‘రాష్ట్ర బ్యాడ్మింటన్‌’ కొత్త అధ్యక్షుడెవరు?

ABN , First Publish Date - 2022-05-22T09:25:40+05:30 IST

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు నాయకత్వంలో గత నాలుగేళ్లు ప్రగతి పథంలో నడిచిన తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతోంది.

‘రాష్ట్ర బ్యాడ్మింటన్‌’ కొత్త అధ్యక్షుడెవరు?

కార్యవర్గ ఎన్నిక నేడే

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు నాయకత్వంలో గత నాలుగేళ్లు ప్రగతి పథంలో నడిచిన తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆదివారం ఫిలింనగర్‌లోని ఎఫ్‌ఎన్‌సీసీ క్లబ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేటీఆర్‌ మరోసారి అధ్యక్ష పదవి చేపట్టనున్నారా? లేదా ఆయన స్థానంలో కొత్త వ్యక్తి రానున్నారా? అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధ్యక్షుడి స్థానం మినహా మిగిలిన అన్ని పదవులకు గత కార్యవర్గంలోని సభ్యులనే ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్టు తెలుస్తోంది. ఉపాధ్యక్షుడిగా చాముండేశ్వర్‌నాథ్‌, ప్రధాన కార్యదర్శిగా పుల్లెల గోపీచంద్‌, కోశాధికారిగా పాణీరావు ఎన్నిక లాంఛనమేనని సమాచారం.


అయితే అధ్యక్ష పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలన్న విషయమై ప్రతిష్ఠంభన నెలకొంది. 2 నెలల క్రితం జరిగిన స్పోర్ట్స్‌ పాలసీ మంత్రివర్గ ఉపసంఘం భేటీలో కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలే ఈ ప్రతిష్ఠంభనకు కారణం. ఆ సమావేశంలో కేటీఆర్‌ ‘రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం, ఇతర క్రీడా సంఘాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి. ఈ సంఘాలు అసలేం చేస్తున్నాయో ఎవరికీ తెలియదు. ఈ విధానం మారాలంటే క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు. ఈ మార్పును నా నుంచే మొదలుపెడతా. త్వరలో బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడిగా రాజీనామా చేస్తా. క్రీడా సంఘాల నిర్వహణలో మాజీ క్రీడాకారులు, క్రీడారంగ నిపుణులకు అవకాశమివ్వాలి’ అని అన్నారు. కేటీఆర్‌ ఈ ప్రకటన చేసి రెండు నెలలపైనే కావస్తోంది. ఈసారి ఎన్నికల్లో కేటీఆర్‌ దాదాపు పోటీ చేసే అవకాశాలు లేకపోవడంతో కొత్త అధ్యక్షుడు ఎవరా? అన్న చర్చ క్రీడా వర్గాల్లో ఊపందుకుంది. 

Updated Date - 2022-05-22T09:25:40+05:30 IST