దక్షిణ భారత్‌లో తొలి రాజవంశీయులు ఎవరు? పోటీ పరీక్షల ప్రత్యేకం!

ABN , First Publish Date - 2022-06-25T20:54:19+05:30 IST

శాతవాహనులు ప్రాకృత, సంస్కృత భాషలే కాకుండా పైశాచిక(దేశీ) భాషను కూడా ఆదరించి పోషించారు. వీరి రాజభాష ప్రాకృతం. వీరి శాసనాలన్నీ ప్రాకృత భాషలోనే ఉన్నాయి..

దక్షిణ భారత్‌లో తొలి రాజవంశీయులు ఎవరు? పోటీ పరీక్షల ప్రత్యేకం!

శాతవాహనులు ప్రాకృత, సంస్కృత భాషలే కాకుండా పైశాచిక(దేశీ) భాషను కూడా ఆదరించి పోషించారు. వీరి రాజభాష ప్రాకృతం. వీరి శాసనాలన్నీ ప్రాకృత భాషలోనే ఉన్నాయి.  అశోకుని కాలం నాటికే శాసనాలు ఉన్నాయి. వీటిని జేమ్స్‌ ప్రిన్సెస్‌(జర్మనీ), కెప్టెన్‌ నొర్రీస్‌(ఇంగ్లాండ్‌) తొలిసారి గుర్తించారు. 


ప్రాకృత భాష

  • దక్షిణ భారతదేశంలో తమిళం తరవాత అత్యంత పురాతనమైన భాష ప్రాకృతం. ఇది మరాఠ, కన్నడ, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో వ్యాప్తిలో ఉండేది. ఇది ఉజ్జయిని(మధ్యప్రదేశ్‌), గుజరాత్‌ వరకూ వాడుకలో ఉంది.
  • బౌద్దులు ‘మదనగోష్టి’ సభల ద్వారా ఉత్తర భారతంలో పాళీ భాషను, దక్షిణాది ప్రాంతాల్లో ప్రాకృత భాషను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. అశోకుని 13వ శిలాశాసనంలో అప్పటికే దక్షిణంలో అనేక భాషలున్నాయని రాశాడు. ‘కథావత్తు’ అనే బౌద్ద సాహిత్యంలో ప్రాకృత భాష ప్రాముఖ్యాన్ని రాశారు. దక్షిణానికి వచ్చిన మహాదేవ భిక్షువు(బౌద్ద ధర్మ ప్రచారంలోని 18 మంది మంత్రులలో ఒకరు) కూడా ప్రాకృత భాషను అనర్గళంగా మాట్లాడేవారని శ్రీలంకలోని సువణ్ణమలకి(అనురాధపురంలో నిర్మించిన బౌద్ద స్థూపం)లో రాసి ఉంది. మహాదేవ భిక్షువు అనురాధపుర స్థూప ఆవిష్కరణకు పల్లవ బొగ్గ నుంచి అనేక వేలమంది బౌద్ద భిక్షువులతో కలసి హాజరయ్యారు. పల్లవ బొగ్గ అంటే నేటి గుంటూరు జిల్లా పలనాడు. తరవాత కాలంలో ప్రాకృత భాషను ఈ ప్రాంతంలో కుబ్జీరకుడు విరివిగా ఉపయోగించాడు. విద్యార్థుల్లో ధర్మాసక్తిని కల్గించాలంటే వారి మాతృభాషలోనే ఉద్బోధించాలని అశోకుని ఎర్రగుడి (కర్నూల్‌) శాసనంలో ఉంది. 
  • కానీ నేడు పాశ్చాత్య ప్రభావంతో అందరూ ఆంగ్లంలోనే మాట్లాడడం, రాయడం నాగరికతగా భావించి దానినే ప్రచారం చేస్తున్నారు. నేటి ప్రధాని నరేంద్ర మోది, న్యాయస్థానాలు వెలువరించే ప్రతి తీర్పు కాపీలను ఆయా భాషల్లోనే అందించాలని చట్టం చేయడం సాహసోపేతమైన నిర్ణయంగా భావించాలి. తీర్పుల సారాంశం మాతృ భాషలో రావడం వల్ల ప్రజలకు న్యాయ సంబంధిత విషయాలు అవగతమౌతాయి.
  • అశోకుడు క్రీపూ మూడో శతాబ్దంలోనే మాతృభాషల్లో, ప్రజల వాడుక భాషల్లో శాసనాలు లిఖించాడు. మాతృభాషల్లోనే విద్యాభ్యాసం జరగాలనీ చట్టం చేసిన తొలి రాష్ట్రం హైదరాబాద్‌. 
  • శాతవాహనులు కూడా ప్రజల వాడుక భాషనే రాజభాషగా ప్రకటించారు. ఆ భాషే ప్రాకృతం. కానీ రాజులు అంతఃపురాల్లో మాత్రం సంస్కృతం మాట్లాడేవారు. 

