బీజేపీలోకి వెళ్లేదెవరు ?

ABN , First Publish Date - 2022-08-13T05:23:58+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేడిని రాజేస్తున్న బీజేపీ ఎత్తులు జిల్లాలో కూడా కాక పుట్టిస్తున్నాయి.

బీజేపీలోకి వెళ్లేదెవరు ?

- నియోజకవర్గాల్లో జోరుగా చర్చలు 

- ఈనెల 21న, 26న జరిగే సభల్లో చేరికలపై ఊహాగానాలు 

- రహస్యమంతనాల్లో ఈటల ఉన్నారంటూ ప్రచారం 


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)


రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేడిని రాజేస్తున్న బీజేపీ ఎత్తులు జిల్లాలో కూడా కాక పుట్టిస్తున్నాయి. ఈ నెల 21న మునుగోడులో జరిగే భారీ బహిరంగసభలో కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా పాల్గొంటారని ఆ సభలో భారీ చేరికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన బండి సంజయ్‌కుమార్‌ ఉండడం అలాగే జిల్లాకే చెందిన శాసనసభ్యుడు ఈటల రాజేందర్‌ బీజేపీ చేరికల కమిటీకి నాయకత్వం వహిస్తుండడంతో బీజేపీలో జరిగే ప్రతి పరిణామంలో వీరు కీలక వ్యక్తులవుతూ జిల్లాలో చర్చల్లోకి వస్తున్నారు. ఈటల రాజేందర్‌ చేరికల కమిటీ బాధ్యతలు తీసుకున్న తర్వాత జరుగుతున్న మొదటి కీలక సమావేశం ఇదే కావడం, అమిత్‌షా సమక్షంలో పలువురిని పార్టీలో చేర్పించడంపై ఈటల ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలుస్త్తున్నది. ఈ చేరికల్లోనే కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు నియోజకవర్గాలకు చెందిన నాయకులు ఎనమిది మంది వరకు ఉంటారని చర్చ జరుగుతోంది. అయితే పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం 21న కొందరు రాష్ట్రస్థాయి నాయకులు, అలాగే మునుగోడు నియోజకవర్గానికి, నల్గొండ జిల్లాకు చెందిన నాయకుల చేరికలు మాత్రమే ఉంటాయని తెలుస్తున్నది. బండి సంజయ్‌కుమార్‌ ప్రజాసంగ్రామ యాత్ర మూడవ విడతకు ముగింపు సభ వరంగల్‌లో జరుగనుండడం దానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని, ఈ సభలో పెద్ద ఎత్తున చేరికలను పెడితే బాగుంటుందని కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అమిత్‌షా పాల్గొంటున్న సభ ఎలాగు విజయవంతమవుతుందని, ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ కూడా భారీ ఎత్తున విజయవంతం చేస్తే వరంగల్‌ జిల్లా రాజకీయాల్లో కూడా ప్రభావం చూపవచ్చని భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే నడ్డాను ఈ సమావేశానికి రప్పించడం పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించడంపై దృష్టిసారించారని చెబుతున్నారు. 


చేరికలపై ఈటల దృష్టి


మూడు రోజులుగా హైదరాబాద్‌లో, అలాగే తన నియోజకవర్గమైన హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ అందుబాటులో లేక పోవడం ఆయన కోసం ఆరా తీసిన వారికి ఢిల్లీ వెళ్లారనే సమాచారం మాత్రమే లభించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈటల రహస్య భేటీలు ఏర్పాటు చేస్తూ చేరికలపై దృష్టిసారించడంతోనే ఎవరికి అందుబాటులో లేకుండా ఉన్నారని పార్టీవర్గాలు అనుకుంటున్నాయి. ఆయన కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన నేతలను ప్రస్తుతం ఏ రాజకీయాల్లో లేకున్నా రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన వ్యక్తులను కలుస్తూ వారిని రహస్య భేటీలకు రప్పించుకుంటూ చర్చలు చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. ఇదే నేపథ్యంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు నియోజకవర్గాల్లో పార్టీలో చేరనున్న నాయకుల పేర్లు చర్చల్లో నానుతున్నాయి. వారంతా బీజేపీలో చేరతారో లేదో కానీ సోషల్‌ మీడియాలో  కథనాలు రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి. 


