గోవా పీఠం దక్కేదెవరికి?

ABN , First Publish Date - 2022-02-13T07:31:56+05:30 IST

ఒకవైపు కరోనా నిబంధనలు.. మరోవైపు.. ఎన్నికల హడావుడి. తీరప్రాంత పర్యాటక

గోవా పీఠం దక్కేదెవరికి?

  • రెండోసారిపై బీజేపీ ఆశలు..
  • పరువు కోసం కాంగ్రెస్‌ పాకులాట
  • హోరెత్తిన ఆన్‌లైన్‌ ప్రచారం
  • 40 స్థానాలకు రేపు ఎన్నికలు


ఒకవైపు కరోనా నిబంధనలు.. మరోవైపు.. ఎన్నికల హడావుడి. తీరప్రాంత పర్యాటక రాష్ట్రం గోవాలో ఎటు చూసినా.. ఇదే వాతావరణం. మొత్తం 40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి సోమవారం(14వ తేదీ) ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీజేపీ సహా అన్ని పార్టీల నుంచి మొత్తం 332 మంది అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్న ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుంది? ఎవరు పాలనా పగ్గాలు దక్కించుకుంటారు? అనే చర్చ జోరుగా సాగుతోంది. అన్ని ప్రధాన పార్టీల నుంచి అగ్ర నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. వర్చువల్‌ ర్యాలీలు నిర్వహించారు.


కరోనా నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం విధించిన ఆంక్షలను పాటిస్తూనే ప్రచారాన్ని హోరెత్తించారు. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలు.. బహిరంగ సభలు నిర్వహించి.. ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేశారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాహుల్‌గాంధీ, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ప్రచారంలో పాల్గొన్నారు. ఇక, ఆమ్‌ఆద్మీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు కూడా గోవాలో జోరు పెంచాయి. ఈ రెండు పార్టీల తరఫున అగ్రనేతలు.. ప్రచారాన్ని హోరెత్తించారు. 


కాంగ్రె్‌సకు ఇదే లోటు!

కాంగ్రెస్‌ మినహా ఇతర పార్టీలు తమతమ ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ తరఫున ప్రస్తుత సీఎం ప్రమోద్‌సావంత్‌నే తిరిగి ముఖ్యమంత్రిని చేస్తామని ఆ పార్టీ ప్రకటించగా, ఆప్‌ తరఫున అమిత్‌ పాలేకర్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. అయితే, కాంగ్రెస్‌ మాత్రం ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది.


ఇక, అభ్యర్థుల పరంగా చూస్తే.. బీజేపీ తరఫున ప్రస్తుత సీఎం సావంత్‌ సహా మంత్రులు చంద్రకాంత్‌ కవలేకర్‌, మనోహర్‌ అజ్‌గోంకర్‌, నీలేష్‌ జావోకాబ్రెల్‌, విశ్వజిత్‌ రాణే సతీమణి దివ్య రాణే గట్టిపోటీ ఇస్తున్నారు. ఇక, బీజేపీ మాజీ నేత, దివంగత మనోహర్‌ పర్రీకర్‌ కుమారుడు ఉత్పల్‌పర్రీకర్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆప్‌ తరఫున అమిత్‌ పాలేకర్‌, దెలిలాహ్‌ లాబో, విజయ్‌ సర్దేశాయ్‌ వంటివారు ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 


ప్రచార హోరు

ఇన్‌డోర్‌, ఔట్‌డోర్‌, సోషల్‌ మీడియా ఇలా అందివచ్చిన అన్ని అవకాశాలను పార్టీలు సద్వినియోగం చేసుకున్నాయి. వీటిలో కంప్యూటర్‌ క్యాంపెయినింగ్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే, కాంగ్రెస్‌ మాత్రం సంప్రదాయ ప్రచారానికే పరిమితమైంది. మరోవైపు, ఆప్‌ ఇక్కడ తొలిసారి కుల రాజకీయాలకు తెరదీసింది. వాస్తవానికి గోవాలో కుల రాజకీయాలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. అయితే.. ఇప్పుడు తీర ప్రాంత జిల్లాల్లో ప్రభావవంతమైన ‘భండారీ’ సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకొనేందుకు ఆప్‌ ప్రయత్నించింది. ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ లాయర్‌ అమిత్‌ పాలేకర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది.  


మాటల తూటాలు

ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇటీవల పర్యటించిన ప్రధాని మోదీ.. గోవాకు స్వాతంత్య్రం వచ్చేందుకు 15 ఏళ్లు ఆలస్యమైందని, ఇదంతా నెహ్రూ నిర్వాకమేనని దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రె్‌సను ఆత్మరక్షణలో పడేశాయి. దీనిపై స్పందించిన రాహుల్‌.. మోదీకి చరిత్ర అర్ధంకాలేదని, బీజేపీప్రభుత్వ   వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారన్నారు. ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌.. ప్రధాని కోసం హెలిప్యాడ్‌ను 24 గంటల్లో నిర్మించారని..  ప్రజల కోసం ఒక బస్‌ స్టాప్‌ను నిర్మించేందుకు 20 ఏళ్లు పట్టిందని విమర్శించారు. 



25% మంది క్రిస్టియన్లకు బీజేపీ టికెట్లు

పర్యాటక రాష్ట్రం గోవాలో 25% మంది ప్రజలు క్రిస్టియానిటీని అనుసరిస్తున్నారు. తిరిగి అధికారం దక్కించుకోవాలంటే.. వీరిని తమవైపు తిప్పుకోవడం తప్పదని భావించిన బీజేపీ అగ్రనేతలు.. మొత్తం అభ్యర్థుల్లో 25% మంది క్రిస్టియన్లకు టికెట్‌లు ఇచ్చింది. మరోవైపు... కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ఘోర పరాజయం పాలైన కాంగ్రె్‌సకు పరువు నిలబెట్టుకోవడంతోపాటు, గోవాలో అధికారంలోకి రావాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి బలమైన నాయకుడిగా ఉన్న మైఖేల్‌ లాబో కాంగ్రె్‌సలో చేరడంతో గెలుపు ఖాయమని కాంగ్రెస్‌ భావిస్తోంది. మరోవైపు.. టీఎంసీ, ఆప్‌లు కూడా హోరా హోరీ ప్రచారం చేయడంతో గెలుపు అవకాశాలపై బీజేపీ, కాంగ్రె్‌సలు తర్జనభర్జన పడుతున్నాయి.    - సెంట్రల్‌ డెస్క్‌


ఎన్నికల ముఖచిత్రం ఇదీ

14వ తేదీన గోవా ఎన్నికల పోలింగ్‌

ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌

చివరి గంట కరోనా బాధితులకు కేటాయింపు

మొత్తం 40 నియోజకవర్గాలు, 11.6 లక్షల మంది ఓటర్లు


Updated Date - 2022-02-13T07:31:56+05:30 IST