`మగాడిగా బతకలేకపోతున్నా.. నన్ను మళ్లీ అలా మార్చేయండి..’

ABN , First Publish Date - 2021-06-17T22:55:45+05:30 IST

పాతికేళ్ల క్రితం ఆడ-మగ జననాంగాలతో (ఇంటర్‌సెక్స్ జెండర్) పుట్టిన ఓ బిడ్డను వైద్యులు సర్జరీలతో పూర్తి మగాడిలా మార్చేశారు.

`మగాడిగా బతకలేకపోతున్నా.. నన్ను మళ్లీ అలా మార్చేయండి..’

పాతికేళ్ల క్రితం ఆడ-మగ జననాంగాలతో (ఇంటర్‌సెక్స్ జెండర్) పుట్టిన ఓ బిడ్డను వైద్యులు సర్జరీలతో పూర్తి మగాడిలా మార్చేశారు. ఇన్నేళ్లూ పురుషుడిలా బతికిన ఆమె పాతికేళ్ల క్రితం తనను మగాడిలా మార్చిన వైద్యులపై పోరాటం ప్రారంభించింది. తన అనుమతి లేకుండా వైద్యులు క్రూరంగా ప్రవర్తించారని, తను ఓ పురుషుడిలా బతకలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తనను మళ్లీ యధాతథ స్థితికి మార్చేయాలని పోరాటం చేస్తోంది.


హవాయి స్టేట్‌ పూనాకి చెందిన 24 ఏళ్ల యోగా ఎక్స్‌పర్ట్‌ లూనా అనిమిషాకు పుట్టుకతోనే ఆడ, మగ జననాంగాలు ఉన్నాయి. అయితే డాక్టర్లు ఆ చిన్నారి జననాంగాన్ని కుట్టేసి, గర్భసంచిని తొలగించి మగాడిలా మార్చేశారు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ అతడిలో ఆమె బయటకు రాసాగింది. బలవంతంగా ఫుట్‌బాల్, రగ్బీ మైదానాల్లోకి తీసుకెళ్లినా.. తనకు బొమ్మలతో ఆడుకోవాలని ఉండేది. గౌన్లు వేసుకోవాలని ఉండేది. మగాళ్లతో కలిసి ఉంటున్నా వారు తన లాంటి వారు కాదని అనిపించేది. వయసు పెరిగిన కొద్ది తనకు జరిగిన దానిని లూనా అర్థం చేసుకుంది. తనకు మగాడు అనే గుర్తింపు వద్దనుకుంది. మహిళ వస్త్రధారణలోకి మారిపోయి `ఆమె` అని పిలిపించుకోవడం మొదలుపెట్టింది.




మగాడి గుర్తింపును వద్దనుకుంటున్న లూనా.. తిరిగి ఇంటర్ సెక్స్ జెండర్‌కు మారాలనుకుంటోంది. స్త్రీ జననాంగం, గర్భసంచిని తిరిగి సర్జరీ ద్వారా పొందాలనుకుంటోంది. హార్మోన్ థెరపీ ద్వారా ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లను శరీరంలోకి ఎక్కించుకుంటోంది. సర్జరీకి అవసరమైన 15 లక్షల డాలర్ల కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సమాజంలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొంటున్న ఇంటర్‌సెక్స్‌, ట్రాన్స్‌జెండర్‌ బాధితుల కోసం పోరాడాలని నిర్ణయించుకుంది. 


`తప్పు నా తల్లిదండ్రులదా? వైద్యులదా? అనేది అనవసరం. వారు చేసిన పని వల్ల ఇబ్బందిపడుతోంది నేను. నాకు `మగాడు` అనే గుర్తింపు వద్దు. ఇన్నేళ్లలో నేను ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాను. ఎవరితోనూ కలవలేకపోయాను. గుర్తింపు కోసం మానసిక క్షోభను అనుభవించాను. బొమ్మలతో ఆడుకోవాలని, గౌన్లు వేసుకోవాలనే కోరికల్ని అణచివేసుకున్నా. ఒక దశలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. కానీ, ఇప్పుడు పోరాడే వయసు, శక్తి నాకు వచ్చాయ`ని ఆమె చెబుతోంది. 

Updated Date - 2021-06-17T22:55:45+05:30 IST