గులాబీ బాస్‌ ఎవరో?

ABN , First Publish Date - 2021-10-17T05:27:03+05:30 IST

ఉద్యమ పార్టీగా అవతరించి స్వరాష్ట్రంలో రెండోసారి అధికారాన్ని చేజికిచ్చుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్ష పీఠానికి తీవ్ర పోటీ నెలకొంది.

గులాబీ బాస్‌ ఎవరో?

- టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ
- బరిలో ఉద్యమ, కొత్తగా చేరిన నాయకులు
- అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న తొమ్మిది మంది నేతలు
- ఇప్పటికే మంత్రితో సమావేశమైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- నలుగురు పేర్లను అధిష్ఠానానికి నివేదించిన ప్రతినిధులు
- సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల వద్ద జిల్లా అధ్యక్షుల జాబితా
- త్వరలోనే జిల్లా అధ్యక్షుడిని ప్రకటించనున్న అధిష్ఠానం

కామారెడ్డి, అక్టోబరు 16(ఆంఽధ్రజ్యోతి): ఉద్యమ పార్టీగా అవతరించి స్వరాష్ట్రంలో రెండోసారి అధికారాన్ని చేజికిచ్చుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్ష పీఠానికి తీవ్ర పోటీ నెలకొంది. జిల్లా ఏర్పాటు తర్వాత ఐదేళ్లుగా రథసారధులు లేకుండానే నెట్టుకొస్తున్న పార్టీ ప్రస్తుతం జిల్లా అధ్యక్షుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసుల లాఠీ దెబ్బలు, జైలు జీవితం అనేక కేసులతో కోర్టు చుట్టూ తిరిగినా నాటి నేటి టీఆర్‌ఎస్‌ శ్రేణులు కారు స్టీరింగ్‌పై కన్నేశారు. ఇదే సమయంలో పార్టీని సంస్థాగతంగా మరింత పట్టిష్టవంతం చేసేందుకు అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామ, మండల, అనుబంధ కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కాగా ఇక జిల్లాపైనే అందరి చూపు ఉంది. కొత్త జిల్లా గులాబీ బాస్‌ ఎవరనే దానిపై టీఆర్‌ఎస్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది. అధ్యక్ష పదవికై జిల్లాలో 9 మంది సీనియర్‌ నేతలు పోటీ పడుతున్నారు. జిల్లా అధ్యక్షుడి ఎంపికకై ఇప్పటికే మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవితతో జిల్లా ప్రజాప్రతినిధులు సమావేశమయినట్లు తెలిసింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడి కోసం నలుగురు పేర్లను ప్రతిపాదించి సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీఆర్‌కు నివేదించినట్లు సమాచారం. జిల్లా అధ్యక్షుల జాబితా అధిష్ఠానం వద్ద ఉంది. త్వరలోనే జిల్లా అధ్యక్షులను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించనుంది.
పూర్తయిన గ్రామ, మండల, అనుబంధ కమిటీల ఎంపిక
రాష్ట్రంలో చిన్న జిల్లాలు ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కమిటీలను నియమించలేదు. 2017 సంవత్సరంలో జిల్లా కమిటీల ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్లు మాత్రమే ఉండడంతో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. పటిష్టమైన గ్రామ, మండల, అనుబంధ జిల్లా కమిటీల నియామకం చేసేలా మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. గ్రామాల వారీగా సభ్యత్వం పూర్తిచేసి కమిటీలను ఏర్పాటు చేసేందుకు పార్టీలోకి ముఖ్యులకు ఆ బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం గ్రామ, మండల అనుబంధ కమిటీల నియామకం పూర్తయింది. జిల్లా కమిటీల ఎంపికపై సర్వత్రా చర్చ మొదలైంది. జిల్లా టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కామారెడ్డి మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ పేరును ప్రతిపాదించినట్లు ఆ పార్టీలో చర్చ సాగుతోంది. జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కనుందోనని టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
అధ్యక్షుడి రేసులో తొమ్మిది మంది నేతలు
