సర్కారును ఎవరు ఎవరు కొట్టాలి!?

ABN , First Publish Date - 2022-06-03T08:32:37+05:30 IST

‘‘నాపై ఇప్పటికే 23 కేసులు ఉన్నాయి. మీరు పెడితే ఇంకోటి పెరుగుతుంది. అంతే! అయినా..

సర్కారును ఎవరు ఎవరు కొట్టాలి!?

  • పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌
  • జక్కంపూడి రాజాకు ఇంజనీర్ల సూటిప్రశ్న
  • ‘చెంప దెబ్బల’పై అర్ధరాత్రి పంచాయితీ
  • బాధిత ఇంజనీర్‌కు చీకట్లో ఎమ్మెల్యే ‘సారీ’
  • ఉన్నతాధికారులు, పెద్దల జోక్యంతో రాజీ
  • కేసు నమోదు చేయని పోలీసులు
  • చర్యలు తీసుకోవాల్సిందే: ఇంజనీర్ల సంఘాలు
  • మంత్రి, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌కు ఫిర్యాదు
  • సీఎం జోక్యం చేసుకోవాలని వినతి


సమస్యలపై ప్రశ్నించేందుకు ప్రతిపక్ష నేతలు అధికారిని కలిసేందుకు వెళితే... ‘విధి నిర్వహణకు ఆటంకం కలిగించారంటూ కేసు’ నమోదవుతుంది. వీలైతే... ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టేస్తారు. కానీ... వైసీపీ నేతలు అధికారులను తిట్టినా, కొట్టినా ‘నో కేస్‌!’ నలుగురి మధ్య మూడు చెంపదెబ్బలు కొట్టి... అర్ధరాత్రి చీకట్లో రెండక్షరాల ‘సారీ’తో సరిపెట్టడమే!



(రాజమహేంద్రవరం/అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘‘నాపై ఇప్పటికే 23 కేసులు ఉన్నాయి. మీరు పెడితే ఇంకోటి పెరుగుతుంది. అంతే! అయినా.. కష్టపడి చేసిన పనులకు డబ్బులు ఇవ్వకపోతే ఏం చేయాలి? పనిచేసిన వారికి నేనేం చెప్పాలి?’’

..ఇది ఇంజనీర్లకు వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రశ్న!

‘‘ఎప్పుడో చేశామంటున్న, మాకు అసలు తెలియని పనికి ఎస్టిమేట్లు తయారు చేయకపోతే కొడతారా? పనులన్నీ పూర్తి చేసినా అనేకమంది కాంట్రాక్టర్లకు ప్రభుత్వమే బిల్లులు చెల్లించడంలేదు. మరి... వాళ్లు ఎవరిని కొట్టాలి?’’

..ఇది ఇంజనీర్ల సూటిప్రశ్న!

