పంజాబ్ పేరు పాడు చేయాలని చూస్తే వదిలిపెట్టం: సీఎం మాన్

ABN , First Publish Date - 2022-05-10T16:31:59+05:30 IST

దీనిని ఆధారం చేసుకుని పంజాబ్ పేరును పాడు చేయాలని చూడొద్దని, అలాంటి ప్రయత్నాలు చేసే వారిని వదిలిపెట్టేది లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హెచ్చరించారు. ఈ ఘటనపై రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, తొందరలోనే వాస్తవాలు..

పంజాబ్ పేరు పాడు చేయాలని చూస్తే వదిలిపెట్టం: సీఎం మాన్

చండీగఢ్: పంజాబ్‌లోని మొహాలీలో ఉన్న రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం రాత్రి పేలుడు సంభవించింది. అయితే పంజాబ్ పేరును పాడు చేయాలని చూడొద్దని, అలాంటి ప్రయత్నాలు చేసే వారిని వదిలిపెట్టేది లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హెచ్చరించారు. ఈ ఘటనపై రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, తొందరలోనే వాస్తవాలు వెల్లడవుతాయని స్పష్టం చేశారు. ‘‘మొహాలీ పేలుడపై పంజాబ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంజాబ్ పేరును పాడు చేయాలని ఎవరు చూసినా వదిలిపెట్టేది లేదు’’ అని సీఎం మాన్ అన్నారు.


కాగా, ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ దాడి పిరికిపందల చర్యగా ఆయన చెప్పుకొచ్చారు. నిందితులు శిక్ష అనుభవించాల్సిదేనని అని అన్నారు. ‘‘పంజాబ్‌లోని ప్రశాంత వాతావరణాన్ని దెబ్బ తీయాలనే మొహాలీలో బాంబ్ బ్లాస్ట్ చేశారు. ఇది పిరికిపందల చర్య. పంజాబ్ ప్రజల ఆకాంక్షలు నెరవేరే వరకు పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం వెనకడుగు వేయదు. ప్రజల సహకారంతో పంజాబ్‌లో ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. అదే సమయంలో నిందితులు శిక్ష అనుభవించక తప్పదు’’ అని కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా అన్నారు.


మొహాలీలో ఉన్న రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ హెడ్‌క్వార్టర్స్‌ భవనంలో పేలుడుతో మూడో అంతస్తులో ఉన్న ఓ కిటికీ, గోడలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. పేలుడు పదార్థం క్యాడ్రిడ్జ్‌ ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. అది రాకెట్‌-ప్రొపెల్డ్‌ గ్రనేడ్‌(ఆర్పీజీ)గా స్పష్టమవుతోంది. ఆర్పీజీలను గ్రనేడ్‌ లాంచర్ల ద్వారా ప్రయోగిస్తారు. ఇటీవల పంజాబ్‌లోని కర్నాల్‌, తరణ్‌తరణ్‌ ప్రాంతాల్లో ఖలిస్థానీ ఉగ్రవాదులను అరెస్టు చేసి, పేలుడు పదార్థాల స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్‌ భవనంపై దాడి జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. పోలీసులు మాత్రం ఉగ్రవాదుల నుంచి సీజ్‌ చేసిన పేలుడు పదార్థాలను ఇంటెలిజెన్స్‌ కార్యాలయ భవనంలోని మూడో అంతస్తులో భద్రపరుస్తామని, వాటిల్లో ఒకటి పేలి ఉంటుందని చెబుతున్నారు.

Read more