టీఆర్‌ఎస్‌ సంస్థాగత నిర్మాణంలో కీలకమైన పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని దక్కించుకోవడానికి పలువురు సీనియర్‌ నేతల మధ్య రసవత్తర పోటీ నెలకొంటుంది. కామారెడ్డి కొత్త జిల్లాగా ఏర్పడి అధికార పార్టీకి చెందిన జిల్లా అధఽ్యక్ష పదవిని మొదటిసారిగా ఎన్నుకునే అవకాశం ఉన్నందున ఆ పదవిని దక్కించుకునేందుకు పలువురు సీనియర్‌ నేతలు పోటీ పడుతున్నారు. దీంతో అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంటుంది. ప్రస్తుతం తొమ్మిది మంది నేతలతో పాటు మరో నలుగురు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం.  ఇప్పటికే ఆయా నియోజకవర్గాల నుంచి అధ్యక్ష పదవి కోసం స్థానిక ఎమ్మెల్యేలను ఆశావహులు సంప్రదించి అధ్యక్ష పదవి కేటాయించాలని కోరారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి నిట్టు వేణుగోపాల్‌, గడ్డం చంద్రశేఖర్‌రెడి, లోయపల్లి నర్సింగ్‌రావు, మామిండ్ల అంజయ్య పోటీ పడుతుండగా బాన్సువాడ నియోజకవర్గం నుంచి స్పీకర్‌ తనయుడు సురేందర్‌రెడ్డి రేసులో ఉన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి గాంధారి మండల అధ్యక్షుడు సత్యంరావు పాటిల్‌  మాజీ జడ్పీటీసీ తానాజీరావు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సంపత్‌గౌడ్‌, జుక్కల్‌ నియోజకవర్గం నుంచి వెంకట్‌రెడ్డిలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు మరో నలుగురు అధ్యక్ష పదవిని ఆయా ఎమ్మెల్యేలకు అడిగినట్లు తెలిసింది.
రసవత్తర పోటీ
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన నాయకులు, జిల్లా అధ్యక్ష బరిలో పోటీ పడుతుంటే వివిధ పార్టీల నుంచి గులాబీ కండువా కప్పుకున్న వారు కూడా నేను సైతం అంటున్నారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్‌, హన్మంత్‌షిండే, జాజాల సురేందర్‌ల ఆశీస్సుల కోసం ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన కొంత మంది నాయకులు అధ్యక్ష స్థానం తమకేనని ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. దీంతో జిల్లా అధ్యక్ష పదవి, మంత్రి, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు తలకు మించిన భారంగా మారింది. నెలరోజుల ముందుగానే కారు స్టీరింగ్‌ తమకు అప్పగించాలని చాలా మంది నాయకులు దరఖాస్తులు చేసుకోవడంతో ఏ నిర్ణయం తీసుకోవాలని సందిగ్ధంలో పడిపోయారు. మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఈ విషయంలో ఇటీవల సమావేశమై చర్చించినట్లు తెలిసింది. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ కోసం కష్టపడ్డ వారికి చాన్స్‌ ఇవ్వాలా...? లేదా ఆయా పార్టీల నుంచి చేరిన వారికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసినట్లు పార్టీలో చర్చసాగుతోంది. ఇప్పటికే మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవితతో సమావేశమైన జిల్లా ప్రజాప్రతినిధులు నలుగురు పేర్లను జిల్లా అధ్యక్షుడికై ప్రతిపాదించి అధిష్ఠానానికి నివేదించినట్లు తెలిసింది. ఆ నలుగురు నేతలు ఎవరనే దానిపై పార్టీలో చర్చసాగుతోంది.
సీఎం మనసులో ఎవరున్నారు?
జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ సీఎం కేసీఆర్‌దే తుది నిర్ణయమని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేఫథ్యంలో సీఎం కేసీఆర్‌ మనస్సులో జిల్లా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారనేదానిపై పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. ఈ నెల చివరికల్లా టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేఽశాలను నిర్వహించనున్నారు. ఆ ప్లీనరీలోనే రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎన్నిక చేపట్టనున్నారు. అప్పటిలోగా జిల్లా అధ్యక్షులతో పాటు పూర్తిస్థాయి కమిటీని నియమించాలని అధిష్ఠానం ఉన్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే ఆయా జిల్లాల అధ్యక్షుల జాబితా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌తో పాటు సీఎం కేసీఆర్‌ వద్ద ఉన్నట్లు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో సీఎం కేసీఆరే జిల్లా అధ్యక్షుల పేర్లను ఖరారు చేయనున్నట్లు సమాచారం. అనంతరం అధికారికంగా పార్టీ అధిష్ఠానం జిల్లా అధ్యక్షుల పేర్లను ప్రకటించనున్నట్లు ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. ఈ నేఫథ్యంలో సీఎం కేసీఆర్‌ మనస్సులో జిల్లా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారనే దానిపై పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవితతో చర్చించిన జిల్లా ప్రజాప్రతినిధులు నలుగురు పేర్లను ప్రతిపాదించి సీఎం కేసీఆర్‌కు నివేదించారు. వీరిలో ఎవరు జిల్లా అధ్యక్షుడిగా నియమితులవుతారో వేచి చూడాలి.

Updated Date - 2021-10-17T05:27:03+05:30 IST