గులాబీ టికెట్‌ ఎవరికో?

ABN , First Publish Date - 2022-08-04T10:20:26+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

గులాబీ టికెట్‌ ఎవరికో?

  • ఉప ఎన్నిక ఇన్‌చార్జి బాధ్యత ఎవరికిస్తారో!
  • మునుగోడు ఉప ఎన్నికపై టీఆర్‌ఎస్‌లో చర్చ
  • 7న టీఆర్‌ఎ్‌సకు రాజీనామా
  • కార్యకర్తల సమావేశంలో ఎర్రబెల్లి ప్రదీ్‌పరావు 
  • సీఎం కేసీఆర్‌ను కలిసిన ఇద్దరు ఆశావహులు
  • పద్మశాలి వర్గానికి ఇవ్వాలన్న కర్నాటి 
  • సోదరుడి కోసం ఎమ్మెల్యే కంచర్ల ప్రయత్నం
  • అచితూచి ఎంపిక చేసే యోచనలో అధినేత


హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. హుజూరాబాద్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌.. అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఇద్దరు నేతలు సీఎంను కలిశారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే, 2018 ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ, కేసీఆర్‌ వారికి ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరు కూడా ప్రచారంలోకి వచ్చినా.. ఆయన ఇంకా కేసీఆర్‌ను కలవలేదు. కానీ, పార్టీ నేతలతో మాత్రం పోటీకి సుముఖమేనని చెబుతున్నారు. అయితే మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 40 వేల ఓట్లు పద్మశాలి సామాజికవర్గానికి చెందినవారివే ఉన్నాయని, ప్రస్తుతం రాష్ట్రంలో ఆ వర్గం వారెవరూ ఎమ్మెల్యేగా లేనందున ఇప్పుడు అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎ్‌సకు చెందిన మరో నేత కర్నాటి విద్యాసాగర్‌ కోరుతున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ నెల 7న చేనేత దినోత్సవం సందర్భంగా 100 మందికి ఆటోమేటిక్‌ నూలు వడికే యంత్రాలు ఇచ్చేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. వీటి విలువే దాదాపు రూ.కోటి ఉంటుందని అంచనా. ఇక మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ పేరు కూడా తెరపైకి వచ్చినా.. ఆయన స్థానికుడు కాదన్న వాదన ఉంది. అయితే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ఇచ్చి, అది ఆమోదం పొందాక మాత్రమే టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని నిర్ణయించే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఈ నియోజకవర్గానికి అధికార పార్టీ తరఫున ఎన్నికల ఇన్‌చార్జిగా ఎవరిని నియమిస్తారన్న దానిపైనా చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నా.. పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. 


ఉమ్మడి నల్లగొండలో టీఆర్‌ఎస్‌ మంచి రికార్డు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రె్‌సకు గట్టి పట్టున్నా.. ఉప ఎన్నికల్లో మాత్రం టీఆర్‌ఎస్‌ విజయాలు సాధిస్తూ వస్తోంది. 2018 సాధారణ ఎన్నికల తరువాత నాలుగేళ్లలో రాష్ట్రంలో నాలుగు ఉప ఎన్నికలు జరగగా.. రెండు చోట్ల ఓటమిపాలైన టీఆర్‌ఎస్‌ మరో రెండు చోట్ల విజయాలు దక్కించుకుంది. ఈ రెండు విజయాలూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే కావడం గమనార్హం. దుబ్బాక ఉప ఎన్నికలో గట్టిపోటీ మధ్య ఓడగా, హుజూరాబాద్‌లో అధికార యంత్రాంగం మొత్తం మోహరించినా, అనేక హామీలిచ్చినా, దళిత బంధుకింద ఏకంగా కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామన్నా ఓటమి తప్పలేదు. కానీ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన రెండు ఉప ఎన్నికలు హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌లో మాత్రం కారు దూసుకెళ్లింది. ఇప్పుడు మళ్లీ అదే జిల్లాలోని మునుగోడులో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఈసారి కూడా తామే విజయం సాధిస్తామనే విశ్వాసం టీఆర్‌ఎ్‌సలో కనిపిస్తోంది. పైగా ఈ జిల్లాలో బీజేపీకి అంత బలం లేదని,  హుజూరాబాద్‌ ఎన్నికల్లో వచ్చినంత మద్దతు మునుగోడులో ఆ పార్టీకి రాదనే ఉద్దేశంతో ఉంది. అయితే హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ మాత్రమే ఉంది. బీజేపీ కూడా బరిలో ఉన్నా.. ముక్కోణపు పోటీ లేదు. అయితే ఈసారి బీజేపీ బలంగా బరిలో ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ సాధిస్తుందా? లేక బీజేపీ మరో గెలుపును సొంతం చేసుకుంటుందా? అన్నది చూడాల్సి ఉంది.

Updated Date - 2022-08-04T10:20:26+05:30 IST