన తరుణంలో గెలుపు ఎవరిదన్న అంశంపై ఉత్కంఠతోపాటు ఊహాగానాలూ పెరిగాయి. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నే విజయం వరిస్తుందని జోతిష్కులు చెబుతుంటే.. గత 40 ఏళ్లుగా గెలుపుఓటములను కచ్చితంగా అంచనా వేస్తున్న అమెరికా ప్రొఫెసర్ అలన్ లిచ్ట్మాన్ మాత్రం గెలుపు జో బైడెన్‌దే అని కొన్ని నెలల క్రితమే ప్రకటించారు. కాగా.. గెలుపు ఓటములపై జ్యోతిష్కులు, ప్రొఫెసర్ చెప్పిన మాటల్లో ఏవి నిజం అవుతాయో తెలియాలంటే ఫలితాలు వెల్లడయ్యే వరకు వేచి చూడాల్సిందే. 



Updated Date - 2020-10-30T21:57:20+05:30 IST