రెండేళ్ల కిందట పుష్కర కాలువ పరిధిలో తన అనుచరులు చేసిన పనులకు తాజా ధరలతో 


ఎసిమేట్లు తయారు చేయలేదనే అక్కసుతో జక్కంపూడి రాజా సంబంధిత ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సూర్యకిరణ్‌ను ఇతర అధికారుల సమక్షంలో మూడుసార్లు చెంపపై కొట్టిన సంగతి తెలిసిందే. నలుగురి మధ్య కొట్టిన ఆయన, అర్ధరాత్రి దాటాక ‘చీకట్లో’ సదరు ఇంజనీరుకు ‘సారీ’ చెప్పారు. అదికూడా అయిష్టంగా, అన్యమనస్కంగానే! విశ్వసనీయ సమాచారం ప్రకా రం... ఎమ్మెల్యే తీరు తీవ్ర విమర్శలకు గురికావడం, సూర్యకిరణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం బాగా ఇరుకునపడింది. విషయం కేసుదాకా పోకుండా ప్రభుత్వ పెద్దలు, ఇంజనీరింగ్‌ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. బుధవారం అర్ధరాత్రిదాకా పోలీసు స్టేషన్‌లోనే ఉన్న ఏఈ సూర్యకిరణ్‌ను, ఇతర ఇంజనీర్లను ఉన్నతాధికారులు బయటికి పిలిపించారు. రాజమహేంద్రవరం బాలాజీపేటలోని వైసీపీకి చెందిన న్యాయవాది గొందేసి శ్రీనివాసరెడ్డి ఇంటి పెంట్‌ హౌస్‌లో వారిని కూర్చోబెట్టారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా అక్కడికి వచ్చారు. ఎవరూ  సెల్‌ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీయడానికి వీలులేకుండా లైట్లన్నీ ఆర్పేశారు. ఒక చిన్న లైటు మాత్రం ఉంచారు. ఎమ్మెల్యే రాజా మొదట క్షమాపణ చెప్పడానికి ఇష్టపడలేదు. ప్రభుత్వ పెద్దల నుంచీ ఫోన్లు రావడం, పరిస్థితిని చేయిదాటనీయవద్దని చెప్పడంతో దిగి వచారు. ‘చేసిన పనులకు డబ్బులు రానందునే ఈ పరిస్థితి వచ్చింది’ అని ఎమ్మెల్యే చెప్పడంతో ‘మరి, ప్రభుత్వం పెట్టిన పెండింగ్‌ బిల్లుల మాటేమిటని’ ఇంజనీర్లు ప్రశ్నించారు. ఆ తర్వాత... ‘‘నాకు, నా కుటుంబానికి అధికారులంటే ఎంతో ఇష్టం. మా నాన్న రామ్మోహనరావు కూడా అధికారులతో బాగా ఉండేవారు. ఇవాళ ఏదో అలా జరిగింది. ఇక ఎప్పుడూ ఇలా జరగదు. నన్ను క్షమించండి’’ అని ఎమ్మెల్యే సారీ చెప్పారు. 


కొట్టి క్షమాపణ చెబితే సరిపోతుందా?

ఎమ్మెల్యే రాజాకు వ్యతిరేకంగా అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై చర్య తీసుకోవాలని మంత్రి అంబటి రాంబాబు, జల వనరుల శాఖ ఇంజనీరు ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డిలను కోరింది. దీనిపై విచారణ జరిపిస్తానని సంఘం నేతలకు మంత్రి అంబటి హామీ ఇచ్చారు. ‘‘విధినిర్వహణలో ఉన్న ఇంజనీరుపై ఎమ్మెల్యే చేయి చేసుకోవడం సరైన పద్ధతి కాదు. మళ్లీ ఇలాంటివి పునరావృతమయితే రాష్ట్ర ఉద్యోగులంతా ఏకమై పోరాడాల్సి వస్తుంది’’ అని అసిస్టెంట్‌ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టీ.నాగేశ్వరరావు, కార్యదర్శి డీ భార్గవ్‌ప్రకాశ్‌ హెచ్చరించారు. 


ఎమ్మెల్యేను అరెస్టు చేయాల్సిందే.. 

 ఇంజనీర్‌ సూర్యకిరణ్‌ను కొట్టిన ఎమ్మెల్యే రాజాను అరెస్టు చేయాల్సిందేనని ఏపీ ఇంజనీర్ల ఫెడరేషన్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాల్సిందేనని ఆ ఫెడరేషన్‌ చైర్మన్‌ మురళీకృష్ణనాయుడు, కార్యదర్శి సంగీతరాజు తేల్చిచెప్పారు. ‘‘రెండేళ్ల కిందట కాలువలో పూడిక తీసినందుకు బిల్లు చెల్లించాలని ఎమ్మెల్యే పట్టుపట్టారు. ఇంజనీర్‌ ఆ బిల్లును రికార్డు చేసి సీఎ్‌ఫఎంఎ్‌సలో రెండేళ్ల కింద పెట్టారు. అయితే ప్రభుత్వం చెల్లింపులు చేయలేదు. అన్నీ శాఖలకు సంబంధించి పెద్ద మొత్తంలో చెల్లించాల్సిన బిల్లులు ఆర్థికశాఖలో పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు చెల్లింపుల కోసం ఎమ్మెల్యే ఆర్థికశాఖతో సంప్రదించకుండా ఇంజనీర్‌పై దాడి చేయడం సరికాదు. ఇలాంటి చర్యలు ఇంజనీర్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి’’ అని కోరారు.

Updated Date - 2022-06-03T08:32:37+05:30 IST