ఎవరిని అడిగి విలీనం చేశారు..?

ABN , First Publish Date - 2022-07-07T06:12:28+05:30 IST

పాఠశాలల విలీనం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎవరిని అడిగి విలీనం చేశారని సీఎం జగనను మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌ ప్రశ్నించారు.

ఎవరిని అడిగి విలీనం చేశారు..?
విలేకరుల సమావేశంలో పరిటాల సునీత, శ్రీరామ్‌

విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్న సీఎం జగన

మాజీ మంత్రి  పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌

రామగిరి, జూలై 6: పాఠశాలల విలీనం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎవరిని అడిగి విలీనం చేశారని సీఎం జగనను మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌ ప్రశ్నించారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటాపురంలోని తమ స్వగృహంలో బుధవారం సాయంత్రం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హేతుబద్ధత లేకుండా 3, 4, 5, తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం సరికాదని అన్నారు. విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులను సంప్రదించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వ చర్యలు చూస్తుంటే పాఠశాలలను పూర్తిగా ఎత్తివేసే కుట్ర జరుగుతున్నట్లు అనుమానం కలుగుతోందని అన్నారు. కనగానపల్లి మండలం, మామిళ్లపల్లి, మద్దలచెరువు ప్రాథమిక పాఠశాలలను విలీనం చేయడాన్ని తప్పుబట్టారు. పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులే ఆందోళన చేస్తున్నారని, దీన్నిబట్టి సీఎం జగన నిర్ణయం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చని అన్నారు. పాఠశాలలను పునఃప్రారంభించిన తొలిరోజే తల్లిదండ్రులు ఆందోళన చేశారని అన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులే ఉపాధ్యాయులను బయటకు పంపి, పాఠశాలలకు తాళాలు వేశారని అన్నారు. 2 కి.మీ. దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలలకు తమ   బిడ్డలను పంపేది లేదని తల్లిదండ్రులు తెగేసి చెబుతున్నారని, దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం జగన పునరాలోచించి, విలీనాలను ఆపాలని డిమాండ్‌ చేశారు. లేదంటే టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద    ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ మండల కన్వీనర్‌ సుధాకర్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T06:12:28+05:30 IST