వ్యవసాయ వర్సిటీ కొత్త వీసీ ఎవరో..?

ABN , First Publish Date - 2022-07-21T17:26:40+05:30 IST

ప్రొఫెసర్‌ జయశంకర్‌ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ పదవీ కాలం ఈ నెల 24తో ముగియనుంది. కొత్త వీసీ ఎవరనేది ఉత్కంఠగా మారింది. రాష్ట్రం ఏర్పడ్డాక

వ్యవసాయ వర్సిటీ కొత్త వీసీ ఎవరో..?

హైదరాబాద్/రాజేంద్రనగర్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ పదవీ కాలం  ఈ నెల 24తో ముగియనుంది. కొత్త వీసీ ఎవరనేది ఉత్కంఠగా మారింది. రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయ విశ్వ విద్యాలయానికి  2014 నుంచి 2016 వరకు స్పెషల్‌  ఆఫీసర్‌గా, ఆ తర్వాత ఆరేళ్ల పాటు వైస్‌ చాన్సలర్‌గా డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావు కొనసాగారు. అంతకు ముందు సంవత్సరం పాటు అంటే 2013లో వర్సిటీకి ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా కూడా ఆయన పని చేశారు. ఆయన హయాంలో నూతన వంగడాలను కనుగొన్నారు. వర్సిటీ  జాతీయ స్థాయిలో 6వ ర్యాంకు సాధించింది. అదే సమయంలో వర్సిటీకి వైస్‌ చాన్సలర్‌గా, రిజిస్ట్రార్‌గా ఒకే సామాజిక వర్గం వారు ఉన్నారనే విమర్శలూ ఉన్నాయి. 


పూర్తి స్థాయిలో..

వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పూర్తి స్థాయి వైస్‌ చాన్సలర్‌ను నియమించాల్సిన అవసరం ఉంది. పరిశోధనా సంచాలకులు, డీన్‌  అగ్రికల్చర్‌,  డైరెక్టర్‌ ఆఫ్‌ ఎక్స్‌టెన్షన్‌, డీన్‌ పీజీ స్టడీస్‌, డీన్‌ కమ్యూనిటీ సైన్స్‌ లాంటి ఉన్నత పదవుల్లో కూడా పూర్తి స్థాయి అధికారులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి వైస్‌ చాన్సలర్‌గా నియమిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 


పోటీలో పలువురు

ఈ దఫా తమకు అవకాశం కల్పించాలని ప్రస్తుత రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌.సుధీర్‌కుమార్‌, ప్రొఫెసర్‌ డాక్టర్‌ అల్దాస్‌ జానయ్య, గతంలో పరిశోధనా సంచాలకులుగా పనిచేసిన డాక్టర్‌ డి.రాజిరెడ్డి, రిజిస్ట్రార్‌గా పనిచేసిన డాక్టర్‌ జలపతిరావు, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎక్స్‌టెన్షన్‌గా పనిచేసిన డాక్టర్‌ పోచయ్య మరాఠిలు కోరుతున్నట్లు సమాచారం. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నుంచి ఎవరూ వీసీలుగా నియమితులు కాలేదని, ఈ సారి ఆ వర్గాలకు చెందిన వారిని వీసీగా నియమించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

Updated Date - 2022-07-21T17:26:40+05:30 IST