అసంతృప్త నేతలపై ప్రచారం


కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హుస్నాబాద్‌ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డిని పార్టీలో చేర్పించడం ఆ నియోజకవర్గంలో పెద్ద రాజకీయ కుదుపునకు కారణమవుతున్నది. ఆ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జీగా ఉన్న బొమ్మ శ్రీరాంచక్రవర్తి ప్రవీణ్‌రెడ్డి చేరికను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆయన తన నియోజకవర్గ నాయకులతో, ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించిన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలిసి పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయన కూడా అందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని, ఈ నెల 21న కానీ 26న కానీ శ్రీరాంచక్రవర్తి బీజేపీలో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతున్నది. అలాగే అదే హుస్నాబాద్‌ నియోజకవర్గానికి చెందిన కర్ణకంటి మంజులారెడ్డి, జె.సురేందర్‌రెడ్డి కూడా బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న కెకె మహేందర్‌రెడ్డి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పాదయాత్ర తన నియోజకవర్గ పరిధిలో ప్రారంభమైనా దానిలో పాల్గొనకుండా దూరంగా ఉండడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. పొన్నం ప్రభాకర్‌ వైఖరికి వ్యతిరేకంగా ఉంటూ వస్తున్న ఆయన కూడా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనకు సిరిసిల్ల కాంగ్రెస్‌ టికెట్‌ను రేవంత్‌రెడ్డి ఎప్పుడో ఖరారు చేశారనే ప్రచారం కూడా అదే స్థాయిలో ఉంది. అయితే కెకె మహేందర్‌రెడ్డి మాత్రం మీడియాలో వస్తున్న కథనాలను ఖండించక పోవడంతో రోజురోజుకు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. మానకొండూర్‌ నియోజకవర్గంలో కూడా అదే రకమైన పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, విప్‌ ఆరెపల్లి మోహన్‌ టీఆర్‌ఎస్‌లో తనకు ప్రాధాన్యత లేక పోవడం పట్ల కినక వహించి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారని, లేదు కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ ప్రచార నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీ రామారావు ఆయనను పిలిపించి పార్టీలో మీకు సముచిత స్థానం లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే మోహన్‌ మాత్రం టీఆర్‌ఎస్‌లో ఉండే విషయంలో కానీ పార్టీ వీడి బీజేపీ, కాంగ్రెస్‌లో చేరే విషయంలోగానీ ఏ ప్రకటన చేయకుండా గుంబనంగా ఉంటున్నారు. ఈయన కూడా అమిత్‌షా సభలోగానీ, నడ్డా సభలోగానీ పాల్గొంటారనే ప్రచారం బీజేపీలో జోరుగా సాగుతోంది. ఇదే నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ మరో సీనియర్‌ నాయకుడు కూడా బీజేపీలో చేరతారని, ఆయన ఇప్పటికే ఈ విషయంలో ఈటలతో చర్చలు జరిపారని చెబుతున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడు బిరుదు రాజమల్లు, మాజీ సర్పంచు వేముల రామ్మూర్తి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గొట్టెముక్కుల సురేశ్‌రెడ్డి, జడ్పీటీసీ గంటా రాములు, మాజీ చైర్మన్‌ ఎల్‌.రాజయ్య కూడా బీజేపీలో చేరుతారని నియోజకవర్గంలో ప్రచారంలో ఉంది. ఇలాగే ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నాయకులు పలువురు బీజేపీవైపు చూస్తున్నారని త్వరలోనే వారు ఒక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. 


Updated Date - 2022-08-13T05:23:58+05:30 IST