సంస్కృతం - శర్వవర్మ వ్యాకరణం

హాలుని చివరి పరిపాలన కాలంలో సంస్కృతం వ్యాప్తిలోకి వచ్చింది. హాలుని ఆస్థాన కవి ‘శర్వవర్మ’ సంస్కృతంలో ‘కాతంత్ర వ్యాకరణం’ అనే గ్రంథాన్ని రాశాడు. ‘వాత్సాయన కామ సూత్రాలు’ ఈ కాలం నాటివే. ఈ గ్రంథంలో కుంతల శాతకర్ణి ప్రస్తావన ఉంది. కుంతల శాతకర్ణి తన భార్య మలయవతితో మోటుగా శృంగారం చేస్తుండగా ఆమె మరణించిందని వాత్సాయనుడు పేర్కొన్నాడు. ‘కరిర్త’ అనే రతి భంగిమ ప్రక్రియలో ఆమె మరణించినట్లు గ్రంథంలో ఉంది.


విద్యావ్యాప్తి - గురుకులాల పాత్ర

శాతవాహనులు అనేక గురుకులాలు స్థాపించి విద్యావ్యాప్తికి తోడ్పడ్డారు. గురుకులాల్లో వ్యాకరణం, రాజకీయం, తత్త్వం, తర్కం, గణితం, సంగీత విద్యలు నేర్పేవారు. విద్యార్థులకు పూర్తి స్వేచ్చ ఉండేది. రాజులు కూడా తమ పిల్లలను విద్యాభ్యాసం కోసం గురుకులాలకు పంపేవారు. గురువులకు ఎటువంటి ఒత్తిడి, శ్రమ ఉండేవి కావు. కానీ నేటి గురుకులాల్లో గురువులకు శారీరక శ్రమతోపాటు మానసిక శ్రమ అధికమై అనేక ఒత్తిడుల మధ్య ఆరోగ్యకరమైన విద్యను అందించలేకపోతున్నారు.   


బౌద్ద సాహిత్య రచనలు - ఆచార్య నాగార్జున పాత్ర

  • ఈ కాలంలో ఆచార్య నాగార్జునుడు గొప్ప తాత్వికుడిగా రెండో తథాగతుడిగా పేరు పొంది పాశ్చాత్యులచే భారతీయ ఐన్‌స్టీన్‌గా పిలిపించుకొన్నాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి ఇతనికి ఆరామాన్ని పరిశోధనాలయంగా, విద్యాలయంగా ఇచ్చాడు. ఇతడు ప్రాజ్ఞాపారమితం, సృహుల్లేఖనం, మాద్యమిక సూత్రాలు వంటి 24 గ్రంథాలు రాశాడు. మాద్యమిక వాదానికి ఆకుతోభయం పేరుతో వ్యాఖ్యానాలు రాశాడు. సృహుల్లేఖనంలోని అంశాలు పిల్లలచే కంఠస్థం చేయించేవారని చైనా యాత్రికుడు ఇత్సింగ్‌ పేర్కొన్నాడు. ఇతని శిష్యుడు ఆర్య దేవుడు చిత్తశుద్ది ప్రకరణం రాశాడు. 
  • జైన గ్రంథాలు: కొరడకుండనాచార్య, సమయసారం, నియమసారం గ్రంథాలు రాశాడు.
  • శాతవాహనులు తమ సాహిత్య సేవతో గుప్తులకు స్వర్ణయుగ పునాదులు వేశారు. ఈ కాలంలో వచ్చిన శబ్ద, అర్థ, రూప, గణక, లేఖక, విధి, వ్యవహారం, గాంధర్వ విద్యలు, క్షత్రియ విద్యలు మొదలైనవాటిని గుప్తులు అనుసరించారు. రాజకీయ, సామాజిక రంగాల్లో వచ్చిన గ్రంథాలను  కూడా గుప్తులు అనుకరించారు. కామాందకుని ‘నీతిసారం’ గొప్ప ఉదాహరణ. 
  • వృత్తి శ్రేణులు, తమ వృత్తి విద్యలను వారి వారి పిల్లలకు నేర్పేవారు. విద్యాలయాలను, ఆశ్రమాలను రాజులు పోషించారు, ఆదరించారు. గుప్తుల కాలంలోనే నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. రాజాదరణ, ప్రజాదరణలతో విద్యావ్యాప్తి చేశారు. 


