మా గోడు వినేదెవరు...?

ABN , First Publish Date - 2021-11-27T06:09:24+05:30 IST

అన్నమయ్య ప్రాజెక్టు తెగి నదీ పరీవాహక ప్రాంతం 25 కిలోమీటర్ల మేర పూర్తిగా వరద ప్రవహించి సుమారు 20 గ్రామాలు నీటమునిగాయి. ఈ గ్రామాల పొలాలన్నీ ఇసుక మేటతో ఎడారిని తలపిస్తున్నాయి.

మా గోడు వినేదెవరు...?
తమను వేరే ప్రాంతాలకు తరలించాలని వేడుకుంటున్న హేమాద్రివారిపల్లె వాసులు

వరదొచ్చినప్పుడల్లా ఊరు వదలాల్సిందే.. 

తినేదానికి తిండి.. తాగడానికి నీళ్లు కరువు

ఊరు వదిల్తే గానీ బతకలేం.... 

హేమాద్రివారిపల్లె వాసుల దీనగాథ

రాజంపేట, నవంబరు 26: అన్నమయ్య ప్రాజెక్టు తెగి నదీ పరీవాహక ప్రాంతం 25 కిలోమీటర్ల మేర పూర్తిగా వరద ప్రవహించి సుమారు 20 గ్రామాలు నీటమునిగాయి. ఈ గ్రామాల పొలాలన్నీ ఇసుక మేటతో ఎడారిని తలపిస్తున్నాయి. కరెంటు స్తంభాలు నేలకొరిగి విద్యుత సౌకర్యం లేదు. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. రక్షిత మంచినీటి పథకాలు దెబ్బతిని తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. పులపత్తూరు, తొగూరుపేట, మందపల్లె, గుండ్లూరు, రామచంద్రాపురం తదితర ప్రాంతాలలో ఎక్కువ నష్టం జరగడంతో అధికార యంత్రాంగం ఆ ప్రాంతాలపై మాత్రమే దృష్టి సారించింది. అయితే మిగిలిన పల్లెల వైపు అధికార యంత్రాంగం దృష్టి సారించలేదని ఆయా గ్రామస్థులు వాపోతున్నారు. ఇందులో మొట్టమొదటి మునక ప్రాంతం అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక గ్రామ పంచాయతీ పరిధిలోని హేమాద్రివారిపల్లె. మా గ్రామాన్ని అధికారులెవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామాన్ని గురువారం ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయిలో పరిశీలించింది. 


ఊరిని వేరే చోటికి మార్చండి...

-హేమాద్రిపల్లె వాసులు 

చెయ్యేటిలో ఎప్పుడూ నీరొచ్చినా మా ఊరు మునిగిపోతుంది. చెయ్యేటి ఒడ్డున మా ఊరు ఉండటమే మాకు శాపంగా మారింది. ఎగువన ఎప్పుడు అన్నమయ్య ప్రాజెక్టు కట్టినారో మా బతుకులు పూర్తిగా నాశనమైపోయాయి. నిరుడు సంవత్సరం ఇదే మాదిర వరదొస్తే తాళ్లపాకకు వెళ్లి తలదాచుకోవాల్సి వచ్చింది. ఊర్లో ఉన్న వాళ్లమంతా ఎస్సీ వర్గానికి చెందిన వాళ్లం. మా గురించి పట్టించుకునే వాళ్లు లేరు. మొన్న వచ్చిన వరదలో మా ఊరు నట్టినడిదాల చిక్కుకుంది. ముందుగానే వరదొస్తుందని చెప్పారు కాబట్టి అనేక మందిమి తాళ్లపాకకు వెళ్లిపోయాం. మగోళ్లు మిద్దెలపైకి ఎక్కున్నారు. శుక్రవారం ఉదయం ఏడున్నర గంటలకు ఒక్కసారిగా మా ఊరిని నీళ్లు చుట్టుముట్టాయి. ఎటు చూసినా తాటిచెట్టంత వరద ఊరిలో చేరిపోయింది. ఊర్లో నుంచి బయటకొచ్చాం కాబట్టి బతికిపోయాం. మాతో పాటు మాకు ఆధారమైన గొడ్డుగోదంతా కొట్టుకొనిపోయాయి. 200 ఎనుములు కనపడకుండా పోయాయి. కేవలం పది పశువులు కనిపిస్తావున్నాయి. ఎవరికీ సెంటు భూమి లేదు. మొత్తం రైతుల పొలాల్లోకెళ్లి కూలీనాలీ చేసుకుని బతికేవాళ్లం. ఉన్న ఎనుములను మేపుకుంటూ వాటి పాలతో బతుకుతున్నాం. తాళ్లపాక నుంచి మా ఊరుకొచ్చే దారంతా కొట్టుకుపోయింది. మొన్నాటి నుంచి వానలున్నాయని భయపెడుతున్నారు. ఈసారి వరదొస్తే ఊరంతా వల్లకాడైపోతుంది. వారం రోజులుగా కరెంటు లేదు. కిలోమీటరు మేర గతంలో ఉన్న చేలల్లో ఇప్పుడు ఏరు పడింది. ఇక మా వల్ల కాదు. ఇప్పటికైనా దయతలిచి మమ్ములను నీళ్లు రాని చోటికి తరలించి అక్కడ మాకు ఇళ్లు కట్టించండి. అక్కడికి ఎళ్లిపోతాం... అని దీనంగా వేడుకుంటున్నారు. గ్రామంలోని ఆ పాఠశాలను, అంగనవాడీ కేంద్రాన్ని ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించింది. అక్కడ రవిశంకర్‌ అనే ఉపాధ్యాయుడు 20 మంది విద్యార్థులతో బిక్కుబిక్కుమని వరద బీభత్సపు చెయ్యేటిని ఆనుకుని ఉన్న బడిలో పాఠాలు చెబుతున్నాడు. చిన్నారులను పలకరించగా మమ్మల్నంతా ముందురోజే ఊర్లో నుంచి తీసుకుపోయినారని అందువల్ల మాకేమీ తెలియదని చెప్పారు.


