Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 17 Aug 2022 23:02:01 IST

ఉపాధ్యాయుల కొరత తీరేదెన్నడు?

twitter-iconwatsapp-iconfb-icon
ఉపాధ్యాయుల కొరత తీరేదెన్నడు?లోగో

- జిల్లాలో 200 ఖాళీలు 

- ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య 

- రెన్యూవల్‌కు నోచుకోని విద్యావలంటీర్లు 

సర్కారు బడుల వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం ప్రభుత్వ పాఠ శాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకం చేపట్టకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 

కాసిపేట, ఆగస్టు 17: మంచిర్యాల జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠ శాలల్లో సరిపడా ఉపాధ్యాయులు లేక నాణ్యమైన విద్యా ప్రమాణాలు కొరవడుతున్నాయి. ఏడేళ్లుగా శాశ్వత ఉపాధ్యాయ పోస్టులు భర్తీ లేకపో వడంతో పాఠశాలల్లో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. ఒక్కో ఉపాధ్యాయుడు అదనపు సబ్జెక్టులు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు చెబు తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో  ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో ప్రత్యామ్నాయంగా విద్యావలంటీర్లను ఎంపిక చేయాల్సి ఉన్నా ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదం డ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

- జిల్లాలో 40,160 మంది విద్యార్థులు..

మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లో మొత్తం 40,160 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 510 ప్రాథమిక పాఠశాలలు ఉండగా 17,616 మంది విద్యార్థులు చదువుతున్నారు. అలాగే 96 యుపీఎస్‌ పాఠశాలల్లో 6,357 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 108 ఉన్నతపాఠశాలల్లో 16,187 మంది విద్యార్థులు చదువుతున్నారు.  ఆయా పాఠశాలల్లో 2,387 మంది టీచర్లు ఉన్నారు. కాగా సుమారు జిల్లాలో 200 ఉపాధ్యా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన ఏడేండ్లలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం లేదు. ఉన్నవారితోనే  నెట్టుకురావడం వల్ల ఉపాధ్యాయులపై అదనపు భారం పడుతుంది. జిల్లాలో 201 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. వీరికి మండల, జిల్లా స్థాయిలో సమావేశాలు ఉంటే ఈ బడులకు సెలవు ప్రకటించాల్సిందే. ఇటీవల మండలంలో తొలిమెట్టు కార్యక్రమం నిర్వహించగా ఇందులో ఉపాధ్యాయులు పాల్గొనడంతో సగానికి పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు తెరుచుకోక పోవడం గమనార్హం. 

- నత్తనడకన తరగతి గదుల నిర్మాణం..

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనను మెరుగు పర్చి అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం ప్రభుత్వం మన ఊరు- మన బడి పథకంలో భాగంగా చేపట్టిన పనులు నత్త నడకన సాగుతున్నాయి. బెల్లంపల్లి మండలం తాల్లగురిజాల ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్న త పాఠశాలలో విలీనం చేశారు. దీంతో ఐదు తరగతులను ఒకే తరగతిలో కూర్చోబెట్టడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పాఠశాలల్లో స్వచ్ఛభారత్‌లో నిర్మించిన మరుగుదొడ్లకు నీటి సరఫరా లేకపోవడంతో విద్యార్థులు ఒంటికి, రెంటికి ఇప్పటికి ఇండ్లలోకే వెళ్తున్నారు.

- మూడు నెలలు గడుస్తున్నా..

ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా విద్యావలంటీర్లను రెన్యూవల్‌ చేయడం లేదు.  కరోనా సమయంలో రెం డేళ్లు విద్యావలంటీర్లను విధుల నుంచి తప్పించారు. కాగా ఈ యేడాది ఇబ్బందులు లేకున్నా వారిని విధుల్లోకి తీసుకోవడం లేదు. ప్రభుత్వం ఉపాధ్యాయులు లేని చోట్ల విద్యావలంటీర్లను నియమించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

-విద్యావలంటీర్లను రెన్యూవల్‌ చేయాలి

 -సంతోష్‌, విద్యావలంటీర్‌, కాసిపేట 

ప్రభుత్వం విద్యావలంటీర్లను రెన్యూవల్‌ చేయకపోవడంతో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాను. ఉన్నత విద్యను చదివిన నేను ఇతర పనులకు వెళ్లలేకపోతున్నారు. ప్రభుత్వం  ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసేంత వరకు విద్యావలంటీర్లను నియమించాలి. 

ఉపాధ్యాయులపై అదనపు భారం

 - బండ శాంకరి, పీఆర్‌టీయూ జిల్లా గౌరవాధ్యక్షురాలు

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు లేక పోవడంతో రెండు సబ్జెక్టులను బోధించాల్సి వస్తుంది. దీంతో ఉపాధ్యా యులపై అదనపు భారం పడడమే కాకుండా విద్యార్థులకు సబ్జెక్టుపై నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నారు.  ప్రభుత్వం ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. 

 ఖాళీలపై ప్రభుత్వానికి నివేదికలు అందించాం 

- వెంకటేశ్వర్లు, డీఈవో 

జిల్లాలోని ఆయా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులపై ప్రభుత్వానికి నివేది కలు అందజేశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో విద్యావలంటీర్ల నియామకాలను చేపడుతాం. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.