సాంస్కృతిక సేవ

  • అమరావతి శిల్పకళ అనేది భారతీయ శిల్పకళకే తలమానికం అని ఫెర్గూసన్‌ వ్యాఖ్యానించాడు. సాంచీ స్థూపానికి దక్షిణ ద్వారంపై ఆనందుడు అనే శిల్పి పేరు చెక్కి ఉంది. అజంత గుహలో పదోనెంబరు గుహ ముఖద్వారంపై ‘మురల్‌’ (కుడ్యై) చిత్రాలు అద్భుతంగా చెక్కారు. తొమ్మిదో నంబరు గుహలో నల్ల రాణులు, పదోనంబరు గుహలో తెల్ల ఏనుగును చిత్రీకరించారు. వీటి నకలు చెరిగిపోకుండా ‘కాన్వాస్‌’ క్లాత్‌పై పెయింటర్‌ చేత చివరి నిజాం చిత్రింపజేశారు. తరవాతి కాలంలో ఇవి అగ్నికి ఆహుతయ్యాయి. గుప్తులు వాస్తు శిల్పకళా రూపాల్లో శాతవాహనులను అనుసరించారు. నగర వాస్తు శైలి, మాండుసోర్‌ గొప్ప ఉదాహరణ. అజంతా, బాగ్‌ గుహల్లోని చిత్రాలను గమనిస్తే వారి అనుకరణ అర్థమౌతుంది. 
  • శాతవాహనుల వలె గుప్తులు కూడా వినోదప్రియులు. భోగలాలసతకు అలవాటు పడినవారే. నాటక సందర్శన, నాట్య ప్రదర్శన, సంగీత సాహిత్య పరిషత్‌ నిర్వహణ అనేవి రెండు కాలాల్లో సమానంగానే ఉన్నాయి. నాగార్జున కొండలో రోమన్స్‌ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణాలు చేశారు. గుప్తుల కాలానికి వచ్చేసరికి ఈ రంగం అభివృద్ది చెందింది. మెహరోలి ఇనుప స్థంభం, సుల్తాన్‌గంజ్‌లోని బుద్దుని విగ్రహాలు దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ విగ్రహం ఇంగ్లాండ్‌ మ్యూజియంలో  ఉంది. 
  • దక్షిణ భారతదేశంలో తొలి రాజవంశీయులు శాతవాహనులు. వీరి పాలనాంశాలు, సాంస్కృతిక పద్దతులను తరవాత కాలంలోని గుప్తుల పాలనలో గమనించవచ్చు. ఈ రెండు రాజ్యాలను ఆదర్శంగా తీసుకొని తెలుగు రాజ్యంలో తొలి స్వర్ణయుగ కర్తలైన కాకతీయుల రాజ్యంలో వీటిని మరల చూడవచ్చు.