మా ఊరిని వేరే ప్రాంతానికి మార్చండి

- కాంతమ్మ, హేమాద్రివారిపల్లె

మా ఊరిని వేరే ప్రాంతానికి మార్చండి. సంవత్సరం సంవత్సరం నీళ్లొచ్చినాయంటే ఊర్లో నుంచి బయటకు పోవాల్సి వస్తోంది. ఇంటి మొత్తం బయటకు పోవాలంటే ప్రాణానికొస్తాంది. ఇప్పుడు చుట్టూ ఏరు పడింది. ఇక ఉండలేం. ఇక వరదొస్తే మేము ఏట్లోనే చావాల్సి వస్తుంది. కాబట్టి మా ఊరిని వేరే ప్రాంతానికి మార్చండి.


బయటకు పోకపోయుంటే అంతా సచ్చేవాళ్లం 

- నాగార్జునమ్మ, హేమాద్రివారిపల్లె

ఊర్లో నుంచి బయటకు పోకపోయుంటే మేమంతా ప్రాణాలతో ఉండేవాళ్లం కాదు. ముందు రోజు చెప్పినారు కాబట్టి అంతా బయటకు పోయి ప్రాణాలతో బతికాం. ఇప్పుడు వచ్చిన ఇంత వరదను మేమెప్పుడూ చూడలే. ఇక చూసే ఓపికా మాకు లేదు. మా ఊర్లో ఏమీ లేకుండా పోయినాయి. ఇక ఊర్లో మేముండలేం. 


ఇక ఊరున్నా ప్రయోజనం లేదు

- నరసింహరాజు, హేమాద్రివారిపల్లె

కింద ఏరు ఉండేది. ఇప్పుడు పైన కూడా చేలన్నీ ఏరుగా మారిపోయాయి. ఇక నీళ్లొస్తే ఇక పైనాకింద వరదొస్తుంది. నట్టినడి మధ్య ఊరుంటుంది. ఇప్పుడికే రోడ్డు, పొలాలు ఏమీ లేకుండాపోయాయి. ఇక ఉండినా ప్రయోజనం లేదు. ఇప్పటికైనా ఊర్లో నుంచి బయటపడితే ఎక్కడో చోట బతికుంటారు. అధికారులు స్పందించి మమ్ములను కాపాడాలి.


తినడానికి తిండిలే... తాగడానికి నీళ్లులే..

- తాళ్లపాక లక్షుమ్మ, హేమాద్రివారిపల్లె

పైన ప్రాజెక్టు ఎట్ట కట్టినారో ఏమో కానీ అది నిండింది అంటే చాలు మాకు ఒకటే భయం. అది ఇప్పటికీ మూడుమాట్లు తెగింది. మా ఊరంతా ఆ వరదలో కోసుకుపోయి తగ్గైపోయింది. వరదొస్తే మా ఊరుపై పడుతోంది. దీంతో మాకు తినేదానికి తిండి, తాగడానికి కూడా నీళ్లు లేకుండాపోయాయి. ఇక ఈ ఊర్లో ఉంటే ప్రాణాలను పోగొట్టుకోవాల్సిందే.

Updated Date - 2021-11-27T06:09:24+05:30 IST