లక్షా 50 వేల మెజార్టీతో జయలలిత గెలిచిన చోట.. ఇప్పుడు పాగా వేసేదెవరంటే..!

ABN , First Publish Date - 2021-05-02T17:18:11+05:30 IST

తమిళనాడులోని డాక్టర్ రాధాకృష్ణన్ నగర్‌కు చాలా ప్రాధాన్యం ఉంది

లక్షా 50 వేల మెజార్టీతో జయలలిత గెలిచిన చోట.. ఇప్పుడు పాగా వేసేదెవరంటే..!

చెన్నై : తమిళనాడులోని డాక్టర్ రాధాకృష్ణన్ నగర్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే మాజీ అధినేత్రి జయలలిత ఇక్కడి నుంచి రెండుసార్లు గెలిచారు. ఆమె మరణానంతరం ఈ నియోజకవర్గం నుంచి ప్రముఖ నేత టీటీవీ దినకరన్ విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా ఆర్ఎస్ రాజేశ్ పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థులుగా జేజే ఎబెనేజర్ (డీఎంకే), డాక్టర్ పీ కాళిదాస్ (ఏఎంఎంకే), ఫాజిల్ (ఎంఎన్ఎం), కే గౌరీశంకర్ (ఎన్‌టీకే) పోటీ చేస్తున్నారు. 


డాక్టర్ ఆర్‌కే నగర్ శాసన సభ నియోజకవర్గంలో మొత్తం 2,62,738 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,26,744 మంది కాగా, మహిళలు 1,35,889 మంది. ట్రాన్స్‌జెండర్లు 105 మంది ఉన్నారు. 


2011 శాసన సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే అభ్యర్థి జే జయలలిత ఈ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. ఆమె ప్రత్యర్థి, సీపీఐ నేత సీ మహేంద్రన్‌కు కేవలం 9,710 ఓట్లు మాత్రమే లభించగా, ఆమెకు 1,60,432 ఓట్లు లభించాయి. ఆ ఎన్నికల్లో జయలలిత ఒక లక్షా 50వేల 722 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. 2016లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి జయలలిత తన సమీప ప్రత్యర్థి వాసంతి దేవిపై దాదాపు 40 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 


జయలలిత మరణానంతరం డాక్టర్ రాధాకృష్ణన్ నగర్‌ నియోజకవర్గానికి 2017లో జరిగిన ఉప ఎన్నికల్లో జయలలిత స్నేహితురాలు శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన ఏఐఏడీఎంకే అభ్యర్థి మధుసూదనన్‌ను ఓడించారు. 


ఈ నియోజకవర్గానికి 2021 ఏప్రిల్ 6న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఏఐఏడీఎంకేకు చెందిన ఆర్ఎస్ రాజేశ్, ప్రతిపక్ష డీఎంకేకు చెందిన జేజే ఎబెనేజర్, ఎంఎన్ఎం అభ్యర్థి ఫాజిల్, ఎన్‌టీకే తరపున గౌరీశంకర్, ఏఎంఎంకే తరపున డాక్టర్ పీ కాళిదాస్ పోటీ చేస్తున్నారు. కొందరు స్వతంత్రులు కూడా పోటీలో ఉన్నారు. 


ఆదివారం ఉదయం 11.45 గంటలకు అందిన సమాచారం ప్రకారం, ఈ నియోజకవర్గంలో డీఎంకే ముందంజలో కనిపిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి ఎబెనెజెర్‌కు 3,527 ఓట్లు లభించగా, ఆర్ఎస్ రాజేశ్ (ఏఏఐడీఎంకే)కు 2,133 ఓట్లు లభించాయి. 




Updated Date - 2021-05-02T17:18:11+05:30 IST