ప్రాకృత భాష ప్రాధాన్యం

  • శాతవాహనుల శాసనాలు నానాఘాట్‌(దేవినాగానిక), నాసిక్‌ (గౌతమీ బాలాశ్రీ), మ్యాకదోని (మూడో పులోమావి) ఇలా అన్నీ ప్రాకృతంలోనే ఉన్నాయి. 13వ రాజు కుంతల శాతకర్ణి మాత్రమే  సంస్కృత భాషను ప్రోత్సహించినట్లు స్ట్రాబో రాశాడు. 17వ రాజు హాలుడు(కవి వత్సలుడు) గొప్ప కవి. ఇతడు ప్రాకృతంలో ‘గాథాసప్తశతి’ని రాశాడు. 
  • ఈ గ్రంథంలో 700 గ్రామీణ శృంగార కథలు రాశాడు. ఇది శృంగార, హాస్య, సాహస కథలతో కూడిన రమ్యమైన గ్రంథం. ఇది మరాఠ ప్రాంతీయ ప్రాకృతిలో ఉంది. శర్వ వర్మ, గుణాఢ్యుడు ఇతని ఆస్థాన కవులు. 
  • గుణాఢ్యుడు: ఇతనిని తెలంగాణ తొలి కవిగా చెప్పవచ్చు. మెదక్‌ జిల్లా వాసి. గొప్ప కవి. ఇతడు పైశాచీ ప్రాకృత భాషలో ఓ గ్రంథం రాశాడు. ఇందులో నరవాహనుడు అనే కథతోపాటు అనేక హాస్య కథలు, నైతిక విలువలతో కూడిన కథలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవి పూర్తిగా లభించడం లేదు. దీని ఆధారంగా వేములవాడ చాళుక్యుల కాలంలో సోమదేవసూరి ‘కథాసరిత్సాగరం’; ఆ తరవాత కాలంలో క్షేమేంద్రుడు ‘బృహత్‌కథామంజరి’; బుదస్వామి ‘బుదకథా శ్లోక సంగ్రహం’ రాశారు. ఈ మూడు గ్రంథాలు గుణాఢ్యుడి బృహత్కథ ప్రేరణతో వచ్చినవే. 
  • కుతూహలుడు: హాలుని ఆస్థానంలోని కవి. ఇతడు హాలుడు, లీలావతి (శ్రీలంక యువరాణి - దుట్టగామణి కుమార్తె)ల పరిణయాన్ని రచించాడు. వీరి ప్రణయగాథను ప్రాకృతంలో ‘లీలావతి పరిణయం’గా రాశాడు. వీరి వివాహం గోదావరి(సప్త గోదావరి) తీరంలో జరిగిందని ఇదే ఏడుపాయల జాతర జరిగే ప్రాంతమని, ఇది మెదక్‌లో ఉందని కొందరి వాదన. మరి కొందరు తూర్పుగోదావరిలోని ద్రాక్షారామంగా గుర్తించారు.
  • కవయుత్రులు: ఈ కాలంలో చాలామంది స్త్రీలు చక్కగా కవిత్వం చెప్పేవారని గాథాసప్తశతి చెబుతోంది. అణులక్ష్మి, రేవతి, అనుపమలబ్ద, మకరంద సేన అనే కవయిత్రులు ఉన్నట్లు తెలుస్తోంది. 

బౌద్ద విద్యాలయాలు

ఏ దేశంలో తొలిసారి విద్యను సామాన్యుల వద్దకు తీసుకువచ్చింది బౌద్దులే. విశ్వవిద్యాలయాలు స్థాపించి విద్యను ప్రచారం చేశారు. నాగార్జున కొండ గొప్ప విద్యాకేంద్రంగా గుర్తింపు పొందింది. రోమన్‌ ఇంజనీర్లచే నాగార్జున విద్యా కేంద్రంలో శబ్ద సాంకేతిక పద్ధతిలో నిర్మాణాలు చేశారు. విద్యార్థులకు విశాలమైన తరగతి గదులు, విశాలమైన మైదానాలు, క్రీడా కేంద్రాలు, అత్యంత విశాలమైన హాస్టల్‌ గదులు ఉండేవి.  


యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో మత్స్యపురాణాన్ని సంకలనం చేశారు. దీనికి సరైన ఆధారాలు లేవు.  


-డా. పగిడిమర్రి మురళి

చరిత్ర శాఖాధిపతి,

పీజీ కళాశాల, సికింద్రాబాద్‌



Updated Date - 2022-06-25T20:54:19+05:30 IST